బంగారం మార్పిడి చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి!

పాత ఫ్యాషన్లు పక్కన పెట్టి.. కాలానుగుణంగా పుట్టుకొచ్చే సరికొత్త ఫ్యాషన్లు ఎంచుకోవడం ఈ కాలపు అమ్మాయిలకు అలవాటే! దుస్తులు, యాక్సెసరీస్‌ విషయాల్లోనే కాదు.. అత్యంత విలువైన బంగారు ఆభరణాల్లోనూ కొంతమంది...

Updated : 04 Jul 2023 18:01 IST

పాత ఫ్యాషన్లు పక్కన పెట్టి.. కాలానుగుణంగా పుట్టుకొచ్చే సరికొత్త ఫ్యాషన్లు ఎంచుకోవడం ఈ కాలపు అమ్మాయిలకు అలవాటే! దుస్తులు, యాక్సెసరీస్‌ విషయాల్లోనే కాదు.. అత్యంత విలువైన బంగారు ఆభరణాల్లోనూ కొంతమంది ఈ ట్రెండ్‌ పాటిస్తుంటారు. తమ వద్ద ఉన్న పాత డిజైనర్‌ ఆభరణాల్ని మార్పిడి చేయించుకొని.. వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో మోసపోకుండా, నష్టపోకుండా ఉండాలంటే కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

వారం ముందు నుంచే..!

బంగారం కొనాలన్నా, ఉన్న ఆభరణాల్ని మార్చి కొత్త డిజైన్లు కొనుగోలు చేయాలన్నా.. ముందు మనం పరిశీలించేది ఈ రోజు ధర ఎంత ఉంది అని! అయితే ఈ క్రమంలో ఒకట్రెండు రోజుల ధరను పరిగణనలోకి తీసుకొని బంగారం మార్పిడి చేసుకోవడం కంటే.. వారం ముందు నుంచే ధరల్ని పరిశీలించి ఓసారి బేరీజు వేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా దీని ధర క్రమంగా పెరుగుతోందా?, తగ్గుతోందా? లేదంటే హెచ్చుతగ్గులున్నాయా అనేది అర్థమవుతుంది. ఒకవేళ తగ్గినా, హెచ్చుతగ్గులున్నా కొన్నాళ్ల పాటు ఆగడం.. లేదంటే ధర పెరుగుతున్నట్లయితే.. ఏదో ఒక రోజు మీ వద్ద ఉన్న ఆభరణాల్ని అమ్మి.. తిరిగి ధర తగ్గినప్పుడు కొత్తవి కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా ఇంతకుముందు మన దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ బంగారాన్ని కొని ప్రయోజనం పొందచ్చు. కాబట్టి బంగారం మార్పిడి అనేది అనుకున్న వెంటనే చేసేయడం కాకుండా.. మార్కెట్లో బంగారం ధరల్ని బట్టి నిర్ణయించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

వాటిని మార్చద్దు!

సందర్భాన్ని బట్టి దుస్తులు, నగలు ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు ఈ కాలపు అమ్మాయిలు. ఈ ఆలోచనతోనే తమ వద్ద ఉన్న నగలు పాతవైపోయాయని, వాటిని అమ్మి కొత్త డిజైనర్‌ ఆభరణాల్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలా మార్పిడి చేసుకునే క్రమంలో రాళ్లు పొదిగిన నగల కంటే.. పూర్తి బంగారంతో చేసిన ఆభరణాల్నే మార్చుకోవడం ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే రాళ్ల జ్యుయలరీని మనం కొనుగోలు చేసేటప్పుడు.. బంగారంతో పాటు ఆ నగలో పొదిగిన రాళ్ల బరువుకూ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. అదే మనం వాటిని అమ్మేటప్పుడు.. దుకాణాదారులు రాళ్లు, కుందన్స్‌, ఇతర బీడ్స్‌.. వంటివి తొలగించి.. కేవలం బంగారం బరువునే పరిగణనలోకి తీసుకుంటారు. దానికే వారు డబ్బు చెల్లిస్తారు. తద్వారా మనం నష్టపోయే అవకాశం ఎక్కువ! అదే పూర్తి బంగారంతో చేసిన ఆభరణాలైతే.. ధర ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మి, తగ్గినప్పుడు కొత్తవి కొనుగోలు చేయడం లాభదాయకం!

బిల్లు మర్చిపోకండి!

వస్తువులైనా, దుస్తులైనా.. కొనుగోలు చేశాక వాటిని తిరిగి మార్చుకోవాలనుకున్నప్పుడు బిల్లు తప్పనిసరి! బంగారు ఆభరణాల మార్పిడి విషయంలోనూ అంతే! పాత ఆభరణాల్ని మార్చుకొని.. కొత్తవి కొనుగోలు చేసే క్రమంలో.. జ్యులయరీ షాపుకి ఆ నగకు సంబంధించిన బిల్లును తప్పనిసరిగా తీసుకెళ్లాలంటున్నారు నిపుణులు. అందులో ఆ నగ బరువు, దాని స్వచ్ఛత.. వంటివన్నీ స్పష్టంగా రాసి ఉంటాయి. ఇప్పుడు తిరిగి అదే నగను మీరు మార్చుకోవాలనుకున్నప్పుడు.. దాని బరువు, స్వచ్ఛత విషయాల్లో దుకాణాదారుల వద్ద మీరు మోసపోకుండా జాగ్రత్త పడచ్చు. అలాగే దాని స్వచ్ఛత విషయంలో మీకేమైనా సందేహాలుంటే క్యారట్‌ మీటర్‌ సహాయంతో నివృత్తి చేసుకోవచ్చు.

ఆ కోడ్‌ ఉన్నవే!

పాత నగను అమ్మి.. కొత్త ఆభరణాలు కొనుగోలు చేసే క్రమంలో.. మనకు నచ్చిన డిజైన్లు ఎంచుకోవడమే కాదు.. వాటి స్వచ్ఛతను ఒకటికి రెండుసార్లు పరిశీలించడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వాటి స్వచ్ఛతను సూచించే ‘హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ (HUID)’ కోడ్‌ మనం కొనుగోలు చేసే ఆభరణాలపై ఉందో, లేదో చెక్‌ చేసుకోవాలి. ఆరు అంకెల అల్ఫాన్యూమరిక్‌ కోడ్‌ ఇది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)చే హాల్‌మార్క్ చేసిన ప్రతి బంగారు ఆభరణంపై ఈ ప్రత్యేకమైన కోడ్‌ను ముద్రించాలన్న నియమాన్ని భారత ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ కోడ్‌ ఉన్న జ్యుయలరీనే కొనుగోలు చేయాలని దుకాణదారులకు సూచించింది. కాబట్టి దీనివల్ల నగల కొనుగోలు విషయంలో వినియోగదారులు మోసపోయే అవకాశాలు తక్కువ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని