72.. అయితేనేం.. క్రేన్లు, ప్రొక్లెయినర్లు.. ఏదైనా నడిపేస్తా!

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా మహిళలు ఏదైనా వాహనాన్ని నడిపితే వింతగా చూస్తుంటారు. అందులోనూ బస్సు, ట్రక్కు, లారీ.. వంటి భారీ వాహనాలను నడిపితే అదొక సంచలనమే. అలాంటిది కేరళకు చెందిన రాధామణి (72) ముప్పై ఏళ్ల క్రితమే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు. అంతేకాదు ఆ తర్వాత బస్సు, లారీ, ట్రక్కులతో పాటు క్రేన్లు, రోడ్‌ రోలర్లు.....

Published : 25 Mar 2022 21:11 IST

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా మహిళలు ఏదైనా వాహనాన్ని నడిపితే వింతగా చూస్తుంటారు. అందులోనూ బస్సు, ట్రక్కు, లారీ.. వంటి భారీ వాహనాలను నడిపితే అదొక సంచలనమే. అలాంటిది కేరళకు చెందిన రాధామణి (72) ముప్పై ఏళ్ల క్రితమే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు. అంతేకాదు ఆ తర్వాత బస్సు, లారీ, ట్రక్కులతో పాటు క్రేన్లు, రోడ్‌ రోలర్లు, ప్రొక్లెయినర్లను నడపడం కూడా నేర్చుకున్నారు. అలా ఆమె దగ్గర 11 రకాల డ్రైవింగ్‌ లైసెన్సులు ఉన్నాయి. తద్వారా ఎక్కువ రకాల డ్రైవింగ్ లైసెన్సులు ఉన్న మహిళగా పేరు పొందారు. ఈ క్రమంలో ఆమె గురించి మరిన్ని విశేషాలు మీకోసం...

భర్త ప్రోత్సాహంతో...

రాధామణిది కేరళలోని తొప్పుమ్‌పడి అనే ప్రాంతం. ఆమె భర్త లలన్‌ 1970ల్లో కొచ్చిలో ‘A-Z డ్రైవింగ్‌ స్కూల్‌’ని మొదలుపెట్టారు. అక్కడే రాధామణి డ్రైవింగ్‌ కెరీర్‌ మొదలైంది. ఆమె మొదటగా కారు నడపడం నేర్చుకున్నారు. అప్పటికి ఆమె వయసు 30 సంవత్సరాలు. అంటే దాదాపు నలభై ఏళ్ల క్రితం అన్నమాట. ఆ సమయంలో ఆడవారు సైకిల్ తొక్కితేనే అదోరకంగా చూసేవారు. రాధామణికి కూడా మొదట ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. అయినా భర్త ప్రోత్సాహంతో విజయవంతంగా కారు నడపడం నేర్చుకున్నారు. ఆ తర్వాత తన భర్త విద్యార్థులకు భారీ వాహనాలను నడపడం నేర్పుతుంటే తనకు కూడా నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిందట. అదే ఆసక్తితో బస్సు, ట్రక్కు వంటి భారీ వాహనాలను నడపడం కూడా నేర్చుకున్నారు. అలా 1988లో 33 కిలోమీటర్ల దూరం పాటు బస్సును నడిపి మొదటిసారి భారీ వాహనాలు నడిపే లైసెన్సును ఆమె పొందారు. తద్వారా కేరళ రాష్ట్రంలోనే హెవీ వెహికల్ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన మొదటి మహిళగా గుర్తింపు సాధించారు.

ప్రమాదకరమైన వాహనాలు సైతం..

రాధామణి దంపతుల జీవితం డ్రైవింగ్‌ స్కూల్‌తో సాఫీగా గడిచిపోతున్న సమయంలో ఆమెకు అనుకోని సంఘటన ఎదురైంది. 2004లో ఓ ప్రమాదంలో రాధామణి భర్త లలన్ మరణించారు. దాంతో పిల్లలను పోషించడం కోసం తనే డ్రైవింగ్‌ స్కూల్‌ బాధ్యతలు తీసుకున్నారు. అయితే అప్పట్లో కేరళలో హెవీ డ్రైవింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు ఉండేవి కావట. దాంతో ప్రభుత్వంతో న్యాయపోరాటం చేసి తనే ఒక హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ ఇనిస్టిట్యూట్‌ని ఏర్పాటు చేశారు. అలా వందల మందికి ఆమె డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చారు. వీరిలో చాలామంది మహిళలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే క్రేన్లు, ప్రొక్లెయినర్లు, రోడ్‌ రోలర్లు.. వంటి భారీ వాహనాలను నడపడం నేర్చుకున్నారు. ఇటీవలే రాధామణి ప్రమాదకరమైన కంటెయినర్‌, ఆయిల్‌ ట్యాంకర్‌ వంటి వాహనాలు నడిపే లైసెన్స్ కూడా పొందారు. అలా ఇప్పటివరకు ఆమె 11 రకాల డ్రైవింగ్‌ లైసెన్స్‌లను పొందారు. వయసు సహకరించి ఉంటే విమాన పైలట్, లోకో పైలట్‌ వంటి లైసెన్స్‌లు కూడా సంపాదించేదాన్నని రాధామణి చెప్పడం విశేషం.

స్కూటీ నడపడమే ఇష్టం..!

రాధామణి వయసు రీత్యా ప్రస్తుతం డ్రైవింగ్‌ స్కూల్‌కి సంబంధించిన సాంకేతిక అంశాలను చూసుకుంటున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులున్నారు. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే ఆమె కారు నేర్చుకున్న 10 సంవత్సరాల తర్వాత బైక్ నడపడం నేర్చుకున్నారట. అయితే ఇన్ని భారీ వాహనాలు నడిపిన ఆమెకు స్కూటీ తోలడమంటేనే ఎక్కువగా ఇష్టమట. తన డ్రైవింగ్‌తో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోన్న ఆమె, ఈ రంగంలో మహిళలకు అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వాటిని అందిపుచ్చుకోవడానికి మహిళలు ధైర్యంగా ముందుకు రావాలన్నది ఆమె సలహా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్