Updated : 21/02/2023 17:15 IST

అత్తింటి వారి ప్రవర్తన ఇలా ఉంటే..?!

పెళ్లైన అమ్మాయిలు అత్తింటినే పుట్టిల్లుగా భావిస్తుంటారు. వారితో అనుబంధాన్ని పెంచుకోవాలని ఆరాటపడుతుంటారు. కానీ, కొంతమంది అత్తమామలు తమ కోడలిపై అజమాయిషీ చెలాయించాలని, ఆమె విషయాల్లోనూ తమదే అంతిమ నిర్ణయం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. దీనివల్ల కుటుంబంలో కలతలు రేగడమే కాదు.. నవ దంపతుల అనుబంధంపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే.. అత్తింటి వారు మీతో వ్యవహరించే తీరును పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. ఇటు భర్తతో, అటు అత్తింటి వారితో అనుబంధాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..

ఇలా ప్రవర్తిస్తున్నారా?

అత్తాకోడళ్ల మధ్య చిన్నపాటి గొడవలు, భేదాభిప్రాయాలు ప్రతి ఇంట్లో సహజమే. అయితే కొంతమంది వీటిని త్వరితగతిన పరిష్కరించుకుంటే.. మరికొంతమంది భూతద్దంలో చూస్తూ చిన్న గొడవల్ని కాస్తా పెద్దవి చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొంతమంది అత్తింటి వారు కోడలికి సంబంధించిన ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ, వారి నిర్ణయాధికారం లాగేసుకోవాలని చూస్తుంటారు. ఇలాంటి ధోరణిని వారి ప్రవర్తన ద్వారా ఇట్టే పసిగట్టచ్చంటున్నారు నిపుణులు.

ఏ విషయంలోనైనా మీరు తీసుకున్న నిర్ణయాల్ని తప్పుపడుతుంటారు. ఈ క్రమంలో ఏ నిర్ణయమైనా వారిని సంప్రదించాకే తీసుకోవాలన్న భయాన్ని, ఆలోచనను మీలో రేకెత్తిస్తారు. ఇలా మీ నిర్ణయాధికారాన్ని హరిస్తుంటారు.

మీరు ఏ పని చేసినా దాన్ని ప్రతికూల కోణంలోనే చూస్తుంటారు.. అందులో లోపాల్ని వెతకడానికే ప్రాధాన్యమిస్తారు. మీ ఆలోచన ఏదైనా విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకుంటారు. ఇలా మీరు వారిపై పూర్తిగా ఆధారపడేలా చేయాలన్నదే వారు లక్ష్యంగా పెట్టుకుంటారు.

మీరు మీ అత్తింటి వాళ్ల ఆలోచనలు, కోరికలు, అంచనాల్ని బట్టి నడుచుకునేలా వాళ్లు మిమ్మల్ని ప్రభావితం చేస్తారు. ఒకవేళ అలా నడుచుకోకపోతే ఏదో తప్పు చేసిన భావన మీలో కలిగేలా పరోక్షంగా మిమ్మల్ని ప్రేరేపిస్తారు.

మీ ఇష్టాయిష్టాలతో పని లేకుండా వాళ్లకు నచ్చిందే జరగాలంటూ మిమ్మల్ని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటారు.

మీకు, మీ అత్తింటి వారికి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు మీ దాంపత్య బంధాన్ని ప్రభావితం చేసినా వారు లెక్క చేయరు. పైగా మీరు మీ భర్తతో, మీ భర్త మీతో ప్రేమగా మెలిగినా సహించలేరు. ఇలా మీ అనుబంధంలో మీరు వేసే ప్రతి అడుగూ వాళ్ల ఇష్టప్రకారమే జరగాలంటూ పరోక్షంగా కోరుకుంటారు.

కోడలిని మానసికంగా వాళ్ల అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలనుకునే అత్తింటి వారు.. ఈ పనినీ నిశ్శబ్దంగానే చేసేస్తుంటారట! ఈ క్రమంలో మీరు మాట్లాడినా స్పందించకపోవడం, మీ కాల్స్‌-సందేశాలకు రిప్లై ఇవ్వకపోవడం.. ఇలా మిమ్మల్ని దూరం పెడుతూ మానసికంగా హింసిస్తుంటారు. ఫలితంగా మీ బాధలో వాళ్లు సంతోషాన్ని వెతుక్కుంటారు.

ప్రతికూల ఆలోచనలతో నిండిపోయిన మనసు మంచిని కూడా చెడు దృష్టితోనే చూస్తుంటుంది. ఈ క్రమంలోనే మీరు వాళ్ల మంచి కోసం ఏం చేసినా.. అది వాళ్లు స్వీకరించకపోగా.. నిందలేస్తుంటారు.

మీపై ప్రేమున్నట్లుగా మీ ముందు నటిస్తూనే.. మీ వెనకాల మీ గురించి చెడుగా చెబుతుంటారు. మీ భాగస్వామికి మీపై లేనిపోనివన్నీ కల్పించి చెబుతుంటారు.

తిరిగి కలిసిపోవాలంటే..!

కొత్తగా పెళ్లైనా, ఏళ్లు గడుస్తున్నా.. చాలామంది మహిళలు అత్తింట్లో ఇలాంటి మానసిక హింసను ఎదుర్కొంటున్నట్లు పలు అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. మరోవైపు కొన్ని జంటలు విడిపోవడానికి ఇదీ ఓ కారణమేనంటూ కౌన్సెలింగ్‌ నిపుణులు కూడా చెబుతున్నారు. ఏదేమైనా అత్తింటి వాళ్ల ఈ తరహా ప్రవర్తనను కొన్ని చిన్నపాటి చిట్కాల ద్వారా ఎదుర్కోవచ్చంటున్నారు నిపుణులు. తద్వారా అత్తింటివారికి, కోడలికి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి అనుబంధాన్ని పునర్నిర్మించుకోవచ్చంటున్నారు.

భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢంగా ఉంటే.. ఏ శక్తీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టలేదంటుంటారు. అందుకే మీ అత్తింటి వారితో మీకు పొరపచ్ఛాలున్నా.. వాటి ప్రభావం మీ అన్యోన్యతపై పడకుండా చూసుకోమంటున్నారు నిపుణులు. తద్వారా ఇద్దరి మధ్య నమ్మకం ఏర్పడి.. ఏ ఒక్కరూ చెప్పుడు మాటలకు లొంగకుండా జాగ్రత్తపడచ్చు.

అత్తింటి వారి ప్రవర్తన ఇబ్బంది కలిగించినా ఓపికతో వ్యవహరించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ విషయాన్ని సున్నితంగా మీవారితో చర్చించడం, సమస్యకు తగిన పరిష్కారం వెతుక్కోవడం.. వంటివి చేస్తే తిరిగి అనుబంధాన్ని దృఢం చేసుకోవచ్చు.

మూలాలు తెలిస్తే ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చంటారు పెద్దలు. మరి, మీ అత్తింటి వారు మీతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో, దానికి కారణమేంటో ఓసారి కనుక్కునే ప్రయత్నం చేయండి. దాని ప్రకారం మీరు మారాలో, లేదంటే వాళ్లను మార్చుకోవాలో ఓ స్పష్టత వస్తుంది. దానికి అనుగుణంగా ముందడుగు వేస్తే ఫలితం ఉంటుంది.

భార్యాభర్తలు కలిసి తీసుకునే ప్రతి నిర్ణయంలో అత్తింటివారి అంగీకారం ఉండాల్సిన అవసరం లేదు. మీకు మీరుగా తీసుకోవాల్సిన సొంత నిర్ణయాలు కూడా కొన్నుంటాయి. కాబట్టి ఈ విషయంలో వాళ్లు కలగజేసుకోకుండా పరిధులు పెట్టుకోవడం, దీని గురించి వారికి స్పష్టం చేయడంలో తప్పులేదు. తద్వారా లేనిపోని గొడవలు రాకుండా జాగ్రత్తపడచ్చు.

ఇన్ని చేసినా అత్తింటి వారు మారకపోయినా, మీకు-మీ అత్తింటి వారికి మధ్య తరచూ భేదాభిప్రాయాలు తలెత్తుతున్నా.. ఓసారి కౌన్సెలింగ్‌ నిపుణుల్ని సంప్రదించడం మంచిది. తద్వారా వారు వ్యక్తిగతంగానే కాకుండా, అందరికీ కలిపి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. సమస్యకు తగిన పరిష్కారం చూపిస్తారు. తద్వారా మీ దాంపత్య బంధం, అత్తింటి వారితో అనుబంధం.. రెండూ దృఢమవుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని