‘పరాఠా’లే ఆమె జీవితాన్ని నిలబెట్టాయి!

సమయం మనది కానప్పుడు సంయమనం పాటించాలి.. ప్రతికూలతల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని వెతుక్కోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో పరాఠాల్నే తన జీవనోపాధి మార్గంగా ఎంచుకుంది అమృత్‌సర్‌కు చెందిన వీణ అనే మహిళ. భర్త పోయి నలుగురు కూతుళ్ల ఆలనా పాలనా తనపై పడిన తరుణంలో.......

Published : 26 Feb 2022 19:21 IST

(Image for Representation)

సమయం మనది కానప్పుడు సంయమనం పాటించాలి.. ప్రతికూలతల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని వెతుక్కోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో పరాఠాల్నే తన జీవనోపాధి మార్గంగా ఎంచుకుంది అమృత్‌సర్‌కు చెందిన వీణ అనే మహిళ. భర్త పోయి నలుగురు కూతుళ్ల ఆలనా పాలనా తనపై పడిన తరుణంలో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడామెను ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మార్చింది. తన బిడ్డల భవిష్యత్తు కోసం తల్లి ఎంతైనా కష్టపడడానికి సిద్ధంగా ఉంటుందన్న విషయం మరోసారి చాటిచెప్పింది.

రెహ్రి మార్కెట్‌.. అమృత్‌సర్‌లోని పాపులర్‌ ఫుడ్‌ స్ట్రీట్‌ ఇది. ఇక్కడికి వెళ్లిన వారు జంబో పరాఠా రుచి చూడనిదే వెనక్కి మళ్లరు. ఆ పరాఠాకు అక్కడంత డిమాండ్‌ ఉంది మరి! ఇంతకీ దీన్ని తయారుచేసేదెవరో తెలుసా? వీణ అనే మహిళ. అయితే ఇప్పటిదాకా ఆమె పరాఠా రుచికి ఫిదా అయిపోయిన వాళ్లంతా ఇప్పుడు ఆమె కష్టం వెనకున్న కథ తెలుసుకొని స్ఫూర్తి పొందుతున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..!

భర్త వ్యాపారం తాను చేపట్టి..!

వీణ.. ఆమె భర్త, నలుగురు కూతుళ్లతో కలిసి అమృత్‌సర్‌లోనే నివాసముండేది. ఆమె భర్త బండి మీద పరాఠాలు తయారుచేసి అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. వీణ కూడా ఇరుగుపొరుగు ఇళ్లలో పాచి పనులు చేస్తూ కుటుంబానికి అండగా నిలిచేది. అయితే ఇలా ఉన్నంతలో జీవితం హాయిగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో వీణ భర్త మరణించారు. దీంతో కుటుంబ భారమంతా ఆమెపైనే పడింది. అసలే ఆర్థిక భారం, మరోవైపు నలుగురు కూతుళ్ల ఆలనా పాలన తనపై పడడంతో.. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కే మార్గం దిశగా ఆలోచించడం మొదలుపెట్టిందామె. ఈ క్రమంలోనే తన భర్త వ్యాపారం తాను కొనసాగించాలని నిర్ణయించుకుంది. అలా సుమారు 10 ఏళ్ల నుంచి రెహ్రి ఫుడ్‌ స్ట్రీట్‌లో పరాఠాల వ్యాపారం చేస్తోంది వీణ. అంతేకాదు.. ఆమె తయారుచేసే పరాఠాలకు అతిపెద్ద పరాఠాలన్న పేరు కూడా ఉంది. అందుకే ఇక్కడికి వచ్చిన వారంతా ఈ జంబో పరాఠాల రుచి చూడందే ఈ ఫుడ్‌ స్ట్రీట్‌ను వీడరని స్థానికులు చెబుతుంటారు.

రుచి ఎక్కువ.. ధర తక్కువ!

వీణ తయారుచేసే జంబో పరాఠాలకు రోజూ అక్కడ భలే గిరాకీ ఉంటుంది. ఎందుకంటే కేవలం రూ. 30 కే రుచికరమైన పరాఠాలు తయారుచేసి అక్కడి ఆహార ప్రియుల్ని ఆకట్టుకుంటున్నారు వీణ. ఇలా ఆమె జంబో పరాఠాలతో పాటు, కుటుంబ పోషణ కోసం ఆమె పడుతోన్న కష్టం గురించి ఓ బ్లాగర్‌ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్‌ చేశారు. ఇది వైరలవడంతో ఆమె గురించి దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. దీంతో అపర్‌శక్తి ఖురానా వంటి ప్రముఖులు కూడా కుటుంబ పోషణ కోసం ఆమె పడుతోన్న తాపత్రయాన్ని ప్రశంసిస్తున్నారు. ‘కూతుళ్ల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తల్లి ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా ఓర్చుకుంటుందం’టూ ఈ మాతృమూర్తిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మరికొంతమంది ‘మీరు ఓ రెస్టరంట్‌ ప్రారంభించి మీ వ్యాపారాన్ని విస్తరించుకోండం’టూ ఆమెకు నిధులు కూడా అందజేస్తున్నారు.

‘కూతుళ్లకు మంచి భవిష్యత్తు అందించడానికే నా భర్త వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించా. నా కృషి, దేవుడి దయ వల్లే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్ని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాం..’ అంటున్నారు వీణ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్