హోలీ వేళ.. నోరూరించే దేశీ డ్రింక్స్..!

చూడచక్కని రంగుల హోలీ.. బంధుమిత్రులందరితో కలిసి రంగులు చల్లుకుంటూ చేసుకునే పండగ ఇది.. ఈ రోజున రంగులకున్నంత ప్రాధాన్యం హోలీ వేళ తీసుకునే ఆహారపదార్థాలకూ ఉంటుంది. అసలే ఎండాకాలం.. ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి, హోలీ వేళలో అలసట తీర్చుకోవడానికి కూల్‌డ్రింక్స్ బదులుగా ఈ దేశీయ డ్రింక్స్‌ని తాగండి.

Published : 24 Mar 2024 15:53 IST

చూడచక్కని రంగుల హోలీ.. బంధుమిత్రులందరితో కలిసి రంగులు చల్లుకుంటూ చేసుకునే పండగ ఇది.. ఈ రోజున రంగులకున్నంత ప్రాధాన్యం హోలీ వేళ తీసుకునే ఆహారపదార్థాలకూ ఉంటుంది. అసలే ఎండాకాలం.. ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి, హోలీ వేళలో అలసట తీర్చుకోవడానికి కూల్‌డ్రింక్స్ బదులుగా ఈ దేశీయ డ్రింక్స్‌ని తాగండి.. తయారుచేసుకోవడం చాలా సులభం.. పైగా రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా..!


శికంజి

కావాల్సినవి

నిమ్మకాయ - ఒకటి

నీళ్లు - రెండు గ్లాసులు

జీలకర్ర పొడి - టీస్పూన్

నల్ల ఉప్పు - కొద్దిగా

చక్కెర - తగినంత

పుదీనా ఆకులు - కొన్ని

ఐసు ముక్కలు - కొన్ని

తయారీ

ముందుగా ఒక బౌల్‌లో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఆ తర్వాత అందులో నిమ్మరసం పిండుకోవాలి. చక్రాల్లా కోసిన నిమ్మ ముక్కలు రెండు, మూడు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, చక్కెర వేసి కరగనివ్వాలి. ఇప్పుడు కాస్త నలిపిన పుదీనా ఆకులు వేసి మరోసారి కలిపి గ్లాసుల్లో పోసుకోవాలి. ఆపై అందులో నిమ్మ చక్రాలు, ఐసు ముక్కలు వేసి పుదీనా, నిమ్మకాయలతో గార్నిష్ చేసుకోవాలి.


ఠండాయి

కావాల్సినవి

యాలకులు - పది

సోంపు - ఒకటిన్నర టీస్పూన్లు

మిరియాలు - అర టీస్పూన్

ధనియాలు - టీస్పూన్

పొద్దుతిరుగుడు గింజలు - కొన్ని

బాదం పప్పు - 50 గ్రాములు

చక్కెర - ఐదు టేబుల్ స్పూన్లు

రోజ్ వాటర్ - రెండు టేబుల్ స్పూన్లు

పాలు - ముప్పావు లీటర్

తయారీ

ముందుగా మసాలాలన్నింటినీ (సోంపు, మిరియాలు, ధనియాలు, యాలకుల్లోని గింజలు) కలిపి ఒక పెనంపై వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని పొద్దుతిరుగుడు గింజలు, బాదం పప్పుతో కలిపి నీటిలో నానబెట్టుకోవాలి. రెండు గంటల పాటు నానిన తర్వాత దీన్ని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆపై చక్కెర, రోజ్ వాటర్ కూడా కలిపి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. దీనికి పాలను కలిపి వచ్చిన ద్రావణాన్ని మస్లిన్ క్లాత్‌తో వడబోయాలి. ఈ క్రమంలో మిగిలిన పాలను ఫ్రిజ్‌లో పెట్టి, డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి సర్వ్ చేసుకుంటే సరి..


పంజాబీ లస్సీ

కావాల్సినవి

పెరుగు - రెండు కప్పులు

చల్లని నీళ్లు - రెండు కప్పులు

చక్కెర - పది టేబుల్ స్పూన్లు

యాలకుల పొడి - టీస్పూన్

కుంకుమ పువ్వు - కొద్దిగా

రోజ్ వాటర్ - రెండు టీస్పూన్లు

ఐస్ ముక్కలు - కొన్ని

డ్రైఫ్రూట్స్ - కొన్ని

గులాబీ రేకలు - కొన్ని

తయారీ

ఒక పెద్ద బౌల్‌లో పెరుగును తీసుకొని బాగా గిలక్కొట్టాలి. ఇందులో చక్కెర వేసి మళ్లీ బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో చల్లని నీటిని కలుపుకోవాలి. పలుచగా ఉండడం ఇష్టపడని వారు నీళ్ల బదులు పాలు కూడా కలుపుకోవచ్చు. ఆపై యాలకుల పొడి, కుంకుమ పువ్వు, రోజ్ వాటర్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ లస్సీని గ్లాసుల్లో పోసి ఐస్ ముక్కలు వేసి, సన్నగా తరిగిన డ్రైఫ్రూట్స్, గులాబీ రేకలని దానిపై చల్లుకుంటే సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్