వందేళ్లొచ్చినా అదే ఉత్సాహం!

నాలుగు పదుల వయసు దాటగానే నడుము నొప్పులు, మోకాళ్ల నొప్పులంటూ చిన్న చిన్న బరువులెత్తడానికి కూడా ఎన్నో ఆపసోపాలు పడతారు చాలామంది. ఇక 60-70 ఏళ్లలోకి రాగానే ‘కృష్ణా...రామా’ అంటూ కాలక్షేపం చేయడానికే ఆసక్తి చూపుతారు. అలాంటిది వందేళ్ల వయసులోనూ బరువులు ఎత్తుతున్నారు ఓ బామ్మ. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లి యువతకు దీటుగా సుమారు 68 కిలోల వెయిట్‌ లిఫ్ట్స్‌తో వ్యాయామాలు చేస్తున్నారు.

Published : 09 Aug 2021 19:20 IST

(Photos: Screengrab)

నాలుగు పదుల వయసు దాటగానే నడుము నొప్పులు, మోకాళ్ల నొప్పులంటూ చిన్న చిన్న బరువులెత్తడానికి కూడా ఎన్నో ఆపసోపాలు పడతారు చాలామంది. ఇక 60-70 ఏళ్లలోకి రాగానే ‘కృష్ణా...రామా’ అంటూ కాలక్షేపం చేయడానికే ఆసక్తి చూపుతారు. అలాంటిది వందేళ్ల వయసులోనూ బరువులు ఎత్తుతున్నారు ఓ బామ్మ. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లి యువతకు దీటుగా సుమారు 68 కిలోల వెయిట్‌ లిఫ్ట్స్‌తో వ్యాయామాలు చేస్తున్నారు. ఇంతకీ ఎవరామె? విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఎందుకు వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తున్నారో తెలుసుకుందాం రండి.

98 ఏళ్ల వయసులో గిన్నిస్‌ రికార్డు!

ఆసక్తి, అభిరుచి ఉండాలే కానీ ఏ పనైనా చేయడానికి, దేన్నైనా నేర్చుకోవడానికి వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని ఇప్పటికే చాలామంది నిరూపించారు. ఇటీవల నేపాల్‌కు చెందిన 78 ఏళ్ల కృష్ణకుమారి డ్యాన్స్‌పై ఆసక్తి పెంచుకుని ఏకంగా సోషల్‌ మీడియా స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన వందేళ్ల ఎడిత్‌ ముర్వే ట్రైనా కూడా ఈ కోవకే చెందుతారు. 91 ఏళ్ల వయసులో వెయిట్‌ లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె...ఆ తర్వాత క్రమంగా దానినే కెరీర్‌గా మార్చుకున్నారు. ప్రొఫెషనల్‌ వెయిట్‌ లిఫ్టర్‌గా ఎన్నో పతకాలు, బహుమతులు కూడా గెల్చుకున్నారు. ఈ క్రమంలో 98 ఏళ్ల వయసులో అత్యధిక వయసున్న మహిళా వెయిట్‌ లిఫ్టర్‌గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కారీ ఓల్డ్‌ వుమన్.

నూరవ వసంతంలోకి!

ఎడిత్‌ ఆగస్టు 8న నూరవ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ నిర్వాహకులు తమ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ఆమెకు సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌కు సంబంధించి జిమ్‌లో ఆమె చేసే వ్యాయామాలను ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఈ క్రమంలోనే ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోన్న ముర్వే జీవిత విశేషాలను ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌-2022’ ఎడిషన్‌లో పొందుపరచామని గిన్నిస్‌ వరల్డ్‌ నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెలలో ఈ పుస్తకం విడుదల కానుంది.

స్నేహితురాలి సలహాతో!

ఓ రిక్రియేషన్‌ సెంటర్‌లో డ్యాన్స్‌ టీచర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ తీసుకున్నారు ఎడిత్‌. 91 ఏళ్లు వచ్చేవరకు కూడా ఆమెకు వెయిట్‌లిఫ్టింగ్‌లో ఎలాంటి అనుభవం లేదు. అయితే అప్పుడే తన స్నేహితురాలు కార్మన్‌ గట్‌వర్త్‌ సలహాతో జిమ్‌లో చేరిన ఆమె మొదట్లో సరదాగా బరువులు ఎత్తడం ప్రారంభించారు. ఆ తర్వాత అందులోనే తన కొత్త జీవితాన్ని ఎంచుకున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌ టోర్నీల్లో పాల్గొని పతకాలు, ట్రోఫీలు సాధించారు. ‘మొదట్లో జిమ్‌కు వెళ్లి ఏదో సరదాగా బరువులెత్తేదాన్ని. అవి కూడా తేలికపాటివే. రోజురోజుకీ బరువులు పెంచుకుంటూ వెళ్లేదాన్ని. క్రమంగా దీనిని ఎంజాయ్‌ చేయడం మొదలుపెట్టాను. నా ట్రైనర్‌ బిల్‌, స్నేహితురాలు సహాయంతో ప్రొఫెషనల్‌ వెయిట్‌ లిఫ్టర్‌గా మారాను. మొదట టోర్నీల్లో పాల్గొంటున్నప్పుడు పతకాలు, బహుమతుల గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. మెరుగైన ప్రదర్శన ఇస్తే చాలనుకున్నాను. నలుగురు నన్ను చూసి చప్పట్లు కొట్టాలని కోరుకున్నాను. అయితే గత కొన్నేళ్లలో లెక్కలేనన్ని పతకాలు, బహుమతులు గెల్చుకున్నాను. వీటిని భద్రపరిచేందుకు నా గదిలో స్థలం కూడా సరిపోవట్లేదు ’అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారీ ఓల్డ్‌ వుమన్.

ఆ టోర్నీ పైనే నా దృష్టంతా!

2019లో చివరిగా వెయిట్‌ లిఫ్టింగ్‌ టోర్నీలో పాల్గొన్నారు ఎడిత్‌. అప్పుడామె వయసు 98 ఏళ్ల 94 రోజులు. కరోనా కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే వెయిట్‌ లిఫ్టింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తోన్న ఆమె మళ్లీ జిమ్‌కు వెళ్లేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘మలి వయసులో మనకంటూ ఓ గుర్తింపు రావాల్సిన అవసరముంది. మనం ఎవరు? ఏం చేస్తున్నాం? అని నలుగురు మన గురించి మాట్లాడుకుంటుంటే ఎంతో సంతోషమేస్తోంది. ప్రస్తుతం నేను అలాంటి ఆనందాన్నే ఆస్వాదిస్తున్నాను. ప్రస్తుతం నా దృష్టంతా నవంబర్‌లో జరిగే టోర్నీ పైనే ఉంది. అందులోనూ గెలిచి మరో ట్రోఫీని ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారీ గ్రాండ్‌ ఓల్డ్‌ వుమన్.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్