నగరంలో పల్లె వాతావరణం!

‘మా చిన్నతనంలో.. మా ఊళ్లో’ అంటూ పల్లె వాతావరణం, ఆహారం, మట్టివాసనలను పెద్దవాళ్లు గుర్తు  చేసుకుంటూ ఉండటం ఎన్నిసార్లు గమనించి ఉంటాం. గ్రామాల నుంచి నగరాలకొచ్చిన వాళ్లూ ఊరి విశేషాలను మైమరచి పంచుకొనే సందర్భాలెన్నో!

Published : 15 Feb 2023 00:19 IST

‘మా చిన్నతనంలో.. మా ఊళ్లో’ అంటూ పల్లె వాతావరణం, ఆహారం, మట్టివాసనలను పెద్దవాళ్లు గుర్తు  చేసుకుంటూ ఉండటం ఎన్నిసార్లు గమనించి ఉంటాం. గ్రామాల నుంచి నగరాలకొచ్చిన వాళ్లూ ఊరి విశేషాలను మైమరచి పంచుకొనే సందర్భాలెన్నో! పూజదీ అదే పరిస్థితి. నగరంలోనూ ఆ వాతావరణాన్ని సృష్టించడానికి ఓ కొత్త మార్గం కనిపెట్టింది. అందరి మెప్పూ పొందుతోంది. ఇంతకీ ఏమిటది?

పల్లెటూరి స్వచ్ఛమైన గాలి, మట్టి సువాసనలంటే పూజా రాథోడ్‌కి ప్రాణం. తనది రాజస్థాన్‌లోని రాజ్‌పుత్‌ కుటుంబం. సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వ సంపదకు విలువలెక్కువ. సూర్యచంద్రులు, నిప్పు, భూమికి తమని తాము వారసులుగా భావిస్తారట. ఆ ఆచారాలంటే పూజకి చిన్నతనం నుంచీ ప్రాణం. ఏదైనా పండగొచ్చినప్పుడు అమ్మమ్మ ఇంటి చుట్టూ అలికి ముగ్గులు పెడుతోంటే తనూ సాయం చేసేది. పెరిగింది జయపుర అయినా వారాంతపు సెలవుల్లోనూ అమ్మమ్మ ఊళ్లో వాలిపోయేది. ఆర్ట్స్‌లో మాస్టర్స్‌ చేసింది తను. పల్లె అందాలంటే మక్కువ చూపే తను.. పెళ్లవ్వగానే ఉదయ్‌పూర్‌కి మారాల్సి వచ్చింది. అసలే సిగ్గరి. దీనికితోడు హడావుడితో నిండిన సిటీకి చేరింది. దీంతో పల్లె వాతావరణంపై బెంగ పెట్టేసుకుంది. అప్పుడే తన కొత్త ఇంటినే పల్లె అందాలతో నింపేస్తే అన్న ఆలోచన వచ్చింది తనకు.

‘ఇంట్లో ‘పల్లె వాతావరణం’ అని ఆలోచించినపుడు నాకు తట్టింది బొమ్మలు గీయడమే! అయితే ఆ రంగుల్లోనూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌, రసాయనాలుంటాయి. ప్రత్యామ్నాయాల కోసం వెదికా. ఏవో ఎందుకు? ‘మట్టి’తోనే మార్పు తెద్దానుకున్నా’నంటుంది పూజ. ఆవుపేడ, మట్టి, ఎండినపూలు, చెట్ల జిగురు, మూలికలతో అబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌ మొదలుపెట్టింది. కాన్వాసుపై అందమైన బొమ్మలు తీర్చిదిద్ది ఇంటిని అలంకరించింది. దీన్ని మరింత మందికి చేరువ చేయాలని 2022లో ‘స్టూడియో.దసాయిల్‌’ ప్రారంభించింది.

‘ఆనందాల బాల్యం, మట్టితో ఆడిన ఆటలు, వానలో తడిసిన అనుభూతి, బీచ్‌లో సూర్యాస్తమయం.. వీటి స్ఫూర్తితో మా ఇంటి గోడలను పర్యావరణంతో నింపేశా. వాటన్నింటినీ ఇన్‌స్టాలో పంచుకున్నప్పుడు చాలామంది మెచ్చుకున్నారు. మట్టి సువాసనలు, ప్రకృతిలో గడపడం ఒత్తిడిని దూరం చేసేవే. ఉరుకుల పరుగుల జీవితాల్లో ప్రకృతిని, పర్యావరణ హితమైన వాటినీ చేర్చాలనుకుంటున్నా. నా స్ఫూర్తిగా ఇంకొందరు ముందుకొస్తారన్న చిన్న ఆశ’ అంటున్న పూజ ప్రయత్నం స్ఫూర్తిదాయకమేగా మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్