Updated : 18/01/2022 19:44 IST

అమ్మయ్యాక తిరిగొచ్చింది.. ఆ రికార్డు బద్దలుకొట్టింది!

(Photo: Instagram)

ఆడవాళ్లు తమ కెరీర్‌కి ఎంత ప్రాధాన్యమిస్తారో.. ఇంటికీ అంతకంటే ఎక్కువ సమయం వెచ్చిస్తుంటారు. ఇంటి బాధ్యతల రీత్యా అవసరమైతే కొన్నాళ్ల పాటు కెరీర్‌ బ్రేక్‌ తీసుకొని మరీ.. తిరిగి పుంజుకొని విజయాలు సాధిస్తారు. అమెరికా పరుగుల రాణి ‘కైరా డి అమతో’నే ఇందుకు తాజా ఉదాహరణ. అమ్మయ్యాక పిల్లల ఆలనా పాలన కోసం ఎనిమిదేళ్లు వెచ్చించిన ఆమె.. రెండో ఇన్నింగ్స్‌లో అనితర సాధ్యమైన రికార్డులు సాధిస్తోంది. ఇటీవలే యూఎస్‌ విమెన్స్‌ ఫీల్డ్ మారథాన్‌లో గత రికార్డును బద్దలుకొట్టి సరికొత్త చరిత్రను తన పేరిట లిఖించుకుంది. సాధించాలన్న తపన ఉంటే అమ్మతనం, వయసు.. ఇవేవీ లక్ష్యాన్ని అడ్డుకోలేవని తన విజయంతో నిరూపిస్తోన్న ఈ అమెరికన్‌ మామ్‌ మారథాన్‌ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

అమెరికాకు చెందిన 37 ఏళ్ల కైరా డి అమతోకు చిన్నతనం నుంచే పరుగంటే ప్రాణం. ఈ ఇష్టంతోనే పాఠశాలలోని ‘క్రాస్‌ కంట్రీ టీమ్‌’లో చేరిందామె.

ఆ గాయం ‘బ్రేక్‌’ వేసింది!

‘చిన్న వయసు నుంచే పరుగును ప్రేమించే నాకు క్రాస్‌ కంట్రీ టీమ్‌లో చేరాక.. అదే నా ఆరోప్రాణంగా మారిపోయింది. చిన్న చిన్న విజయాలే పెద్ద గుర్తింపును తెచ్చిపెడతాయన్నట్లు.. అంతర్‌ కళాశాల పోటీల్లో నేను సాధించిన విజయాలే నాకు జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చాయి. ఓవైపు పోటీలకు ప్రాధాన్యమిస్తూనే.. మరోవైపు చదువుకూ సమప్రాధాన్యమిచ్చాను. ఇలా కెరీర్‌ గాడిలో పడుతున్న క్రమంలోనే 2008లో చీలమండ గాయం నా కెరీర్‌కి బ్రేక్‌ వేసింది. దీనికి తోడు ఆ భాగంలో ఆపరేషన్‌ జరగడంతో నాకు నేనుగా కాస్త గ్యాప్‌ తీసుకోవాలనుకున్నా. ఈ క్రమంలో గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి నా కోసం నేను సమయం కేటాయించుకోవాలనుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది కైరా.

స్వీయ ప్రోత్సాహం పనికొచ్చింది!

ఇలా తనకోసం తాను సమయం కేటాయించుకునే క్రమంలో తన వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యమిచ్చిందామె. తనకంటూ ఓ ఫ్యామిలీ కావాలని కోరుకుంది. ఈ క్రమంలోనే తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లైంది కూడా! ఇలా ఈ ఎనిమిదేళ్ల కాలంలో పరుగును ఎంత మిస్సయ్యానో తన శరీరమే చెబుతుందంటోంది కైరా.

‘అమ్మనయ్యాక చాలా బరువు పెరిగా. దీన్ని తగ్గించుకోవడానికి మళ్లీ పరుగు సాధన ప్రారంభించా. అయితే ఈ క్రమంలో నన్ను నేను ప్రోత్సహించుకోవడానికి ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. అదే మారథాన్‌లలో పాల్గొనడం. ఈ స్వీయ ప్రోత్సాహమే ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి పరుగుపై ప్రేమ పెరిగేలా చేసింది..’ అంటోంది కైరా. ఇలా ప్రసవం తర్వాత 2016లో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఈ యూఎస్‌ మామ్‌.. మారథాన్‌ పరుగు పందేల్లో తనకు తిరుగే లేదన్నట్లుగా దూసుకుపోతోంది.

ఆ రికార్డు బ్రేకైంది!

తన రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ఇప్పటికే పలు మారథాన్‌లలో పాల్గొని సత్తా చాటిన కైరా.. తాజాగా హూస్టన్‌ మారథాన్‌లో భాగంగా ‘యూఎస్‌ మహిళల ఫీల్డ్‌ మారథాన్‌’లో విజయం సాధించింది. 42.1 కిలోమీటర్ల దూరాన్ని 2:19:12 గంటల్లో పూర్తి చేసి.. గతంలో మరో అమెరికన్‌ రన్నర్‌ డేనా కాస్టర్‌ పేరిట ఉన్న రికార్డును తిరగ రాసింది. ఆమె కంటే 30 సెకన్లు ముందే లక్ష్యాన్ని చేరుకొని ఈ ఘనత సాధించింది కైరా. ‘ఈ విజయం నేను ఊహించలేదు. ఎంతో సంతోషంగా ఉంది. మనసులో లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల ఉంటే చాలు.. వయసు, అమ్మతనం.. వంటి వ్యక్తిగత విషయాలేవీ విజయాన్ని ఆపలేవు. నన్నింతలా సపోర్ట్‌ చేసే కుటుంబం ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని!’ అంటోందీ మారథాన్‌ మామ్.

ప్రస్తుతం తన సోషల్‌ మీడియా పేజీలతో పాటు Strava అనే యాప్‌ని నిర్వహిస్తోన్న కైరా.. ఈ వేదికగా తన విజయాలు, తన ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌.. వంటి విషయాల్ని అందరితో పంచుకుంటోంది.

ఓవైపు మారథాన్‌లలో పాల్గొంటూనే.. మరోవైపు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాన్నీ కొనసాగిస్తోంది కైరా. ఇద్దరు పిల్లల అమ్మగా, గృహిణిగా కుటుంబానికీ తగిన సమయం కేటాయిస్తోంది. ఇలా ఆడవారికి ఎన్ని బాధ్యతలున్నా అన్నింటినీ సమర్థంగా నిర్వర్తించగలరని తన విజయాలతో నిరూపిస్తోన్న ఈ మారథాన్‌ మామ్‌ సక్సెస్‌ స్టోరీ నేటి మహిళలందరికీ ఆదర్శం అని చెప్పడంలో సందేహం లేదు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని