Ima Keithel: అందుకే ఆసియాలోనే ఈ మార్కెట్‌కి అంత పేరు!

అదో పెద్ద సంత.. అక్కడ దొరకని వస్తువంటూ లేదు.. ఒక్కసారి ఆ మార్కెట్లోకి అడుగుపెట్టారంటే కాయగూరల దగ్గర్నుంచి ఇంటి అలంకరణ వస్తువుల దాకా కావాల్సినవన్నీ ఒకేసారి ఇంటికి తెచ్చేసుకోవచ్చు. అయినా అందులో ప్రత్యేకత ఏముంది? ప్రస్తుతం ఇలాంటి మార్కెట్లు చాలా చోట్ల వెలిశాయి కదా.. అంటారా? కావచ్చు.. కానీ మహిళలు మాత్రమే విక్రేతలుగా ఉన్న మార్కెట్‌ను మీరెక్కడా చూసుండరు.. ఒక్క మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో తప్ప!

Updated : 18 Dec 2021 17:14 IST

(Image for Representation)

అదో పెద్ద సంత.. అక్కడ దొరకని వస్తువంటూ లేదు.. ఒక్కసారి ఆ మార్కెట్లోకి అడుగుపెట్టారంటే కాయగూరల దగ్గర్నుంచి ఇంటి అలంకరణ వస్తువుల దాకా కావాల్సినవన్నీ ఒకేసారి ఇంటికి తెచ్చేసుకోవచ్చు. అయినా అందులో ప్రత్యేకత ఏముంది? ప్రస్తుతం ఇలాంటి మార్కెట్లు చాలా చోట్ల వెలిశాయి కదా.. అంటారా? కావచ్చు.. కానీ మహిళలు మాత్రమే విక్రేతలుగా ఉన్న మార్కెట్‌ను మీరెక్కడా చూసుండరు.. ఒక్క మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో తప్ప! పది కాదు ఇరవై కాదు.. ఏకంగా ఆరువేల మందికి పైగా మహిళలు ఇక్కడ వివిధ రకాల వస్తువుల్ని అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. అందుకే ఇది ఆసియాలోనే అతిపెద్ద మహిళల మార్కెట్‌గా ప్రసిద్ధి గాంచింది. ఇలా వీరంతా తమ కుటుంబానికి మూలస్తంభాలుగానే కాదు.. తమ వ్యాపారాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకూ పట్టుగొమ్మగా మారారు. అందుకే ప్రపంచమంతా ఇప్పుడు ఈ పూర్తిస్థాయి మహిళా మార్కెట్‌ వైపు చూస్తోంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఈ మహిళా మార్కెట్‌ ప్రత్యేకతలు ఎన్నని చెప్పగలం?!

Ima Market/ Ima Keithel/ Mother's Market/ Nupi Keithel.. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ నడిబొడ్డున Khawairaband Bazaarలో ఉన్న ఈ మార్కెట్‌కు ఎన్నో పేర్లు. పూర్తిగా మహిళలే ఏర్పాటుచేసుకున్న ఈ మార్కెట్‌లో ఏ స్టాల్‌లో చూసినా స్త్రీలే ఆయా వస్తువుల్ని విక్రయించడం చూడచ్చు. ఇక ఇక్కడ దొరకని వస్తువంటూ లేదని చెబుతారు స్థానికులు.

ఐదు శతాబ్దాల చరిత్ర!

ఆధారాల మాట ఎలా ఉన్నా.. ఈ మార్కెట్‌కు 16వ శతాబ్దంలోనే బీజం పడిందని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. మణిపూర్‌లోని పురాతన నిర్బంధ కార్మిక వ్యవస్థ ‘Lallup-Kaba’ ప్రకారం.. మగవారు ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లడం/యుద్ధాల్లో పాల్గొనడం ఆనవాయితీ! అదే సమయంలో కుటుంబ బాధ్యతలు మహిళల పైనే పడేవి. ఈ క్రమంలోనే పంటలు పండించడం, అందరూ కలిసి ఒక చోట మార్కెట్‌గా ఏర్పాటుచేసుకొని ఆయా పంటల్ని విక్రయించి కుటుంబ పోషణ సాగిస్తుండేవారట! అలా వీరంతా కలిసి ఏర్పాటుచేసుకున్న ఈ సంతే ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద మహిళల మార్కెట్‌గా ప్రసిద్ధి చెందిందని చెబుతున్నారు అధ్యయనకారులు.

పోరాడి దక్కించుకున్నారు!

అయితే బ్రిటిష్‌ పరిపాలన కాలంలో తెల్ల దొరలు ఈ మార్కెట్‌ను, మహిళలు పండించిన పంటల్ని స్థానిక అవసరాలతో సంబంధం లేకుండా విదేశీయులకు అక్రమంగా విక్రయించాలని చూశారట! ఆ సమయంలోనూ ఈ మహిళలంతా ఒక్కటై దీనికి వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఈ ఉద్యమాన్నే చరిత్రలో ‘Nupi Lan Movement’గా చెబుతుంటారు. ఇక స్వాతంత్ర్యం వచ్చాకే ఇది తిరిగి పూర్తిగా అక్కడి మహిళల వశమైందని చెప్పచ్చు. అప్పటికీ కొంతమంది ఈ మహిళా విక్రేతల్ని ఖాళీ చేయించి ఈ మార్కెట్‌ను స్వాధీనం చేసుకోవాలని చూశారట! కానీ పోరాట పటిమను అణువణువునా నింపుకొన్న ఈ మహిళామణులు వాళ్లకు ఎదురుతిరిగి మరీ ఈ మార్కెట్‌ను దక్కించుకున్నారని చెబుతుంటారు. మొదట్లో షెడ్లలాగా ఉండే ఈ షాపుల్ని.. ఆ తర్వాత ఇంఫాల్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ నాలుగంతస్తుల బిల్డింగ్‌ నిర్మించడంతో.. అక్కడికి మార్చారు. ఇలా ఆసియాలోనే అతిపెద్ద మహిళా మార్కెట్‌గా పేరుగాంచిన ఈ సంతకెళ్తే.. సామాజిక-రాజకీయ అంశాలు, చుట్టూ జరిగే విషయాల గురించి అక్కడి మహిళలు ఆసక్తిగా మాట్లాడుకోవడం వినచ్చు!

పెళ్లైన మహిళలే అర్హులు!

మొదట్లో పదుల సంఖ్యలో మహిళలతో ప్రారంభమైన ఈ మార్కెట్‌ ఇప్పుడు ఆరువేలకు పైగా మహిళా విక్రేతలతో కళకళలాడుతోంది. మహిళా సంఘం ఆధ్వర్యంలో నడిచే ఈ మార్కెట్లో ఓ షాపు పెట్టాలంటే మాత్రం వాళ్లు కచ్చితంగా వివాహితులై ఉండాలట! ఈ క్రమంలో సదరు మహిళలు.. మహిళా సంఘం నుంచి రుణం పొంది.. వాటితో వస్తువుల్ని విక్రయించి వెంటనే ఇక్కడ షాపు పెట్టుకోవచ్చట. ఇక ఈ రుణం వ్యాపారంలో కుదురుకున్నాక నెమ్మదిగా చెల్లించే వెసులుబాటు కూడా ఉందంటున్నాయి అక్కడి మహిళా సంఘాలు.

దొరకని వస్తువంటూ లేదు!

పూర్తిగా మహిళలే ఏర్పాటు చేసుకున్న ఈ మార్కెట్‌లో దొరకని వస్తువంటూ లేదంటారు స్థానికులు. కాయగూరలు-పండ్లు, మాంసాహారంతో పాటు హస్తకళలకు సంబంధించిన ఉత్పత్తులు, అలంకరణ వస్తువులు, దుస్తులు, యాక్సెసరీస్‌.. ఇలా ఒకటా, రెండా మార్కెట్‌ నలువైపులా ఎటు చూసినా మహిళలు స్వయంగా తయారుచేసిన అందమైన వస్తువులే దర్శనమిస్తుంటాయిక్కడ. పైగా ఇవి అందుబాటు ధరల్లోనే లభ్యమవుతుంటాయట! ఇలా ఈ మహిళలంతా తమ సంపాదనతో కుటుంబాన్ని పోషించుకోవడమే కాదు.. ఈ మార్కెట్‌ ద్వారా ఏడాదికి సుమారు 40-50 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ.. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు.

ఇక కరోనా సమయంలో ఈ మార్కెట్‌ తాత్కాలికంగా కొన్ని నెలల పాటు మూతపడినా.. ఆ తర్వాత తెరచుకొని ఇప్పుడిప్పుడే పుంజుకోవడం గమనార్హం.

ఏదేమైనా మహిళా శక్తికి, సాధికారతకు ప్రతిరూపంగా నిలుస్తోన్న ఈ మార్కెట్‌ ప్రస్తుతం పర్యటక ప్రదేశంగానూ అలరారుతోంది. మరి, మీరూ మణిపూర్‌ వెళ్లినప్పుడు ఈ Ima Marketను సందర్శించడం మాత్రం మర్చిపోకండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్