దేశానికి రాణే కానీ..

ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ప్రత్యేక విమానం సిద్ధంగా ఉంటుంది. ఏదైనా మ్యాచ్‌ చూడాలనుకుంటే వీఐపీ గ్యాలరీలో సింహాసనం లాంటి కుర్చీ వేసి, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు....

Updated : 08 Dec 2022 19:44 IST

ఆమె ఒక దేశాధ్యక్షురాలు.

ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ప్రత్యేక విమానం సిద్ధంగా ఉంటుంది. ఏదైనా మ్యాచ్‌ చూడాలనుకుంటే వీఐపీ గ్యాలరీలో సింహాసనం లాంటి కుర్చీ వేసి, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. తమ దేశ క్రీడాకారుల్ని అభినందించాలని అనుకుంటే వాళ్లను తన దగ్గరికి పిలిపించుకోవచ్చు. కానీ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ సందర్భంగా క్రొయేషియా అధ్యక్షురాలు కొలిందా గ్రాబర్‌ మాత్రం సామాన్య ఫుట్‌బాల్‌ అభిమానిలా మారిపోయి.. తన చర్యలతో అందరి మనసులు గెలుస్తున్నారు.
ఈసారి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో క్రొయేషియా జట్టు సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్రూప్‌ దశ దాటితే ఎక్కువ అనుకున్న జట్టు.. మహా మహా జట్లకు షాకులిచ్చి ఏకంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐతే క్రొయేషియా ఆట ఎంత చర్చనీయాంశంగా మారిందో.. ఆ దేశ అధ్యక్షురాలు కొలిందా చర్యలు కూడా అంతే చర్చకు దారి తీశాయి. స్వతహాగా ఫుట్‌బాల్‌ అభిమాని అయిన కొలిందా.. అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న తమ జట్టుకు మద్దతుగా నిలిచేందుకు సామాన్య అభిమానులతో కలిసి విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి రష్యాకు చేరుకోవడం విశేషం. క్రొయేషియా ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ను స్టేడియంలో చూసేందుకు వెళ్లిన కొలిందాకు వీఐపీ గ్యాలరీలో ఇబ్బంది ఎదురైంది. క్రొయేషియా జట్టు జెర్సీ ధరించాలని ఆమె భావించగా.. వీఐపీ గ్యాలరీ డ్రెస్‌ కోడ్‌ ప్రకారం అది కుదరదని నిర్వాహకులు తేల్చేశారు. దీంతో కొలిందా నేరుగా సాధారణ స్టాండ్స్‌కు వెళ్లిపోయింది. జట్టు జెర్సీ ధరించి.. అభిమానులతో కలిసి కేరింతలు కొడుతూ మ్యాచ్‌ చూసింది. తర్వాత తమ జట్టు డ్రెస్సింగ్‌ రూంకు వెళ్లి ఆటగాళ్లందరితో చాలా సరదాగా వ్యవహరించింది. అందరినీ హత్తుకుని మరీ అభినందించింది. ఇంగ్లాండ్‌ను ఓడించి తమ జట్టు ఫైనల్‌ చేరాక ఆటగాళ్లతో కలిసి కొలిందా నృత్యం చేస్తూ సంబరాలు చేసుకోవడం విశేషం. ఫైనల్‌కు కూడా కొలిందా హాజరు కానుంది. దేశాధ్యక్షురాలై ఉండి ఒక సగటు సాకర్‌ అభిమానిలా మారిపోయి కొలిందా రష్యాలో సందడి చేస్తుండటం అందరినీ ఆకర్షిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరు మార్మోగుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్