నాన్న కూర‌గాయల విక్రేత.. కూతురు సివిల్ జడ్జి!

ఈ రోజుల్లో చాలామంది యువత చిన్న చిన్న అవాంతరాలకే కుంగిపోతున్నారు. అయినా కొంతమంది మాత్రం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తూనే ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత నాగర్ అనే అమ్మాయి....

Updated : 18 May 2022 12:49 IST

ఈ రోజుల్లో చాలామంది యువత చిన్న చిన్న అవాంతరాలకే కుంగిపోతున్నారు. అయినా కొంతమంది మాత్రం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తూనే ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత నాగర్ అనే అమ్మాయి కూడా ఈ కోవకే చెందుతుంది. కూరగాయలు అమ్మితే కానీ పూట గడవని కుటుంబంలో జన్మించిన ఆమె.. పట్టు వదలకుండా చదివి సివిల్ జడ్జిగా ఎంపికైంది. ఈ క్రమంలో అంకిత గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మీకోసం...

డాక్టర్‌ కావాలనుకుని...

అంకిత (29)ది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లా ముసఖేది అనే ప్రాంతం. ఆమె తల్లిదండ్రులు అదే ప్రాంతంలో తోపుడు బండిలో కూరగాయలు అమ్ముతుంటారు. వారికి ముగ్గురు సంతానం. వారిలో అంకిత మధ్య అమ్మాయి. అంకిత చిన్నతనంలో డాక్టర్‌ కావాలనుకుందట.

‘నేను స్కూల్‌లో చదువుతున్నప్పుడే డాక్టర్‌ కావాలనుకున్నాను. కానీ, మా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అందుకు సరిపోదు. అందుకే ఆ ఆలోచనను విరమించుకున్నాను. కానీ, నా ముందు మరిన్ని అవకాశాలు కన్పించాయి. వాటిని సాధించాలంటే కష్టపడి చదవడమే ముందున్న మార్గం అనుకున్నాను’ అని అంటోందీ కొత్త జడ్జి. అలా ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా స్కాలర్‌షిప్‌లతో ఎల్ఎల్‌ఎమ్, ఎల్‌ఎల్‌బి పూర్తి చేసింది.

అప్లికేషన్‌కు కూడా డబ్బులు లేవు..

అంకిత ఒక వైపు ఎల్‌ఎల్‌బి చదువుతూనే మరోవైపు జడ్జి పరీక్షకు ప్రిపేర్‌ అవ్వడం ప్రారంభించింది. దానికోసం రోజూ 8 నుంచి 10 గంటల వరకు చదివింది. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఒకానొక సమయంలో పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఆమె దగ్గర సరిపడ డబ్బులు లేవు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఒకవైపు చదువుతూనే కొంత సమయం తల్లిదండ్రులకు సహాయంగా కూరగాయలూ అమ్మింది.

పెళ్లి చేసుకోమని ఒత్తిళ్లు...

కొన్ని కుటుంబాల్లో అమ్మాయిలు ఒక వయసుకు వచ్చాక వారిని పెళ్లి చేసుకోమంటూ పెద్దలు ఒత్తిడి చేస్తుంటారు. అవే ఒత్తిళ్లు తనకూ ఎదురయ్యాయంటోంది అంకిత. ‘ఎల్‌ఎల్‌బి పూర్తైన దగ్గర్నుంచి పెళ్లి చేసుకోమని బంధువుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. కానీ ఆ సమయంలో నా తల్లిదండ్రులు నాకు మద్దతుగా నిలిచారు’ అని చెప్పుకొచ్చింది.

నాలుగో ప్రయత్నంలో..

కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్‌ తనకు ఎంతో ఉపయోగపడిందని చెబుతోంది అంకిత. ఇంటి దగ్గరే ఉండడంతో ఎక్కువ సమయం చదువుకు కేటాయించింది. ఇందుకోసం యూట్యూబ్ని ఎక్కువగా ఉపయోగించుకుందట. ‘లాక్‌డౌన్‌లో చదువుకోవడానికి ఎక్కువ సమయం దొరికింది. యూట్యూబ్‌ ద్వారానే ఎక్కువగా చదువుకున్నాను. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌లు ఆర్థికంగా ఉపయోగపడ్డాయి’ అని చెప్పుకొచ్చింది.

ఎన్నో సవాళ్లను అధిగమించి కష్టపడి చదివిన అంకితకు మొదటి ప్రయత్నంలోనే ఓటమి ఎదురయ్యింది. కానీ, జడ్జి కావాలనే దృఢ సంకల్పంతో పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నించింది. అలా మొదటి మూడు ప్రయత్నాలు విఫలమైనా తన నాలుగో ప్రయత్నంలో విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన సివిల్‌ జడ్జి క్లాస్‌-2 ఫలితాల్లో ఎస్సీ విభాగంలో ఐదవ ర్యాంకును సొంతం చేసుకుని తన చిరకాల కోరికను నేరవేర్చుకుంది.

ఇద్దరూ సమానమే!

అంకిత సాధించిన విజయంతో ఆమె తల్లిదండ్రులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ‘కూరగాయలు అమ్మితే కానీ కుటుంబం గడవదు. అయినా కూతురి చదువు కోసం కొంత డబ్బు దాచేవాళ్లం. గత ఐదారు సంవత్సరాలు చాలా ఇబ్బందిగా గడిచాయి. మా అబ్బాయి, అమ్మాయిలకు సమాన ప్రాధాన్యం ఇచ్చి చదివించాం’ అని చెబుతోంది అంకిత తల్లి లక్ష్మి.

ఇక అంకిత తండ్రి మాట్లాడుతూ ‘మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం. అయినా కొంత మొత్తాన్ని దాచి అంకితను చదివించాం. చాలామంది కొడుకు, కూతురి విషయంలో వ్యత్యాసం చూపిస్తుంటారు. కానీ, అలా చేయకూడదు. ఇద్దరూ సమానమే. ఈ రోజు ప్రతిఒక్కరూ మాకు అభినందనలు తెలియజేస్తున్నారు. నాకు ముగ్గురు పిల్లలు. ఒకరు ఎంబీయే పూర్తి చేశారు. చిన్నమ్మాయికి పెళ్లైంది. అమ్మాయిలు చదువుకోవాలి’ అని చెప్పడం గమనార్హం.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్