Eco Warriors: పర్యావరణమంటే వీళ్లకు ఎనలేని ప్రేమ!

‘ఈ భూమాత మనకెంతో ఇచ్చింది.. మనం కూడా మన కార్యకలాపాలు, పనులతో పర్యావరణానికి నష్టం చేయకుండా పుడమితల్లి రుణం తీర్చుకుందాం..’ అంటూ ప్రతిజ్ఞ చేశారు కొంతమంది యువ పర్యావరణవేత్తలు. అనుక్షణం వాతావరణ పరిరక్షణ కోసం పరితపిస్తూ.. ‘ఏదీ వృథా చేయకుండా వీలైతే నలుగురికి సహాయపడదాం..’ అంటూ అందరికీ పిలుపునిస్తున్నారు.

Updated : 29 Oct 2021 18:54 IST

‘ఈ భూమాత మనకెంతో ఇచ్చింది.. మనం కూడా మన కార్యకలాపాలు, పనులతో పర్యావరణానికి నష్టం చేయకుండా పుడమితల్లి రుణం తీర్చుకుందాం..’ అంటూ ప్రతిజ్ఞ చేశారు కొంతమంది యువ పర్యావరణవేత్తలు. అనుక్షణం వాతావరణ పరిరక్షణ కోసం పరితపిస్తూ.. ‘ఏదీ వృథా చేయకుండా వీలైతే నలుగురికి సహాయపడదాం..’ అంటూ అందరికీ పిలుపునిస్తున్నారు. ఇలాంటి యువ పర్యావరణవేత్తల కృషిని గుర్తించి ‘We The Change’ అనే ప్రచార కార్యక్రమంలో ఇటీవలే చోటిచ్చింది యూఎన్‌ ఇండియా. ఈ క్రమంలో ప్రకృతి పరిరక్షణ కోసం సరికొత్త ప్రణాళికలు రచించమంటూ ఓ బృహత్తర బాధ్యతను వీళ్లకు అప్పగించింది. మొత్తం 17 మందితో కూడిన ఈ బృందంలో తొమ్మిది మంది అమ్మాయిలున్నారు. మరి, ఇంతకీ ఎవరీ యంగ్‌ క్లైమేట్‌ వారియర్స్‌? పర్యావరణ పరిరక్షణ దిశగా వారేం చేస్తున్నారో తెలుసుకుందాం రండి..

ఆ నీటిని పొదుపు చేస్తూ..!

మనం రెస్టరంట్లకు వెళ్లినప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా మనం కూర్చున్న టేబుల్‌పై ఉన్న గ్లాసుల్ని నీటితో నింపేస్తుంటాం. అందులో కావాల్సినన్ని నీళ్లు తాగి మిగతావి అలాగే వదిలేస్తుంటాం. ఇక ఆ నీళ్లు వృథా కిందే లెక్క. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న వందలాది రెస్టరంట్లలో ఏడాదికి 14 మిలియన్‌ లీటర్ల నీళ్లు వృథా అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి ఇవే నీళ్లు.. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నివసించే ఎంతోమంది దాహం తీర్చగలవు.. ఈ ఆలోచన మనకు రాకపోవచ్చు.. కానీ ఈ విషయం తెలుసుకున్న బెంగళూరుకు చెందిన గర్విత గుల్హతి మనసు చలించిపోయింది. ఇలాంటి వృథాకు ఎలాగైనా చరమగీతం పాడాలని నిర్ణయించుకున్న ఆమె.. 2015లో తన స్నేహితురాలితో కలిసి ‘Why Waste?’ అనే సంస్థను స్థాపించింది.
ఈ వేదికగా పలు ప్రచార కార్యక్రమాలు, వర్క్‌షాప్స్‌.. నిర్వహిస్తూ నీటి పొదుపు ప్రాముఖ్యాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తోంది. అంతేకాదు.. దీనిపై పిటిషన్లు వేస్తూ ఎంతోమంది అభిప్రాయాలు సేకరిస్తోంది. ఇలా ఇప్పటివరకు పది మిలియన్‌ లీటర్ల నీటిని పొదుపు చేసిన ఆమె.. వాటితో సుమారు ఆరు మిలియన్ల మంది దాహార్తిని తీర్చగలిగింది. ఇలా ఓవైపు పర్యావరణ పరిరక్షణలో భాగమవుతూనే.. మరోవైపు ఎంతోమంది నీటి అవసరాల్ని తీర్చుతోన్న గర్విత.. తన కృషికి గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక ‘డయానా అవార్డు’, ‘గ్లోబల్‌ ఛేంజ్‌మేకర్‌’ టైటిల్‌తో పాటు ఈ ఏడాది ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా’ జాబితాలోనూ చోటు దక్కించుకుంది.

 

చిన్న పనులు.. పెద్ద మార్పులు!

సాధారణంగా దుస్తులు పాతబడిపోగానే లేదంటే చిరిగిపోగానే వృథా అంటూ వాటిని పక్కన పడేస్తుంటాం.. నిజానికి ఇదీ ఓ రకంగా పర్యావరణానికి హాని చేసినట్లే లెక్క! కానీ ఇలా వృథా అంటూ పడేయడం కంటే వాటిని రీసైక్లింగ్‌ చేసుకొని తిరిగి ధరించడం అన్ని విధాలా మంచిదంటోంది యంగ్‌ ఎకో వారియర్‌ కృతి తుల. ఈ క్రమంలోనే దుస్తుల రీసైక్లింగ్‌ కోసం ‘Doodlage’ అనే సంస్థను సైతం స్థాపించిందామె. ఫ్యాషన్‌పై మక్కువతో ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌’లో చదువు కొనసాగించిన ఆమె.. తాను ఈ పద్ధతిని పాటించడమే కాదు.. నలుగురూ పాటించేలా స్ఫూర్తి రగిలిస్తోంది. ‘మనం మన లైఫ్‌స్టైల్లో చేసుకునే చిన్న చిన్న మార్పులే పరోక్షంగా పర్యావరణాన్ని కాపాడతాయి. ఇందుకోసం నా దుస్తుల్ని రీసైక్లింగ్‌ చేసుకుంటూ నా వంతుగా వృథాను తగ్గిస్తున్నాను.. ఈ విషయంలో మరికొంతమందిలో అవగాహన పెంచుతున్నా. ఇదొక గొలుసుకట్టుగా ముందుకు సాగాలి.. అందరిలో మార్పు రావాలి.. అప్పుడే మన వంతుగా ఈ భూమాతను కాపాడుకున్న వాళ్లమవుతాం. ఇదొక్కటనే కాదు.. ఫ్యాక్టరీలు/పరిశ్రమలు వృథాగా పడేసే దుస్తులు/క్లాత్స్‌ని కూడా మా సంస్థ వేదికగా రీసైక్లింగ్‌ చేస్తున్నాం..’ అంటోంది కృతి. ఇలా తన కృషికి గుర్తింపుగా ‘గ్రీన్‌ వార్డ్‌రోబ్‌ ఇనీషియేటివ్‌’, ‘గ్రేజియా యంగ్‌ ఫ్యాషన్‌ అవార్డు’.. వంటి పురస్కారాలు అందుకుంది.

 

కథలు చెబుతోంది!

(Photo: Facebook/Radio Bundelkhand FM)

తన వృత్తిలోనే పర్యావరణ పరిరక్షణకు పరిష్కారం వెతుక్కుంది బుందేల్‌ఖండ్‌కు చెందిన వర్షా రైక్వార్‌. స్థానిక ఎఫ్‌ఎం రేడియో ఛానల్‌లో రేడియో రిపోర్టర్‌గా పనిచేస్తోన్న ఆమె.. ఈ వేదికగానే పర్యావరణ పరిరక్షణపై అందరిలో స్ఫూర్తి రగిలిస్తోంది. వాతావరణ పరిరక్షణ, ఆరోగ్యం, పరిశుభ్రత, బాల్య వివాహాల నిర్మూలన, ఓటింగ్‌పై అవగాహన, వ్యవసాయం.. వంటి అంశాల్ని కథల రూపంలో శ్రోతలకు వివరిస్తూ అందరిలో ఆయా విషయాల గురించి అవగాహన పెంచుతోంది. పర్యావరణమంటే ప్రాణమిచ్చే వర్ష  ఇందుకోసం ఎప్పుడైనా ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానంటోంది. ‘పర్యావరణమంటే నాకు చిన్నతనం నుంచే మక్కువ. ఈ క్రమంలోనే మా ఇంటి ఆవరణలో తరచూ మొక్క నాటేదాన్ని. వాటి మధ్యే గడిపేదాన్ని. అయితే పెరిగి పెద్దయ్యే క్రమంలో ఇది నాతోనే ఆగిపోకూడదు.. మరికొంతమందిని ఇందులో భాగం చేయాలనుకున్నా.. ఇందుకోసం ప్రస్తుతం నా వంతుగా కృషి చేస్తున్నా. ప్రకృతి పరిరక్షణ కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా..’ అంటోందీ గ్రీన్‌ లవర్.

 

ముందు యువత మారాలి!

దేశ భవిత యువత చేతుల్లోనే ఉందని, పర్యావరణ పరిరక్షణకు ముందు వాళ్లే నడుం బిగించాలని అంటోంది మహారాష్ట్ర జల్నాకు చెందిన నేహా శివాజీ  నైక్వాడ్‌. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆమె.. ‘ప్రవాహ్‌’ పేరుతో ఓ యూత్‌ సెల్‌ని ప్రారంభించింది. ఈ క్రమంలో జీరో వేస్ట్‌ దిశగా కృషి చేస్తోంది. ‘వాతావరణ మార్పుల ప్రభావం పరోక్షంగా మన రోగ నిరోధక శక్తి పైనే పడుతుంది. దీన్నిలాగే నిర్లక్ష్యం చేస్తే రాబోయే పదేళ్లలో సుమారు 132 మిలియన్ల మంది ప్రజలు కటిక పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితులు రాకూడదంటే అన్ని దేశాలు ఉద్గారాల్ని ఆపేయాలి. ప్లాస్టిక్‌ని నిర్మూలించాలి. పర్యావరణ పరిరక్షణకు భంగం కలగకుండా తమ వ్యాపారాల్ని కొనసాగించాలి. ఈ క్రమంలో యువత తమ వంతు పాత్ర పోషించాలి. అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలతో పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రభుత్వాల్ని మేల్కొల్పాలి. తగిన చర్యలు తీసుకునేలా వారిని ప్రేరేపించాలి..’ అంటోంది నేహ. ప్రస్తుతం ‘క్లైమేట్‌ కలెక్టివ్‌ ఫౌండేషన్‌’తో కలిసి పనిచేస్తోన్న ఈ ఎకో వారియర్‌.. ఈ సంస్థకు ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా కొనసాగుతూ.. పర్యావరణహిత టెక్‌ స్టార్టప్స్‌ ప్రారంభించేందుకు కృషి చేస్తోంది.

 

ఇల్లూ ఎకో-ఫ్రెండ్లీగానే!

మనం చేసే పనే కాదు.. కట్టే ఇల్లూ పర్యావరణహితంగానే ఉండాలంటోంది యువ ఆర్కిటెక్ట్‌ మేధా ప్రియ. గ్రీన్‌ బిల్డింగ్‌ అనలిస్ట్‌గా కొనసాగుతోన్న ఆమె.. విశాఖపట్నంలో 200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన IIM క్యాంపస్‌ డిజైనింగ్ లోనూ పాలుపంచుకుంది. ప్రస్తుతం కేంద్ర విద్యుత్‌ శాఖతో కలిసి పనిచేస్తోన్న మేధ.. ఈ క్రమంలో పునరుత్పాదక శక్తిని వినియోగించే భవనాల డిజైన్లు రూపొందిస్తోంది.

‘ఎవరో వచ్చి రక్షిస్తారనుకోకుండా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనమే కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆర్కిటెక్ట్‌గా తమ కెరీర్‌ని ఎంచుకునే యువత.. ఆయా కంపెనీలతో కలిసి పనిచేసే క్రమంలో పర్యావరణహిత ప్రాజెక్ట్స్‌కి ప్రాధాన్యమివ్వాలి. సంస్థలు, ప్రభుత్వం ఇలాంటి ప్రాజెక్ట్స్‌ని చేపట్టే దిశగా చర్యలు తీసుకోవాలి..’ అంటోందీ నేచర్‌ లవర్.

వీళ్లతో పాటు అర్చనా సోరెంగ్‌ (ఒడిశా), హీనా సైఫీ (మీరట్‌), హీతా లఖానీ (ముంబయి), స్నేహా షాహి (బెంగళూరు).. తదితరులు కూడా వాతావరణ పరిరక్షణ కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. యూఎన్‌ ఇండియా చేపట్టిన ‘We The Change’ కార్యక్రమంలో చోటు దక్కించుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్