Updated : 28/10/2021 18:19 IST

Automotive Field: కార్లు, బుల్లెట్ బండ్లు.. ఏవైనా తయారు చేసేస్తాం!

మొన్నటిదాకా బైక్‌ వెనక సీటుకే పరిమితమైన మహిళలు.. ఇప్పుడు ఏ వాహనమైనా అలవోకగా నడిపేస్తున్నారు. అంతేనా.. మరో అడుగు ముందుకేసి వాటి తయారీలోనూ పాలుపంచుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే.. తమిళనాడులో ఇటీవలే నెలకొల్పిన ‘ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ’ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల కంపెనీ. కేవలం మహిళలు మాత్రమే పనిచేస్తోన్న ఈ తయారీ యూనిట్లో ఇప్పటికే వేల మంది మహిళా ఉద్యోగులు చేరారు. అంతేకాదు.. ఈ-స్కూటర్ల తయారీ కోసం ఉద్యోగినులంతా తమ విధుల్లో ఎలా నిమగ్నమయ్యారో ప్రత్యక్షంగా అందరికీ చూపించేందుకు తాజాగా ఓ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు సీఈవో భవీష్‌ అగర్వాల్‌. ‘హరిత శక్తి కోసం నారీ శక్తి’ అనే క్యాప్షన్‌తో ట్రెండ్‌ అవుతోన్న ఈ వీడియో.. మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తోంది. వాహన తయారీ రంగాల్లో ప్రవేశించే ఆసక్తి ఉన్న ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తోంది.

మరి, మొన్నటిదాకా పురుషాధిపత్యం ఉన్న ఈ రంగంలోకి మహిళలు ప్రవేశించడానికి ఎందుకు ఉత్సుకత చూపుతున్నారు? ఇందులో మహిళల భవిష్యత్తు ఎలా ఉండనుంది? ఈ రంగంలో రాణించాలంటే మహిళలు అందిపుచ్చుకోవాల్సిన నైపుణ్యాలేంటి? వంటి అంశాలతో కూడిన ప్రత్యేక కథనం మీకోసం..

అమ్మాయిలు అరుదుగా ప్రవేశించే రంగాల్లో వాహన తయారీ (ఆటోమొబైల్స్/ ఆటోమోటివ్) ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఈ రంగంలో కొంతమంది మహిళలున్నప్పటికీ పూర్తి స్థాయి మహిళా ఉద్యోగులున్న యూనిట్ మాత్రం తమిళనాడులో ఇటీవలే నెలకొల్పిన ‘ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ’ అని చెప్పచ్చు. ఎలక్ట్రిక్‌ స్కూటర్లను తయారు చేసే ఈ యూనిట్ పూర్తి స్థాయి మహిళా ఉద్యోగులతో పనిచేస్తుందని, ఇందుకోసం పది వేల మంది మహిళా ఉద్యోగుల్ని రిక్రూట్‌ చేసుకోనున్నట్లు సంస్థ సీఈవో భవీష్‌ అగర్వాల్‌ గత నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే! అయితే ఇప్పటికే విధుల్లో చేరిన కొందరు ఉద్యోగినులు స్కూటర్ల తయారీలో నిమగ్నమై ఉన్న ఓ వీడియోను ‘హరిత శక్తి కోసం నారీ శక్తి’ క్యాప్షన్‌తో తాజాగా ట్విట్టర్‌లో పంచుకున్నారాయన! దీంతో ‘అరుదైన రంగాల్లో మహిళా శక్తి’ అనే అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చినట్లయింది.

ఎందుకు ఎంచుకుంటున్నారంటే..?!

కెరీర్‌ని ఎంచుకునే క్రమంలో మహిళలు దృష్టి సారించే అంశాలు రెండే రెండు. ఒకటి - ఉద్యోగ భద్రత, రెండు - మంచి జీతభత్యాలు. ఈ రెండూ అనుకూలిస్తే అరుదైన రంగాల్లో ప్రవేశించడానికీ, పురుషాధిపత్యం ఉన్న రంగాల్లో రాణించడానికీ మహిళలు వెనకాడట్లేదు. ఆటోమోటివ్‌/ఆటోమొబైల్స్‌ రంగాల్లో మహిళల సంఖ్య పెరగడానికీ ఇదే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. అమెరికాకు చెందిన ‘నేషనల్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్ (NADA)’ ప్రకారం.. ఆటో టెక్నీషియన్‌ రంగంలోకి ప్రవేశించే ప్రతి ఐదుగురిలో కనీసం ఒక్కరైనా మహిళ ఉంటున్నట్లు తేలింది. ఇలా మహిళలు ఈ రంగంపై ఆసక్తి చూపడానికి, కంపెనీలు కూడా స్త్రీల వైపు మొగ్గు చూపడానికి పలు కారణాలున్నాయంటున్నారు నిపుణులు.

* ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకునే విషయంలో ఈ కాలపు అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా పోటీ పడుతున్నారని చెప్పచ్చు. ఈ క్రమంలో కార్లు, బైక్‌లు నడపడమే కాదు.. వాటికి సంబంధించిన హార్డ్‌వేర్‌ పనులు నేర్చుకోవడానికీ ఉత్సుకత చూపుతున్నారు. ఈ ఆసక్తే వారిని ఇటువైపుగా అడుగులేయిస్తోందంటున్నారు నిపుణులు.

* పురుషులతో పోల్చితే మహిళల శరీర నిర్మాణం చిన్నది. దీంతో వాహనాల విడిభాగాలకు సంబంధించిన మరమ్మతులను వారు సులభంగా చేయగలరు. దీనివల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. ఇది దృష్టిలో ఉంచుకొనే చాలా కంపెనీలు మహిళల్ని రిక్రూట్‌ చేసుకుంటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

* ఇతర రంగాలతో పోల్చితే ఆటోమొబైల్స్‌లో కెరీర్‌ అభివృద్ధి వేగంగా ఉంటుందని, ఇదే ఎక్కువమంది అమ్మాయిలు ఈ రంగాన్ని ఎంచుకునేందుకు దోహదం చేస్తోందని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. ఓ కంపెనీలో చేరి ఇలా వాహనాలకు సంబంధించిన హార్డ్‌వేర్‌ పనులు నేర్చుకొని.. ఆపై వాళ్లే స్వయంగా వ్యాపారం ప్రారంభించచ్చని, తద్వారా మరో నలుగురికి ఉపాధి కల్పించచ్చన్న ఆలోచన కూడా వారిలో ఉండచ్చని అంటున్నారు.

* ఏ పనైనా మహిళలు ఓపికతో, నీట్‌గా చేయడంలో దిట్ట. బహుశా చిన్నతనం నుంచి ఇంటి పనులు నేర్చుకోవడం, తల్లిని చూస్తూ పెరగడం వల్లే వారికి ఈ నైపుణ్యాలు అలవడతాయేమో! నిజానికి ఇలాంటి క్వాలిటీస్‌ పురుషుల్లో చాలా తక్కువమందిలో ఉంటాయి. ఆటోమొబైల్‌ కంపెనీలు ఈ విషయం దృష్టిలో ఉంచుకొని.. మహిళలైతేనే పూర్తి సమర్థంగా పనిచేయగలరన్న నమ్మకంతో వారికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నట్లు కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇలా కారణమేదైనా మెకానిక్‌ రంగంలో భవిష్యత్తంతా మహిళలదే అన్న విషయం స్పష్టమవుతోంది.

 

వారే స్ఫూర్తిగా..!

వాహన రంగంలో ఇప్పుడిప్పుడే మహిళల ప్రాతినిథ్యం పెరుగుతోన్నా.. గతంలోనూ కొందరు మహిళలు ఇందులోకి ప్రవేశించి సత్తా చాటారు. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు అతివలు ఇదే బాట పట్టారు.

* ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్యగా, సామాజిక కార్యకర్తగానే సుధామూర్తి అందరికీ తెలుసు. కానీ ఆటోమొబైల్‌ తయారీ యూనిట్లో పనిచేసిన తొలి మహిళా ఇంజినీర్‌ ఆమె. 1974 ఏప్రిల్‌లో పుణేలోని టాటా మోటార్స్‌ ప్లాంట్‌లో ఆమెను జేఆర్‌డీ టాటా స్వయంగా నియమించారు. ఇలా అరుదైన రంగంలోనూ అమ్మాయిలు సత్తా చాటగలరని నిరూపించారామె.

* అత్యంత ఆదరణ పొందిన మహీంద్రా ఎక్స్‌యూవీ 500.. 2011లో విడుదలై హాట్‌కేక్‌లా అమ్ముడుపోయింది. ఇలా ఈ విభాగంలో అత్యుత్తమ డిజైన్‌ కారుగా పేరు తెచ్చుకున్న ఈ మోడల్‌ను డిజైన్‌ చేసింది రామ్‌కృపా అనంతన్‌. తన డిజైనింగ్‌ నైపుణ్యంతో కంపెనీ అభివృద్ధిలో పాలుపంచుకోవడమే కాదు.. కంపెనీ డిజైనింగ్‌ హెడ్‌ స్థాయికి చేరుకోగలిగారామె.

* బజాజ్‌ టూవీలర్‌ కొన్నేళ్ల కిందట డోమినర్‌ పేరుతో 400 సీసీ బైకును తయారుచేసింది. అబ్బాయిల మనసు దోచిన ఈ బైక్‌ని రూపొందించింది పూర్తిగా మహిళలే అన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు! పుణే సమీపంలోని చకన్‌ ప్లాంట్‌లో తయారయ్యే ఈ బైక్‌ తయారీ కోసం.. సుమారు 130 మంది మహిళలు బరువైన విడిభాగాలను మోయడం, వాటిని అనుసంధానించడం, వెల్డింగ్‌, పెయింటింగ్‌, ఫినిషింగ్.. ఇలా ప్రతి పనినీ వారే చూసుకుంటున్నారు. ఇవే కాదు.. కేటీఎం, పల్సర్‌ బైక్‌లు, చేతక్‌ స్కూటర్‌ తయారీ.. వంటి వాహన తయారీ పనుల్లోనూ పాలుపంచుకుంటున్నారు. తద్వారా పురుషులకే సాధ్యమనుకున్న పనుల్ని తామూ చేయగలమని నిరూపిస్తున్నారు.

* యువత ఇష్టపడే బుల్లెట్‌ బండి (రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌) తయారీ ప్లాంట్‌లోనూ దాదాపు 20 శాతం మంది మహిళల్ని నియమించుకున్నట్లు గతంలో హీరో మోటార్స్‌ తెలిపింది. ‘ప్రాజెక్ట్‌ తేజస్విని’ కింద పనిచేస్తోన్న వీళ్ల కోసం ప్రత్యామ్నాయ కెరీర్‌ ప్రోగ్రామ్స్‌ కూడా ప్రారంభించింది.

* ఇక ఇటీవలే తమిళనాడులో ‘ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ’ పేరుతో ఓ ప్లాంట్‌ని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది ఓలా. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కోసం రూపొందుతోన్న ఈ ఫ్యాక్టరీలో పనిచేయబోయేదంతా మహిళలేనంటూ ఆ సంస్థ సీఈవో ఇటీవలే ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

 

ఈ నైపుణ్యాలుండాల్సిందే!

ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవడం, నైపుణ్యాలు పెంచుకోవడం.. ఏ రంగంలో ఎదగడానికైనా కావాల్సినవి ఇవే! ఆటోమొబైల్‌ రంగంలోనూ దూసుకుపోవాలంటే ఇవే కీలకం అంటున్నారు నిపుణులు. మరికొన్ని అదనపు మెలకువలు కూడా మనల్ని అందలం ఎక్కించే అవకాశాలున్నాయంటున్నారు.

* సమస్యను విశ్లేషించే, పరిష్కరించే సామర్థ్యం పెంచుకోవాలి.

* భవిష్యత్తంతా ఎలక్ట్రిక్‌ వాహనాలదే కాబట్టి.. ఈ-వెహికల్స్‌కి సంబంధించిన మెకానికల్‌ పద్ధతుల్ని ఔపోసన పట్టాలి.

* డిజిటల్‌ సర్క్యూట్స్‌పై పట్టు పెంచుకోవాలి. అలాగే వాటిని మెకానికల్‌/ఎలక్ట్రో మెకానికల్‌ పద్ధతులతో అనుసంధానించడం ఎలాగో తెలిసుండాలి.

* మల్టీటాస్కింగ్‌, సృజనాత్మకత, క్రిటికల్‌ థింకింగ్‌.. వంటివీ వాహన తయారీ రంగంలో రాణించాలంటే ఉండాల్సిన కొన్ని నైపుణ్యాలలో ముఖ్యమైనవే.

* సహచరులతో, వినియోగదారులతో సులభంగా కలిసిపోయేందుకు చక్కటి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు.

ఇదంతా చదువుతుంటే వాహన తయారీ రంగంలో మహిళల భవితవ్యం ఉన్నతంగా ఉండనుందన్న విషయం స్పష్టమవుతోంది కదూ. అయితే ఈ క్రమంలో మహిళలు రాణించాలంటే వారి ఆసక్తితో పాటు ఇంట్లో వాళ్ల ప్రోత్సాహం కూడా అవసరం అంటున్నారు నిపుణులు. అప్పుడే ఈ రంగంలోనూ అన్ని విషయాల్లో లింగ సమానత్వం సాధ్యమవుతుందంటున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని