Miss India Sini Shetty: చిన్నప్పటి నుంచే కలలు కంది.. సాధించింది!

అందాల పోటీల గురించి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. కొంతమంది ఇవి అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అంటే.. మరికొంతమంది మాత్రం ఇవి శరీర సౌందర్యాన్ని ప్రదర్శించడమే అని అంటుంటారు. కానీ, ఈ పోటీల్లో నెగ్గాలంటే కేవలం.....

Updated : 05 Jul 2022 18:24 IST

(Photos: Instagram)

అందాల పోటీల గురించి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. కొంతమంది ఇవి అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అంటే.. మరికొంతమంది మాత్రం ఇవి శరీర సౌందర్యాన్ని ప్రదర్శించడమే అని అంటుంటారు. కానీ, ఈ పోటీల్లో నెగ్గాలంటే కేవలం అందం ఒక్కటే సరిపోదు. అందుకు తగ్గ ప్రతిభ కూడా కనబరచాలి. అందుకే ఈ పోటీల్లో గెలిచిన వారిని ‘బ్యూటీ విత్‌ బ్రెయిన్స్’ అని అంటుంటారు. తాజాగా జరిగిన మిస్‌ ఇండియా పోటీల్లో కర్ణాటకకు చెందిన సినీ శెట్టి టైటిల్‌ని సొంతం చేసుకుంది. మన తెలుగమ్మాయి, మాజీ మిస్‌ ఇండియా మానస వారణాసి సినీకి కిరీటాన్ని అందించింది. ఈ క్రమంలో నయా మిస్‌ ఇండియా సినీ శెట్టి గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందామా...

బాలీవుడ్‌ భామల నడుమ..

58వ మిస్‌ ఇండియా పోటీలు ముంబయిలోని రిలయన్స్ జియో కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం ముగిశాయి. మొత్తం 31 మంది అమ్మాయిలు ఫైనల్‌ రౌండ్‌లో పోటీ పడ్డారు. ఇందులో కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల సినీ శెట్టి టైటిల్‌ని సొంతం చేసుకోగా.. రాజస్థాన్‌కు చెందిన రుబల్‌ షెకావత్‌ మొదటి రన్నరప్‌గా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షినతా చౌహాన్ రెండవ రన్నరప్‌గా నిలిచారు. కాగా, అందాల తారలు నేహా ధూపియా, మలైకా అరోరాతో పాటు మాజీ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌లు జ్యూరీలో సభ్యులుగా ఉన్నారు. ఇక మరో తార కృతి సనన్‌ తన డ్యాన్స్‌తో ఈవెంట్‌కి మరింత అందాన్ని తెచ్చింది.

❀ సినీ శెట్టిది కర్ణాటక అయినా పుట్టి పెరిగిందంతా ముంబయిలోనే. ఆమె 2001వ సంవత్సరంలో ఓ సంప్రదాయ కన్నడ కుటుంబంలో జన్మించింది.

❀ అకౌంటింగ్‌ & ఫైనాన్స్‌లో డిగ్రీ పట్టా పొందిన సినీ శెట్టి.. ప్రస్తుతం ఛార్టర్డ్ ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్స్ (సీఎఫ్‌ఏ) కోర్సు చేస్తోంది.

❀ సినీకి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్‌పై మక్కువ ఎక్కువ. మోడల్‌గా ఎదగాలని ఎన్నో కలలు కంది. అలా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పలు సంస్థలకు మోడల్‌గా పని చేసింది. ఈ సంవత్సరం మొదట్లో ‘మిస్‌ ఇండియా కర్ణాటక’ టైటిల్‌ని సైతం సొంతం చేసుకుంది.

❀ 2017లో సినీ శెట్టి ఇన్‌స్టా కుటుంబంలోకి అడుగుపెట్టింది. ప్రకృతిని ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోని తొలిసారి షేర్‌ చేసింది. ప్రకృతి అంటే తనకెంతో ఇష్టమని తను పెట్టే పోస్టుల ద్వారా చెప్పకనే చెబుతుంది!

❀ సినీకి డ్యాన్స్‌ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఆమె నాలుగేళ్ల వయసులోనే భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. 14 ఏళ్ల వయసులో నృత్యకారిణిగా అరంగేట్రం చేసింది. తన డ్యాన్స్ వీడియోలను కూడా తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతుంటుంది. ఆమె పోస్ట్ చేసిన ఒక డ్యాన్స్‌ వీడియోకి 2 లక్షల వీక్షణలు వచ్చాయి. సినీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 86 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

❀ సినీకి ట్రావెలంగ్‌ అంటే కూడా ఇష్టం. సమయం కుదిరినప్పుడల్లా వివిధ ప్రాంతాలకు వెళుతుంటుంది. ఇప్పటికే జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్.. దేశాలను చుట్టేసింది.

❀ మోడలింగ్‌ని కెరీర్‌గా ఎంచుకోవడానికి బాలీవుడ్‌ తార ప్రియాంక చోప్రానే తనకు స్ఫూర్తి అని చెబుతోంది సినీ.

❀ గతంలో ఎయిర్‌టెల్ కోసం రూపొందించిన ఓ వాణిజ్య ప్రకటనలో మోడల్‌గా నటించింది సినీ.

❀ సినీకి ‘ఇన్‌ టు ది వైల్డ్‌’ అనే ఇంగ్లీష్‌ సినిమా అంటే ఇష్టమట.

❀ సినీ శెట్టి కంటే ముందు కర్ణాటకకు చెందిన ఆరుగురు మహిళలు మిస్‌ ఇండియా టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. వీరిలో లారా దత్తా, సారా జేన్ డయాస్, నఫీసా జోసెఫ్, సంధ్యా చిబ్, రేఖా హండే, లిమరైనా డిసూజాలు ఉన్నారు.

/

❀ మిస్‌ ఇండియా టైటిల్‌ని గెలుచుకోవడంతో సినీ శెట్టి ఈ సంవత్సరం జరిగే 71వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌ తరపున పాల్గొంటుంది.

❀ లక్ష్య సాధన కోసం ఎంతైనా కష్టపడతానంటుంది సినీ. ఏదైనా సరే.. జీవితంలో ఈజీగా దక్కదనేది తన నిశ్చితాభిప్రాయం.

❀ 'నాకంటే మా అమ్మే అందంగా ఉంటుంది.. తన అందంలో నాకు సగం కూడా రాలేద’నే సినీ.. అన్ని విషయాల్లోనూ తనకు అమ్మే ఆదర్శమంటుంది!

2002లో మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న బాలీవుడ్ తార నేహా ధూపియా ఈ పోటీల్లో మెంటార్‌గా వ్యవహరించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని