Updated : 10/12/2021 20:14 IST

ప్రముఖుల మెహెందీ వేడుకలో ఆమె ఉండాల్సిందే!


(Photo: instagram)

సెలబ్రిటీ పెళ్లిళ్లలో ప్రతిదీ ప్రత్యేకమే! అందులోనూ ముఖ్యంగా మెహెందీ వేడుకంటే అందరి దృష్టీ వారి చేతులపై పండే మెహెందీ డిజైన్‌ పైనే ఉంటుంది. ఎందుకంటే ఆ డిజైన్లు అంత వైవిధ్యంగా, ప్రత్యేకంగా ఉంటాయి మరి! ఇలాంటి ఆకర్షణీయమైన మెహెందీ డిజైన్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు సెలబ్రిటీ మెహెందీ ఆర్టిస్ట్‌ వీణా నగ్డా. చిన్న వయసులో సరదా కోసం మెహెందీ నేర్చుకొని.. ఇప్పుడు బాలీవుడ్‌ హీరోయిన్లనే మెప్పించే స్థాయికి ఎదిగారామె. సెలబ్రిటీల ఇంట్లో మెహెందీ వేడుకలంటే కచ్చితంగా ఆమె ఉండాల్సిందే అన్నంతలా తన బ్రైడల్‌ ఆర్ట్‌తో ఎంతోమంది సెలబ్రిటీల మనసు దోచుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల చేతుల్ని విభిన్నమైన డిజైన్లతో నింపిన వీణ.. తాజాగా కత్రినా మెహెందీ ఫంక్షన్‌లో పాల్గొని ఆమెకూ గోరింటాకు పెట్టారు. మరి, సెలబ్రిటీలు ఫిదా అయ్యేంతలా ఆమె మెహెందీలో అంత ప్రత్యేకత ఏముంది? ఒక సాధారణ మహిళ స్థాయి నుంచి బాలీవుడ్‌ మెహెందీ క్వీన్‌గా వీణ ఎలా ఎదిగారు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

వీణా నగ్డా.. తన అసలు పేరు కంటే ‘బాలీవుడ్‌ మెహెందీ క్వీన్‌’గానే ఆమె అందరికీ సుపరిచితం. ఒక రకంగా తన ప్రతిభ, మెహెందీ ఆర్ట్‌లో ఆమె కనబరిచే నైపుణ్యాలు అనతికాలంలోనే ఆమెకు ఈ అరుదైన కీర్తి తెచ్చిపెట్టాయని చెప్పచ్చు. ఒకప్పుడు వీణ మనలాగే సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ముంబయిలో స్థిరపడిన ఓ సంప్రదాయ జైన కుటుంబంలో పుట్టిందామె. తండ్రి పూజారిగా పనిచేసేవారు. తల్లి గృహిణి. చిన్నతనం నుంచీ చదువులో ఎంతో చురుగ్గా ఉండేది వీణ. ఈ క్రమంలోనే పదో తరగతిలో మంచి మార్కులతో పాసైంది. అయితే చదువుపై అమితాసక్తి ఉన్నా కుటుంబ కట్టుబాట్ల కారణంగా ఆపై చదువు కొనసాగించలేకపోయానంటున్నారామె.

వ్యాపకంగా మొదలుపెట్టి..!

‘మేము ఐదుగురు అక్కచెల్లెళ్లం, ఒక సోదరుడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను ఆర్థిక పరిస్థితుల రీత్యా, ఇంట్లో ఉండే కట్టుబాట్ల కారణంగా పదో తరగతితోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అమ్మకు కచ్‌ ఎంబ్రాయిడరీ వర్క్‌లో సహకరించేదాన్ని. ఇలా నాకు క్రియేటివ్‌గా ఆలోచించడం అలవాటైంది. ఇక మెహెందీ విషయానికొస్తే.. సరదాగానే కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్‌కి అకేషనల్‌గా గోరింటాకు పెట్టేదాన్ని. ఎండ్రాయిడరీ డిజైన్స్‌నే మెహెందీగా వేసేదాన్ని. మరోవైపు మా నాన్న స్నేహితుడి మెడికల్‌ ఫ్యాక్టరీలో కొన్నాళ్ల పాటు పనిచేశా. అప్పుడు రోజుకు 6 రూపాయలొచ్చేవి. నిజానికి నేను అందుకున్న మొదటి జీతం అదే. అయితే ఓరోజు మా ఫ్యామిలీ లేడీ డాక్టర్‌ ఒకరు వాళ్లింట్లో పెళ్లి వేడుకలకు నన్ను మెహెందీ పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. దీంతోనే నా మెహెందీ జర్నీ మొదలైందని చెప్పచ్చు.

తనే మొదటి సెలబ్రిటీ క్లైంట్‌!

ఓసారి నా స్నేహితురాలితో ఓ పెళ్లికి వెళ్లాను. అక్కడే అలనాటి నటి పూనమ్‌ థిల్లాన్‌ను చూశాను. నిజానికి ఆ మెహెందీ వేడుక తనదే! తనకు మెహెందీ పెట్టడానికే నా స్నేహితురాలు నన్ను అక్కడికి తీసుకెళ్లిందని తెలిసి ఆశ్చర్యపోయా. అక్కడ నా మెహెందీ మెలకువల్ని ఎంతోమంది ప్రశంసిస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత ఫ్యాక్టరీ జాబ్‌ మానేసి.. మెహెందీనే నా ఫుల్‌టైమ్‌ జాబ్‌గా మార్చుకున్నా. అయితే ఈ క్రమంలో నేను ఇంటికి ఆలస్యంగా వెళ్లడం నాన్నకు నచ్చలేదు. అయినా అమ్మ ప్రోత్సాహంతో దీన్ని కొనసాగించా. అలా మొదలైన నా మెహెందీ జర్నీ ఇప్పటికీ అప్రతిహతంగా సాగుతోంది..’ అంటూ ఓ సందర్భంలో తన జీవితంలోని ఎత్తుపల్లాలను పంచుకున్నారు వీణ.'

‘బాలీవుడ్‌ మెహెందీ క్వీన్‌’గా!

పూనమ్‌ థిల్లాన్‌ మెహెందీ ఫంక్షన్‌ తర్వాత వీణ మెహెందీ మెలకువల గురించి ఆనోటా ఈనోటా పాకింది.. దీంతో నాడు హృతిక్‌ రోషన్‌-సుసానే ఖాన్‌ పెళ్లితో మొదలుపెట్టి.. కరిష్మా కపూర్‌, ట్వింకిల్‌ ఖన్నా, రాణీ ముఖర్జీ, ఫరా ఖాన్‌, శిల్పా శెట్టి, సాక్షీ ధోనీ, ఉపాసన-రామ్‌చరణ్‌, ఈషా డియోల్‌, గీతా బస్రా, ఈషా అంబానీ, శ్లోకా మెహతా, సోనమ్‌ కపూర్‌, దీపికా పదుకొణె, నటాషా దలాల్‌, కాజల్‌ అగర్వాల్‌, అనుష్పల (ఉపాసన సోదరి), తాజాగా కత్రినా కైఫ్‌.. వంటి ఎంతోమంది ప్రముఖుల వివాహ వేడుకల్లో తనదైన ముద్రవేశారు వీణ.

కేవలం సెలబ్రిటీల పెళ్లిళ్లకే కాదు.. ‘కభీ కుషీ కభీ ఘమ్‌’, ‘కల్‌ హో నా హో’, ‘హమ్‌ తుమ్‌’, ‘వాట్స్‌ యువర్‌ రాశి’, ‘యే జవానీ హై దివానీ’.. వంటి ఎన్నో సినిమాల్లో సైతం నటీమణుల చేతుల్ని మెహెందీతో అలంకరించి తనదైన ముద్ర వేశారు. అలాగే కర్వా ఛౌత్‌, ఇతర పండగలప్పుడు కూడా తన మెహెందీ ఆర్ట్‌తో ఎంతోమంది నటీమణుల చేతుల్ని పండిస్తుంటారీ టాప్‌ ఆర్టిస్ట్‌. ఇలా తన మెహెందీ మెలకువలతో, సృజనాత్మకతతో ‘బాలీవుడ్‌ మెహెందీ క్వీన్‌’గా పేరు తెచ్చుకున్నారామె.

ఇన్ని స్టైల్స్‌ ఆమెకే సొంతం!

కేవలం బ్రైడల్‌ మెహెందీనే కాదు.. ‘షేడెడ్‌’, ‘హీరా-మోతీ’, ‘జర్దోసీ’, ‘అరబిక్‌’, ‘బ్లాక్‌ మెహెందీ’, ‘స్టోన్‌/సీక్విన్స్‌/స్వరోస్కీ డైమండ్‌ మెహెందీ’.. వంటి ఎన్నో ప్రత్యేకమైన స్టైల్స్‌లో మగువల చేతులపై మెహెందీని తీర్చిదిద్దడంలో వీణది అందె వేసిన చేయి. అంతేకాదు.. వాళ్ల వాళ్ల అభిరుచులకు అనుగుణంగా పర్సనలైజ్‌డ్‌ మెహెందీని తీర్చిదిద్దడంలో ఆమెకు సాటి మరొకరు లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇక వ్యక్తిగతంగా తను ఎంతో అభిమానించే నటీనటులు సోనమ్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి దిగిన ఫొటోలకు తగినట్లుగా మెహెందీని తీర్చిదిద్దారు వీణ. ఆ ఫొటోలతోనే తన తొలి ఇన్‌స్టా పోస్ట్‌ పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.

కుటుంబానికీ ప్రాధాన్యం!

* వృత్తిలో భాగంగా మహిళలు ఎదగాలంటే.. కుటుంబ సభ్యులు, భర్త సహకారం కచ్చితంగా ఉండాలంటున్నారు వీణ. ఈ క్రమంలో తనను ప్రోత్సహించడంలో తన భర్త ముందుంటారని చెబుతుంటారు. మరోవైపు తన మనవడితో ఆడుకుంటూ దిగిన ఫొటోల్ని కూడా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటారు వీణ.
* సెలబ్రిటీల మెహెందీ వేడుకంటే తనే గుర్తొచ్చేలా ఎదిగిన వీణ.. వేగంగా మెహెందీ పెట్టడంలో అరుదైన రికార్డు కూడా నెలకొల్పారు. అంతేకాదు.. తన ప్రతిభకు గుర్తింపుగా గతేడాది ‘విమెన్‌ ఎక్సలెన్స్‌ ఎంపవర్‌మెంట్‌ అవార్డు’ కూడా అందుకున్నారు.

* సెలబ్రిటీ మెహెందీ ఆర్టిస్ట్‌ కదా.. ఆమె ఫీజు కూడా ఎక్కువగానే తీసుకుంటారేమోనన్నది చాలామంది భావన. కానీ డిజైన్‌ను బట్టి బ్రైడల్‌ మెహెందీకి (రెండు చేతులు, రెండు కాళ్లు) రూ. 3000 నుంచి రూ. 7000 వరకు తీసుకుంటారట వీణ. అలాగే ఇక మిగతా అతిథులకు ఒక్కొక్కరికి రూ. 50 నుంచి రూ. 70 వరకు ఉంటుందట! నిజానికి మార్కెట్‌తో పోల్చితే ఇది సాధారణమైన ధరే అని చెప్పచ్చు.

* తన మెహెందీ మెలకువల్ని నలుగురికీ పంచడానికి ఓ మెహెందీ స్కూల్‌ని కూడా నడుపుతున్నారు వీణ. ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు 50 వేల మందికి ఈ కళలో నైపుణ్యాలు అందించారామె.

తపన ఉండాలే కానీ మనలోని క్రియేటివిటీకి తిరుగనేదే ఉండదని నిరూపిస్తోన్న ఈ మెహెందీ క్వీన్‌ సృజన నుంచి జాలువారిన కొన్ని గోరింటాకు డిజైన్లపై ఓ లుక్కేద్దాం రండి..!

B8B-PEgJHUW

Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని