Mrs India Universe : రెండు దశాబ్దాల కల అలా నెరవేర్చుకుంది!

పెళ్లి, పిల్లలు, ఇంటి బాధ్యతలు.. వీటి కారణంగా చాలామంది మహిళలు తమకు ఇష్టం ఉన్నా, లేకపోయినా కెరీర్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వస్తోంది. అయితే కొంతమంది ఆలస్యంగానైనా తమ అభిరుచులకు పదును పెడుతుంటారు. జీవితంలో తాము కన్న కలల్ని నెరవేర్చుకుంటారు. అమృత్‌సర్‌కు చెందిన శ్వేతా దడా ఇదే కోవలోకి చెందుతారు. 19 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన ఆమెకు ఫ్యాషన్‌ ప్రపంచంలోకి....

Published : 26 Mar 2022 15:54 IST

(Photos: Instagram)

పెళ్లి, పిల్లలు, ఇంటి బాధ్యతలు.. వీటి కారణంగా చాలామంది మహిళలు తమకు ఇష్టం ఉన్నా, లేకపోయినా కెరీర్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వస్తోంది. అయితే కొంతమంది ఆలస్యంగానైనా తమ అభిరుచులకు పదును పెడుతుంటారు. జీవితంలో తాము కన్న కలల్ని నెరవేర్చుకుంటారు. అమృత్‌సర్‌కు చెందిన శ్వేతా దడా ఇదే కోవలోకి చెందుతారు. 19 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన ఆమెకు ఫ్యాషన్‌ ప్రపంచంలోకి రావాలనేది చిన్ననాటి కల. అయితే చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మీద పడడంతో తన తపనకు తాత్కాలిక విరామం ప్రకటించిందామె. ఇక పిల్లలు పెరిగి పెద్దవాళ్లవడంతో తిరిగి తన కలను సాకారం చేసుకునే దిశగా అడుగులేసింది. అందుకు ప్రతిఫలమే ‘మిసెస్‌ ఇండియా యూనివర్స్‌-2022’ అందాల కిరీటం. ఇటీవలే ఈ కిరీటం అందుకున్న శ్వేత.. లక్ష్యాన్ని చేరుకోవాలన్న సంకల్పం ఉండాలే కానీ అందుకు వయసు అడ్డు కానే కాదంటూ స్ఫూర్తి నింపుతోంది.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పుట్టిపెరిగింది శ్వేతా దడా. పాఠశాల, కాలేజీ విద్యాభ్యాసం స్థానికంగానే పూర్తి చేసిన ఆమెకు 19 వ ఏట ఇండియన్‌ ఆర్మీ ఆఫీసర్‌ కల్నల్‌ రమన్‌ దడాతో వివాహమైంది. ప్రస్తుతం ఈ జంటకు 19 ఏళ్ల కూతురు, 15 ఏళ్ల కొడుకు ఉన్నారు. అయితే చిన్న వయసు నుంచే ఫ్యాషన్‌పై మక్కువ పెంచుకున్న శ్వేతకు పిన్న వయసులోనే వివాహం కావడంతో తన కల నెరవేర్చుకునే అవకాశం దొరకలేదు. ఇక పిల్లలు పెరిగి పెద్ద వాళ్లవడంతో తన కెరీర్‌ లక్ష్యంపై దృష్టి పెట్టిందామె.

భర్త ప్రోత్సాహంతో..!

పెళ్లితో తన చదువు ఆగిపోకూడదని నిర్ణయించుకున్న శ్వేత.. భర్త ప్రోత్సాహంతో బీఈడీ వరకు చదువుకుంది. ప్రస్తుతం ఇటు ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే.. మరోవైపు ఫిట్‌నెస్‌/వెల్‌నెస్‌ కోచ్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ‘నేను చిన్నతనం నుంచి అన్ని విషయాల్లో చాలా చురుగ్గా ఉండేదాన్ని. చదువు, ఆటల్లో బాగా రాణించేదాన్ని. చిన్నవయసులోనే పెళ్లవడంతో ఇక కెరీర్‌ ముగిసిపోయినట్టే అని భావించా. కానీ మావారు నన్ను ప్రతి విషయంలోనూ ప్రోత్సహించారు. అందుకే పిల్లలు కాస్త పెరిగి పెద్దవాళ్లయ్యాక తిరిగి నా భవిష్యత్‌ లక్ష్యాలపై దృష్టి పెట్టా. ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని నాకు ముందు నుంచీ ఆసక్తి ఉంది.. ఈ క్రమంలో ఆర్మీ తరఫున నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. ఇక ఫ్యాషన్‌పై నాకున్న మక్కువే నన్ను మిసెస్‌ ఇండియా యూనివర్స్‌ పోటీలకు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించింది. ఈ ఏడాది జైపూర్‌ వేదికగా నిర్వహించిన ఈ అందాల పోటీల్లో కిరీటం అందుకోవడంతో నా రెండు దశాబ్దాల కల నెరవేరినట్లయింది..’ అంటోంది శ్వేత. తద్వారా ఈ ఏడాది నవంబర్‌లో అంతర్జాతీయ స్థాయిలో జరగబోయే పోటీలకు భారత్‌ తరఫున పాల్గొననుందీ అందాల అమ్మ.

వాళ్లతో కలిసి పనిచేయాలనుంది..!

42 ఏళ్ల వయసులో తన రెండు దశాబ్దాల కలను నెరవేర్చుకున్న శ్వేత.. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌.. వంటి అంశాల్లో వీలైనంత ఎక్కువ మంది మహిళల్లో స్ఫూర్తి నింపాలనుకుంటున్నట్లు చెబుతోంది. ‘ఎనిమిదేళ్ల క్రితమే ఫిట్‌నెస్‌లో సర్టిఫికేషన్‌ సంపాదించా. కొన్ని సైనిక కుటుంబాలకూ ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇచ్చిన అనుభవం నాకుంది. అందుకే ఎప్పటికైనా ఫిట్‌నెస్‌, ఆరోగ్యం.. వంటి అంశాల్లో వీలైనంత ఎక్కువమంది మహిళల్లో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించుకున్నా. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడానికీ నేను సిద్ధంగా ఉన్నా.. తాజాగా కిరీటం వరించడంతో నా సేవల్ని విస్తరించేందుకు చక్కటి అవకాశం దొరికింది.. అలాగే మహిళలందరికీ మరో విషయం చెప్పాలనుకుంటున్నా.. వయసు పెరుగుతున్న కొద్దీ ఇక ఏమీ చేయలేమనుకుంటారు చాలామంది. కానీ నా దృష్టిలో వయసనేది ఒక సంఖ్య మాత్రమే! తపనను నెరవేర్చుకోవాలన్న పట్టుదల, సంకల్పం ఉంటే జీవితంలో ఏ వయసులోనైనా ఏదైనా సాధించచ్చు..!’ అంటూ నేటి మహిళల్లో స్ఫూర్తి నింపుతోందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్