సెలబ్రిటీలకూ ఈవిడ స్వీట్లంటే ఇష్టం..!

‘బాల్యం అంటే మధురం, యవ్వనం అంటే ఆనందం, వృద్ధాప్యం అంటే శాపం’ అని జీవితం గురించి ఓ తత్త్వవేత్త చెప్పాడు. అయితే ఇదంతా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేని వారు చెప్పే మాటలు అని నిరూపిస్తున్నారు కొందరు వృద్ధులు. తొంభైల్లోకి అడుగుపెట్టినా పాతికేళ్ల యువత నోరెళ్లబెట్టేలా వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తున్నారు... ఫ్యాషన్‌, మోడలింగ్‌లో మెరుపులు మెరిపిస్తున్నారు...

Updated : 25 Jun 2021 19:05 IST

Photo: Instagram

‘బాల్యం అంటే మధురం, యవ్వనం అంటే ఆనందం, వృద్ధాప్యం అంటే శాపం’ అని జీవితం గురించి ఓ తత్త్వవేత్త చెప్పాడు. అయితే ఇదంతా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేని వారు చెప్పే మాటలు అని నిరూపిస్తున్నారు కొందరు వృద్ధులు. తొంభైల్లోకి అడుగుపెట్టినా పాతికేళ్ల యువత నోరెళ్లబెట్టేలా వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తున్నారు... ఫ్యాషన్‌, మోడలింగ్‌లో మెరుపులు మెరిపిస్తున్నారు... సామాజిక సేవలో భాగమై నిస్సహాయులకు అండగా నిలుస్తున్నారు. మరికొంతమంది ఎవరి మీదా ఆధారపడకుండా వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. ఈ కోవకే చెందుతారు చండీగఢ్‌కు చెందిన హర్భజన్‌ కౌర్‌. 95 ఏళ్ల వయసులో కూడా స్వీట్ల వ్యాపారాన్ని నడుపుతోన్న ఆమె ‘వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే’ అని నిరూపిస్తున్నారు.

 

కరోనా నుంచి బయటపడి!

తొంభై ఐదేళ్ల వయసంటే నడవడానికి కాళ్లు రావు, కూర్చుందామంటే నడుము సహకరించదు, పడుకుందామంటే నిద్ర పట్టదు. పైగా ప్రస్తుత కరోనా కాలంలో వీటికి తోడు చాలామందిని మానసిక ఒత్తిడి-ఆందోళనలు వేధిస్తున్నాయి. అందుకే వృద్ధుల్ని ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉండమని పదే పదే హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అయితే ఇందుకు భిన్నంగా 95 ఏళ్ల వయసులో మిఠాయిల వ్యాపారం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు హర్భజన్‌ కౌర్‌. ఇటీవల కొవిడ్‌ కోరల్లో చిక్కి మరింత బలంగా బయటికొచ్చిన ఆమె తాజాగా ఓ సోషల్‌ మీడియా బ్లాగ్‌ ద్వారా తన విజయగాథను పంచుకున్నారు.

90 ఏళ్ల వయసులో మొదలు పెట్టి!

హర్భజన్‌ కౌర్‌కు ఎప్పటికైనా తన సొంత నైపుణ్యంతో డబ్బులు సంపాదించాలనే కోరిక ఉండేది. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం ఓసారి ఆమె కూతురు రవీనా, ‘అమ్మా... నీకేమైనా తీరని కోరికలు ఉన్నాయా ?’ అని ఆమెను అడిగినప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టారట కౌర్‌. ‘చిన్నప్పుడు మిఠాయిలు, చాక్లెట్స్‌, షర్బత్‌లు కావాలంటే వెంటనే తయారుచేసిచ్చేది. వీటి కోసం మేం ఎప్పుడూ బయటికెళ్లిన సందర్భాలు లేవు. ఇక శీతాకాలంలో అయితే మా కుటుంబ సభ్యులందరి కోసం ‘బేసన్‌ కీ బర్ఫీ’ ప్రత్యేకంగా చేసి పెట్టేది. ఇది మాకెంతో ఇష్టమైన రెసిపీ’ అని చెప్పిన రవీనా.. ఇదే స్వీట్‌ని మళ్లీ హర్భజన్‌తో చేయించి తనే స్వయంగా మార్కెట్లో అమ్మడం మొదలుపెట్టింది. ఇలా ఐదేళ్ల క్రితం మొదలైన ‘బేసన్‌ కీ బర్ఫీ’ వ్యాపారం చండీగఢ్‌లోని మిఠాయి ప్రియుల చేత ‘సూపర్‌ టేస్టీ’ అనిపిస్తోంది. అలా మొదటిసారి తన ప్రతిభతో సంపాదించిన 2000 రూపాయలను చూసుకున్న హర్భజన్‌ కౌర్‌ ఎంతో మురిసిపోయారట.

ఆ ట్వీట్‌తో గుర్తింపు!

ఆ తర్వాత ఆమె మిఠాయిల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. పంజాబ్‌, ముంబయి, దిల్లీ నుంచి ప్రత్యేక ఆర్డర్లు కూడా వచ్చాయి. కోయంబత్తూర్‌, హైదరాబాద్‌ లాంటి నగరాల్లో అయితే శాఖల్ని కూడా ఏర్పాటుచేశారు. అనిల్‌ కపూర్‌, నీతూ సింగ్‌, కరణ్‌ జోహర్‌.. లాంటి బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఈమె స్వీట్లను ఇష్టపడి తినేవారట. ఈక్రమంలో హర్భజన్‌ పాకశాస్త్ర ప్రావీణ్యం ఆనోటా ఈనోటా పాకి గతేడాది ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రాను కూడా చేరింది. ఈ సందర్భంగా ఆమె ‘బేసన్‌ కీ బర్ఫీ’ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఆయన ‘ఈమె నా బిజినెస్‌ ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అంటూ ప్రశంసలు కురిపించారు. ఆనంద్‌ మహీంద్రాను ఫాలో అయ్యే నెటిజన్లు ఈ వీడియోను తమ రీట్వీట్స్‌తో వైరల్‌ చేయడంతో హర్భజన్‌ కౌర్‌ గురించి దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. ఇక గతేడాది ఫిబ్రవరిలోనే ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ‘ఆంత్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుతో కౌర్‌ను గౌరవించింది.

కరోనా నుంచి కోలుకుని!

ఆనంద్‌ ట్వీట్‌ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన హర్భజన్‌ కౌర్‌కు కొద్ది రోజుల్లోనే ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. మనవరాళ్లు ఆమె వంట చేస్తున్నప్పుడు వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటారు. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 17వేలమందికి పైగా ఫాలోవర్లు ఉండడం విశేషం. ఇక కరోనా సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ బారిన పడ్డ హర్భజన్‌ కౌర్‌ ఇటీవల కోలుకున్నారు. అయితే మునుపటిలా కాకుండా వారంలో మూడు రోజులు మాత్రమే స్వీట్లు తయారుచేస్తున్నారామె. వాటి తయారీకి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తున్నారు. ‘మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడానికి ఏదో ఒక పనైతే కచ్చితంగా చేయాలి. నేనూ అదే చేస్తున్నా. అయితే కాస్త ఆలస్యంగా అయినా మనల్ని మనం నిరూపించుకోవడానికి వయసుతో సంబంధం లేదు. నేను 95 ఏళ్ల వయసులో సాధించాను. మీరు సాధించలేరా?!’ అంటూ తన మనవరాళ్లతో పాటు అందరిలో స్ఫూర్తి నింపుతున్నారీ గ్రాండ్‌ ఓల్డ్‌ వుమన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్