UPSC Toppers: అలా కష్టపడ్డారు.. జయభేరి మోగించారు!
‘కష్టే ఫలి’ అన్నారు పెద్దలు. కష్టానికి, ఆత్మ విశ్వాసాన్ని జోడించి యూపీఎస్సీ ర్యాంకులు బద్దలుకొట్టారు కొందరు అమ్మాయిలు. ‘అన్నింటా పురుషులే’ అన్న మాటను మార్చి.. ‘అన్నింటా మేమే’ అంటూ జయభేరి మోగించారు. ఈ అమ్మాయిల ప్రతిభాపాటవాలకు....
‘కష్టే ఫలి’ అన్నారు పెద్దలు. కష్టానికి, ఆత్మ విశ్వాసాన్ని జోడించి యూపీఎస్సీ ర్యాంకులు బద్దలుకొట్టారు కొందరు అమ్మాయిలు. ‘అన్నింటా పురుషులే’ అన్న మాటను మార్చి.. ‘అన్నింటా మేమే’ అంటూ జయభేరి మోగించారు. ఈ అమ్మాయిల ప్రతిభాపాటవాలకు మొదటి మూడు స్థానాలే కాదు.. టాప్-10లో ఏకంగా నాలుగు ర్యాంకులు దాసోహమన్నాయి. ప్రయత్నాలు విఫలమైనా నిరాశ చెందక, సవాళ్లకు ఎదురొడ్డి మరీ విజయతీరాలకు చేరిన కొందరమ్మాయిల మనోగతమే ఇది.
వ్యూహంతోనే విజయం - శృతి శర్మ, మొదటి ర్యాంక్
‘యూపీఎస్సీ ఫలితాల్లో టాప్ ర్యాంక్ నాదే అని తెలిసి ముందు నమ్మకలేకపోయా. అందుకే రెండు మూడుసార్లు ఫలితాలు చెక్ చేసుకున్నా. ఏదేమైనా టాపర్‌గా నిలవడం గొప్పగా అనిపిస్తోంది. నా నాలుగేళ్ల శ్రమకు ఫలితం ఈ విజయం. ఈ క్రమంలో నా వెన్నంటే ఉన్న అమ్మానాన్నలు, టీచర్లు, స్నేహితులకే ఈ క్రెడిట్ దక్కుతుంది. ఇక ప్రిపరేషన్ విషయానికొస్తే.. న్యూస్‌పేపర్లు చదివి నేనే సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. వ్యాసాలపై పట్టు సాధించడానికి సాధననే మార్గంగా ఎంచుకున్నా. సివిల్స్ సిలబస్ అనంతం.. ఒక్కో దశలో అలసట వచ్చేస్తుంటుంది. అయినా విశ్రమించకూడదు. సరైన ప్రణాళిక వేసుకొని, పక్కా వ్యూహంతో సన్నద్ధమైతే సిలబస్ పూర్తి చేయడం పెద్ద కష్టం కాదు. పునశ్చరణ కూడా కీలకమే! అన్నింటికంటే ముఖ్యంగా ఓపిక ఉండాలి. ఈ లక్షణాలే నన్ను విజయతీరాలకు చేర్చాయి..’ అంటోంది శృతి.
సోషల్ మీడియాకు దూరంగా ఉండడం, కష్టపడి చదివిన తీరు.. తన కూతురిని నేడు సివిల్స్ టాపర్‌గా నిలిపాయని ఆమె తల్లి రుచి శర్మ పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ కళాశాలలో మోడ్రన్ హిస్టరీ విభాగంలో పీజీలో చేరిన ఆమె.. చదువు మధ్యలోనే ఆపేసి యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో చేరింది శృతి. చరిత్ర ఐచ్ఛికాంశంగా సివిల్స్ ర్యాంక్ కొల్లగొట్టిందీ టాపర్.
IRS నుంచి IAS దాకా.. - అంకితా అగర్వాల్, 2వ ర్యాంక్
ముచ్చటగా మూడో ప్రయత్నంలో తన కలల కొలువు ఐఏఎస్‌ను సాధించింది పశ్చిమ బంగకు చెందిన అంకితా అగర్వాల్. తొలి ప్రయత్నంలో ఐఆర్‌ఎస్‌ను సాధించి.. ప్రస్తుతం ప్రొబేషన్ పిరియడ్‌లో ఉన్న ఆమె.. సివిల్స్ ఫలితాల్లో రెండో ర్యాంక్ సాధించి చెప్పలేనంత సంతోషంలో మునిగి తేలుతోంది.
‘డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు సివిల్స్ ఆలోచన చేశా. కానీ నా వల్ల అవుతుందా అన్న సందేహంతో ఏడాది పాటు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశా. అయినా మనసంతా సివిల్స్ పైనే ఉండేది. నా ఆలోచనను అమ్మానాన్నలతో పంచుకున్నప్పుడు వాళ్లు సంతోషించారు.. నన్ను ప్రోత్సహించారు. నాన్నైతే నాకు కచ్చితంగా 1 లేదా 2వ ర్యాంకు వస్తుందని ముందే చెప్పేశారు. ఆ మాటలే నన్ను విజయం వైపు నడిపించాయి. ఇన్ని గంటలు చదవాలి అన్న నియమం పెట్టుకోకుండా.. ప్రణాళిక ప్రకారమే ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టా. మాది ఉమ్మడి కుటుంబం. ప్రస్తుతం మా కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగిపోయారు..’ అంటూ తన సక్సెస్ మంత్రాను పంచుకుంది అంకిత. పొలిటికల్ సైన్స్, అంతర్జాతీయ సంబంధాలను ఐచ్ఛికాంశాలుగా ఎంచుకున్న ఈ టాప్ ర్యాంకర్.. భవిష్యత్తులో మహిళా సాధికారత, ఆరోగ్యంపై దృష్టి సారిస్తానని చెబుతోంది.
రెండో ప్రయత్నంలోనే..! - గామినీ సింగ్లా, 3వ ర్యాంక్
స్వీయ నమ్మకం, ప్రోత్సాహం, పట్టుదల.. తన విజయంలో ఈ మూడే కీలకం అంటోంది సివిల్స్ మూడో ర్యాంకర్ గామినీ సింగ్లా. పంజాబ్‌కు చెందిన ఆమె.. రెండో ప్రయత్నంలో సక్సెసైంది. ఈ జర్నీలో అన్ని విధాలుగా తన తల్లిదండ్రులు అండగా నిలిచారని చెబుతోంది.
‘చాలా సంతోషంగా, సంతృప్తిగా అనిపిస్తోంది. ఆ భగవంతుడే నన్ను ఆశీర్వదించాడు. ఇక నా కుటుంబం నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించింది. స్వీయ నమ్మకంతో, అవాంతరాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాను. ఫలితం దక్కింది. అమ్మానాన్నలిద్దరూ హిమాచల్‌ప్రదేశ్‌లో మెడికల్ ఆఫీసర్లుగా బిజీగా ఉన్నప్పటికీ నాకూ తగిన సమయం కేటాయించేవారు. పటియాలాలో కోచింగ్ తీసుకున్నా. రోజూ 9-10 గంటల పాటు చదివేదాన్ని. స్వీయ అధ్యయనం, పునశ్చరణ నాకు బాగా ఉపయోగపడ్డాయి. మహిళలు కష్టపడితే ఏదైనా సాధ్యమనడానికి తాజా ఫలితాలే ప్రత్యక్ష సాక్ష్యం!’ అంటోంది గామిని. కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేసిన ఆమె.. సోషియాలజీని ఐచ్ఛికాంశంగా ఎంచుకొని సక్సెసైంది.
కష్టమే.. కానీ ఇష్టంతో చదివా! - ఇషితా రతి, 8 వ ర్యాంక్
ఇష్టంతో చదివితే.. సివిల్స్ వంటి ప్రతిష్టాత్మక కొలువును సునాయాసంగా సాధించచ్చని తన విజయంతో నిరూపించింది టాప్-8వ ర్యాంకర్ ఇషితా రతి. ఆమె తల్లి మీనాక్షీ రతి ఏఎస్‌ఐగా, తండ్రి ఐఎస్ రతి దిల్లీ పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పెరిగి పెద్దయ్యే క్రమంలో సివిల్స్‌నే తన అంతిమ లక్ష్యంగా పెట్టుకున్న ఇషిత.. మూడో ప్రయత్నంలో లక్ష్యాన్ని చేరుకుంది.
‘నన్ను ఇంతలా ప్రోత్సహించే తల్లిదండ్రులున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. వాళ్లు నాపై ఎంతో నమ్మకముంచారు. ఇందుకు ప్రతిగా నేను టాప్-10లో నిలిచినందుకు గర్వంగా అనిపిస్తోంది. సివిల్స్ పరీక్ష చాలా కష్టమే అయినా.. పూర్తి ఏకాగ్రత దాని పైనే పెట్టాను. స్వీయ నమ్మకంతో ముందుకు సాగాను. విజయం వరించింది. ఐఏఎస్‌ను ఎంచుకొని దేశానికి నా వంతుగా సేవలందిస్తా..’ అంటోందీ దిల్లీ అమ్మాయి. అర్థశాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన ఆమె.. ఇదే సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకొని సివిల్స్ ర్యాంక్ కొల్లగొట్టింది.
బ్యాంక్ జాబ్ వదులుకున్నా! - ప్రియంవద మదాల్కర్, 13వ ర్యాంక్
చిన్నతనం నుంచీ సివిల్స్లో విజయం సాధించడమే ధ్యేయంగా భావించానంటోంది ముంబయికి చెందిన ప్రియంవద మదాల్కర్. చదువు పూర్తయ్యాక ఓ మల్టీనేషనల్ బ్యాంక్‌లో ఆరేళ్ల పాటు పనిచేసిన ఆమె.. తన లక్ష్యంపై దృష్టి పెట్టడానికి జాబ్ కూడా వదులుకున్నానంటోంది.
‘నాన్నే నా రోల్‌మోడల్. చిన్నతనం నుంచీ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నా. ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ పూర్తి చేశాక ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. అందులోనే ఆరేళ్లు గడిచిపోయాయి. ఈ జాబ్ హడావిడిలో పడిపోయి నా చిన్ననాటి కలను నిర్లక్ష్యం చేస్తున్నాననిపించింది. అందుకే ఉద్యోగం వదిలేసి పూర్తిగా సివిల్స్ ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టా. 2020 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నా. ఇప్పుడు నా కల సాకారమైంది. ఈ క్రమంలో కరెంట్ అఫైర్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టా. సాధనకు తగిన సమయం కేటాయించా. ఐఏఎస్‌గా ఈ సమాజంలో పలు సానుకూల మార్పులు తీసుకురావాలనుకుంటున్నా..’ అంటూ తన భవిష్యత్ లక్ష్యాల గురించి పంచుకుంది ప్రియంవద. సొంతూరు ముంబయి అయినా.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడిందీ సివిల్స్ ర్యాంకర్.
వీళ్లతో పాటు బిహార్‌కు చెందిన డాక్టర్ అన్షు ప్రియా (16వ ర్యాంక్), ఉత్తరాఖండ్ అమ్మాయి దీక్షా జోషి (19వ ర్యాంక్).. టాప్-20లో చోటు దక్కించుకున్నారు.
అలా నిరూపించారు!
ఇదేవిధంగా- అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తే, వివాహ బంధాన్ని కాదనుకుని సివిల్సే లక్ష్యంగా ప్రిపేరై, 177వ ర్యాంక్ సాధించింది - ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివాంగి గోయల్. 'పెళ్లయ్యాక మెట్టినింట్లో వేధింపులు ఎదురైతే ఏమాత్రం భయపడద్దు. మీ కాళ్ల మీద మీరు నిలబడగలరని నిరూపించండి... మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు' అంటూ యువతలో ఎనలేని స్ఫూర్తిని నింపుతోంది శివాంగి.
అలాగే ఝార్ఖండ్‌కు చెందిన క్రేన్ ఆపరేటర్ కుమార్తె అయిన 24 ఏళ్ల దివ్యా పాండే సివిల్స్‌లో 323వ ర్యాంక్ సాధించి, ప్రతిభకు ఎలాంటి స్థాయీ బేధాలూ లేవని నిరూపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.