Updated : 26/02/2022 18:39 IST

పుస్తకాలను భద్రపరచండిలా..

ఓ మంచి పుస్తకాన్ని మించిన మిత్రుడు లేడంటారు.. అవును.. నిజమే.. ఎంత ఇంటర్నెట్ యుగమైనా.. పుస్తకాలు లేని ఇల్లు మాత్రం కనిపించదు. మన వృత్తి జీవితానికి అవసరమయ్యే పుస్తకాలు, అమ్మమ్మలు, నానమ్మల కాలంనాటి పుస్తకాలు, నవలలు, భాగవత, రామాయణ గాథలని వివరించే ఆధ్యాత్మిక పుస్తకాలు ఇలా మన ఇళ్లల్లో ఉండే పుస్తకాల లిస్టు చాలానే ఉంటుంది. ఇక పుస్తక పఠనం అభిరుచైతే.. ఇక చెప్పనవసరం లేదు. కొన్ని పుస్తకాలైతే ఎక్కడా దొరకని అరుదైనవి అంటూ దాచుకుంటాం..

అయితే కేవలం దాస్తేనే సరిపోతుందా? లేదు.. దాన్ని భద్రపర్చడంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే వాటిని పది కాలాల పాటు పదిలంగా కాపాడుకోగలుగుతాం.. లేకపోతే తడిసిపోయి, బ్యాక్టీరియా, ఫంగస్ చేరి పుస్తకాలు పాడైపోతాయి. మరి వాటిని ఎలా కాపాడుకోవాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

దుమ్మూధూళీ పడకుండా..

* పుస్తకాల్ని కదిలించకుండా ఒకే చోట చాలారోజులు ఉంచేస్తే వాటి మీద దుమ్ము చేరుకుంటుంది. ఇలాగే ఉండిపోతే పుస్తకాలు పాడవుతాయి. వాటి నుంచి వాసన రావడంతో పాటు ఆకారం, రంగు, నాణ్యత దెబ్బతింటాయి.

* ఇలా కాకుండా ఉండాలంటే పుస్తకాలను కనీసం మూడు నెలలకోసారైనా శుభ్రం చేసుకోవాలి.

* పుస్తకాల మీద దుమ్ము, ధూళి పడుతుంటే.. వాటిని పేపర్ లేదా వస్త్రంతో కప్పి ఉంచి కాపాడుకోవచ్చు. లేకపోతే పుస్తకాలను కప్పి ఉంచేందుకు మార్కెట్లో దొరుకుతున్న డస్ట్ జాకెట్లను కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల కేవలం దుమ్మూ, ధూళి మాత్రమే కాదు.. తేమ కూడా తగలకుండా పుస్తకాలను కాపాడుకోవచ్చు.

ఎక్కడైతే మంచిది?

* పుస్తకాల్ని గాలి ధారాళంగా వచ్చే ప్రాంతంలో పెట్టుకోవాలి. లైబ్రరీని ఇంటి లోపలే ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటే మంచిది. గాజు అద్దాలు బిగించిన ర్యాక్‌లో పెట్టుకుంటే తొందరగా దుమ్ము పట్టకుండా ఉంటుంది.

* క్రమం తప్పకుండా పుస్తకాలకి పట్టిన దుమ్ముని శుభ్రం చేసుకుంటూ ఉంటే.. పుస్తకాల్లో ఫంగస్ చేరదు.

* పుస్తకాలు పెట్టుకునే గదిలో మొక్కలు లేకుండా చూసుకోవాలి. తప్పదనుకుంటే మొక్కల్ని కనీసం బుక్స్ ఉన్న అల్మారాకి దూరంగా పెట్టుకోవాలి.

* లావెండర్ ఆయిల్‌ని పుస్తకాల అల్మారాలో పెట్టుకుంటే ఆ నూనెలో ఉండే యాంటీ ఫంగల్ గుణం కారణంగా ఫంగస్ నుండి రక్షణ పొందవచ్చు. అయితే దీన్ని పుస్తకాలకు తగలకుండా ఉంచుకోవాలి లేకపోతే వాటి రంగు మారే అవకాశం ఉంటుంది.

* బుక్ కేస్‌లో చిన్న లైట్ పెట్టుకుంటే రాత్రి పూట పుస్తకాలు వెతుక్కోవడానికి ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కువసేపు దాన్ని వెలిగించి ఉంచకూడదు. ఎందుకంటే దాని కాంతి వల్ల కూడా పుస్తకాల రంగు మారే అవకాశం ఉంటుదట.

పుస్తకాలు తడిశాయా??

* పుస్తకాలు ఏ కారణంగానైనా తడిసినప్పుడు, వాటిని ఎలా పడితే అలా ఆరబెట్టేస్తే.. పేజీలు చిరిగిపోయి, చదువుకోవడానికి ఇబ్బంది ఎదురవుతుంది. ఆరబెట్టడానికీ కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.

* నీటిని పీల్చుకునే(వాటర్ అబ్సార్బెంట్) పేపర్లని పేజీల మధ్యలో పెట్టి, పుస్తకాన్ని టవల్‌లో చుట్టి పెట్టుకోవాలి. ఇవి పుస్తకంలోని నీటిని లాగేస్తాయి.

* గాలి ప్రసరణ బాగా ఉంటే పుస్తకం త్వరగా ఆరుతుంది. గాలి తగలడం కోసం ఫ్యాన్లు, హెయిర్ డ్రైయర్‌ వాడచ్చు. ఇలా అయితే త్వరగా తడి పోతుంది. డ్రైయర్‌ గాలి డైరెక్ట్‌గా పుస్తకానికి తగిలితే.. పుస్తకంలోని పేజీలు చిరిగిపోవచ్చు. కాబట్టి పుస్తకానికి దూరంగా పట్టుకొని ఆరబెట్టాలి.

* వాతావరణం అనుకూలంగా ఉంటే.. పుస్తకాన్ని ఎండ తగిలేలా పెట్టుకోవాలి. అప్పుడు తడి పోవడమే కాకుండా.. సూర్య కిరణాల తాకిడికి అందులోని క్రిములు కూడా చనిపోతాయి.

* గంజిపొడి (స్టార్చ్)ని కూడా పుస్తకాల్లోని తేమను తొలగించడానికి ఉపయోగించచ్చు. గంజిపొడిని పుస్తకంలోని పేజీల మధ్యలో పోసి పుస్తకాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి, కొన్ని గంటలపాటు ఉంచాలి. ఇలా చేస్తే అది తడిని పీల్చుకుంటుంది. కానీ పేజీల మధ్య నుండి దీన్ని తొలగించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మృదువుగా ఉండే బ్రష్‌ని వాడాలి.

* పుస్తకంలో చెమ్మ ఉండిపోయి, పుస్తకం వాసన వస్తుంటే... ఓ పెద్ద పాత్రలో బేకింగ్ సోడా తీసుకొని అందులో పుస్తకాన్ని ఉంచితే.. వాసన దూరమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని