ఈ స్వీపర్‌ అలా డిప్యూటీ కలెక్టరైంది!

నిన్నటి వరకు ఆమె ఓ స్వీపర్‌. ఏ పనైనా గౌరవంతో చేయడం తప్ప చీపురు పట్టుకునేందుకు ఎప్పుడూ నామోషీ పడలేదామె. కానీ తన జీవితాన్ని మాత్రం మరింత ఉన్నతంగా మార్చుకోవాలనుకుంది. అందుకే స్వీపర్‌గా పనిచేస్తూనే పుస్తకాలతో దోస్తీ కట్టింది. డిగ్రీ పట్టా సాధించి పోటీ పరీక్షలకు కూడా ప్రిపేరైంది. పట్టుదలతో శ్రమించి డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపికైంది. ఆమే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన 40 ఏళ్ల ఆశా కందారా.

Published : 17 Jul 2021 19:02 IST

Image for Representation

నిన్నటి వరకు ఆమె ఓ స్వీపర్‌. ఏ పనైనా గౌరవంతో చేయడం తప్ప చీపురు పట్టుకునేందుకు ఎప్పుడూ నామోషీ పడలేదామె. కానీ తన జీవితాన్ని మాత్రం మరింత ఉన్నతంగా మార్చుకోవాలనుకుంది. అందుకే స్వీపర్‌గా పనిచేస్తూనే పుస్తకాలతో దోస్తీ కట్టింది. డిగ్రీ పట్టా సాధించి పోటీ పరీక్షలకు కూడా ప్రిపేరైంది. పట్టుదలతో శ్రమించి డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపికైంది. ఆమే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన 40 ఏళ్ల ఆశా కందారా.

స్వీపర్‌ టు డిప్యూటీ కలెక్టర్‌!

కరోనా కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చిన రాజస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఆర్‌ఏఎస్‌)-2018 పరీక్షా ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జోధ్‌పూర్‌కు చెందిన ఆశకు 728వ ర్యాంకు వచ్చింది. త్వరలోనే ఆమె డిప్యూటీ కలెక్టర్‌గా మంచి జీతంతో పాటు గౌరవప్రదమైన హోదానూ అందుకోనుంది. అయితే తను ఈ స్థాయికి రావడం వెనక సినిమా స్టోరీని తలపించే స్ఫూర్తిదాయక కథ ఉంది.

చిన్నచూపు చూడకుండా!

ఎన్నో ఆశలు, కలలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆశకు ఎదురుదెబ్బ తగిలింది. పెళ్లైన 5 ఏళ్లకే భర్తతో విడాకులు తీసుకుంది. తన ఇద్దరు బిడ్డలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఇలాంటి ప్రతికూలతల నుంచి బయటపడడానికి ఆమెకు చాలా సమయమే పట్టింది. అయితే ఎన్ని కష్టాలొచ్చినా తన కాళ్లపై తాను నిలబడాలనుకుంది ఆశ. ఇందులో భాగంగా తన ఇద్దరు పిల్లల పోషణ కోసం జోధ్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిలో చేరింది. చీపురు పట్టుకుని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పట్టణంలోని రోడ్లన్నీ శుభ్రం చేసింది. తాను చేస్తున్న పనిని ఎప్పుడూ చిన్న చూపు చూడలేదామే. అయితే తన జీవితాన్ని మాత్రం అందంగా మార్చుకోవాలనుకుంది. అందుకు చదువొక్కటే మార్గమని నిర్ణయించుకుంది. ఓవైపు స్వీపర్‌గా విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు డిగ్రీ పూర్తిచేసింది. 2016లో గ్రాడ్యుయేషన్‌ పట్టా అందుకున్న తర్వాత పోటీ పరీక్షల కోసం చదవడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే 2018లో ఆర్‌ఏఎస్‌ ప్రిలిమినరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. అదే ఏడాది చివరిలో మెయిన్స్‌ పరీక్ష కూడా రాసింది. అయితే కరోనా కారణంగా వీటి ఫలితాలు ఇన్నాళ్లూ  వాయిదా పడుతూ వచ్చాయి.

ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా!

ఆర్‌ఏఎస్‌ పరీక్షా ఫలితాల కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్న ఆశ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఆమెకు 728వ ర్యాంకు వచ్చింది. ‘కులం, లింగ వివక్షతో పాటు విడాకులు తీసుకున్న నాకు సమాజం నుంచి ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఏనాడూ వాటికి భయపడలేదు. బదులుగా తిరిగి పోరాడాలనుకున్నాను. నన్ను తక్కువగా చూసే వారికి సరైన సమాధానం చెప్పాలనుకున్నాను. అందుకు చదువొక్కటే మార్గమనిపించింది. డిగ్రీ సంపాదించి మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకున్నాను. అందుకోసం రేయింబవళ్లు కష్టపడ్డాను. ఎట్టకేలకు నా నిరీక్షణ ఫలించింది. ఈ విజయంలో నా పిల్లలతో పాటు నా కుటుంబ సభ్యుల పాత్ర కూడా కీలకమే! ఎందుకంటే వారే నన్ను అడుగడుగునా ప్రోత్సహించారు..’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ సూపర్‌ వుమన్‌.

ఎన్నో అవమానాలు, ఇబ్బందులను అధిగమిస్తూ తన కలను నెరవేర్చుకుంది ఆశ. దీంతో జోధ్‌పూర్‌ మేయర్‌, ఇతర అధికారులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఇక సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూ్ర్తిదాయకమని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్