Updated : 07/02/2022 12:51 IST

మహిళా సాధికారత కోసం ఆమె..!

(Photos: Facebook)

పని ప్రదేశంలో మహిళలు తమదైన శైలిలో రాణిస్తుంటారు. అయినా వారికి లభించే అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. 2021 గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్ సూచీలో భారత్ 140వ  (మొత్తం 156 దేశాలు) స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించడంలో మన దేశం 149వ స్థానంలో ఉంది. స్త్రీలకు సరైన నైపుణ్యాలున్నా వారిపై చూపించే వివక్ష ఇలా పలు నివేదికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది. ఈ అసమానతలను తగ్గించడానికి దేశంలోనే ప్రముఖ బిజినెస్‌ స్కూల్ XLRI లింగ సమానత్వం మరియు సమ్మిళిత నాయకత్వ కేంద్రాన్ని (CGEIL) నెలకొల్పింది. ప్రముఖ జర్నలిస్ట్‌, రచయిత్రి అల్కా రజా దీనికి ఛైర్పర్సన్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో అల్కా రజా, సీజీఈఐల్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందామా...

పూర్వ విద్యార్థుల కృషితో...

XLRI జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ దేశంలోనే పేరు పొందిన బిజినెస్‌ స్కూల్‌. దీనిని 1949లో ఝార్ఖండ్‌లోని జంషెడ్పూర్‌లో నెలకొల్పారు. ఇందులో విద్యను అభ్యసించిన దాదాపు 15000 మంది విద్యార్థులు ప్రపంచంలోని పలు ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఈ స్కూల్‌ యాజమాన్యం పూర్వ విద్యార్థుల సహకారంతో పలు కార్యక్రమాలను రూపొందిస్తుంటుంది. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన కొందరు పూర్వ విద్యార్థులు మహిళలకు పని ప్రదేశంలో సరైన అభివృద్ధి అవకాశాలు దక్కడం లేదని.. వారికి ఏదైనా సహాయం చేయాలని ఆలోచించారు. అనుకుందే తడవుగా XLRI పూర్వ విద్యార్థుల సంఘం సహకారంతో XL ఫర్‌ విమెన్‌ అనే విభాగాన్ని ప్రారంభించారు. దీనిద్వారా మహిళలకు పని ప్రదేశంలో సమాన అవకాశాలు కల్పించడం, ఆర్థిక ఉత్పాదక కార్యక్రమాలలో వారికి సరైన భాగస్వామ్యం కల్పించడం,  వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం లక్ష్యంగా పలు కార్యక్రమాలను రూపొందించారు.

కొద్దిరోజుల తర్వాత XLRI యాజమాన్యం ఈ విభాగాన్ని సెంటర్‌ ఫర్‌ జెండర్‌ ఈక్వాలిటీ అండ్‌ ఇంక్లూజివ్‌ లీడర్‌షిప్ (CGEIL)గా మెరుగుపరిచి గతేడాది మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించింది. దీనికి అల్కా రజా చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. లింగ అసమానతలను తగ్గించడం, వివిధ రంగాల్లో మహిళలకు అవకాశం కల్పించడం, వారిలోని నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుంది.

ఇలాంటి అవకాశం దక్కించుకున్న అల్కా రజా గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మీకోసం...

* కాన్పుర్‌ విద్యామందిర్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన అల్కా.. దిల్లీ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌, ఇంగ్లీష్ విభాగాల్లో డిగ్రీ పట్టా పొందారు. అలాగే ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌, నార్వేలోని పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓస్లో నుంచి డిగ్రీలు సంపాదించారు. అల్కా రజా 1986లో షరిక్‌ బిన్‌ రజాను వివాహమాడారు.

* అల్కా తన కెరీర్‌ని భారత్‌లోని ఓ వార్తా సంస్థలో ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె జాతీయ, అంతర్జాతీయ అంశాలపై పలు వార్తా కథనాలను ప్రచురించారు. ఆ సమయంలోనే ‘OUR PEOPLE O!’, ‘Myths of Female Genital Mutilation’ అనే పుస్తకాలను కూడా రచించారు.

* ఆఫ్రికాలోని DW రేడియోలో పనిచేసిన ఆమె నైజీరియా, ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై పలు ఆసక్తికరమైన కథనాలను ప్రచురించారు.

* జర్నలిస్ట్‌గా అల్కా 25 సంవత్సరాలకు పైగా ఆసియా, ఆఫ్రికా, మిడిల్‌ ఈస్ట్, యూరప్‌, అమెరికాల్లోని 12 దేశాల్లో పని చేశారు. ఈ క్రమంలో ఆమె దాదాపు 70కి పైగా దేశాల్లో పర్యటించారు.

* అల్కా దంపతులు 90 దశకం మధ్యలో దిల్లీ శివారు ప్రాంతంలోని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న హవేలీ ప్యాలస్‌ను సొంత ఖర్చుతో పునరుద్ధరించే బాధ్యతలు తీసుకున్నారు. దీనికి దాదాపు 15 సంవత్సరాల సమయం పట్టింది. అదే సమయంలో అల్కా భారత్‌కు తిరిగి వచ్చారు.

* షిక్వా హవేలీ కేంద్రంగా అల్కా ఇక్కడ పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు సహాయం అందించడం, గృహహింసకు గురైన మహిళలకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం, మహిళలకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించడం, వారికి పలు స్వయం ఉపాధి కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వడం వంటి పనులను చేపడుతున్నారు.

ఛైర్‌పర్సన్‌గా ఎంపికైన తర్వాత అల్కా మాట్లాడుతూ ‘దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థలో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉంది. వెనుకబడిన వర్గాల వారికి సహాయం అందించాల్సిన అవసరం ఉంది. అది మన కర్తవ్యం అని నా అనుభవం నేర్పింది. శతాబ్దాలుగా మహిళలు సమాజానికి చేస్తోన్న కృషిని మనం తప్పకుండా గుర్తించాలి’ అని చెప్పుకొచ్చారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని