103 ఏళ్ల వయసులో ఆకాశం నుంచి దూకేసింది..!

వయసు, కుటుంబ బాధ్యతలు, ఆర్ధిక పరిస్థితులు వంటి కారణాలు చూపిస్తూ కొంతమంది తమ లక్ష్యాల నుంచి దూరం జరుగుతుంటారు. కానీ, మరికొంతమంది కృషి, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపిస్తూనే ఉన్నారు. అందులోనూ లక్ష్యాలను సాధించడానిక...

Published : 31 May 2022 20:53 IST

వయసు, కుటుంబ బాధ్యతలు, ఆర్ధిక పరిస్థితులు వంటి కారణాలు చూపిస్తూ కొంతమంది తమ లక్ష్యాల నుంచి దూరం జరుగుతుంటారు. కానీ, మరికొంతమంది కృషి, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపిస్తూనే ఉన్నారు. అందులోనూ లక్ష్యాలను సాధించడానికి వయసు ఏమాత్రం అడ్డంకి కాదని మలివయసులో సైతం పలు సాహసాలు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా 103 ఏళ్ల వయసులో రూత్‌ లార్సన్‌ అనే బామ్మ ప్యారాచూట్ జంప్‌ చేసి గిన్నిస్‌ వరల్డ్  రికార్డ్ సాధించారు.

తొంభైల్లో మొదలుపెట్టి...

స్వీడన్‌కు చెందిన రూత్‌ లార్సన్‌ అనే బామ్మ తొంభైల్లో ఉన్నప్పుడే ఆకాశంలో ఎగరాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన వయసును సైతం లెక్క చేయకుండా పారాగ్లైడింగ్‌, గ్లైడింగ్‌, బెలూనింగ్‌.. వంటివి చేయడం ప్రారంభించారు. అలా 2019లో మొదటిసారి ప్యారాచూట్ జంప్‌ చేశారు. అప్పుడు ఆమె వయసు 101 సంవత్సరాలు. కానీ, అప్పుడు ఎలాంటి రికార్డూ నమోదు కాలేదు. ఎందుకంటే అంతకుముందు కొన్ని నెలల క్రితం అమెరికాకు చెందిన కాథరిన్ 103 ఏళ్ల 129 రోజుల వయసులో ప్యారాచూట్ జంప్‌ చేశారు. అయితే రూత్ లార్సన్ తాజాగా ఈ రికార్డును తిరగరాశారు. ప్యారాచూట్ జంప్ నిపుణుడితో కలిసి ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారి సమక్షంలో ఈ ఫీట్ పూర్తి చేశారు.

ఫీట్‌ చేసిన రోజు ఆమె వయసు 103 ఏళ్ల 259 రోజులు. దాంతో ఆమె ప్రపంచంలోనే ప్యారాచూట్ జంప్‌ చేసిన వృద్ధ మహిళగా రికార్డును సొంతం చేసుకున్నారు. అలాగే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారి నుంచి ప్రశంసా పత్రాన్ని కూడా పొందారు.

కేక్‌తో సెలబ్రేట్‌ చేసుకుంటా..!

జంప్‌ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ‘ప్యారాచూట్ జంప్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పటినుంచో దీనిని సాధించాలనుకుంటున్నాను. ఈ రోజుతో నా కల సాకారమైంది’ అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆకాశంలో ఉన్నప్పుడు ఎలాంటి అనుభూతిని పొందారు? అని అడగ్గా ‘కొద్ది రోజుల నుంచి నా చూపు మందగించింది. కానీ చాలా ఆనందంగా ఉంది. ఆకాశం నుంచి నెమ్మదిగా కిందికి వస్తున్నప్పుడు అద్భుతంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చారు. ఈ విజయాన్ని కేక్‌తో సెలబ్రేట్‌ చేసుకుంటానని చెప్పారామె. లార్సన్ ప్యారాచూట్ జంప్‌ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. మీరూ ఓ లుక్కేయండి మరి!

ఆ రికార్డును చెరిపేసి..

అంతకుముందు అమెరికాకు చెందిన ఆల్ఫ్రెడ్ 103 ఏళ్ల 181 రోజుల వయసులో 14000 అడుగుల ఎత్తు నుంచి ట్యాండెమ్ జంప్‌ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. తాజాగా లార్సన్ ఈ రికార్డును కూడా చెరిపేయడం విశేషం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్