చెర్నోబిల్‌ గాయాల్ని తుడిచి.. జీవితాన్ని గెలిచింది!

విధిని జయించిన వారికి సవాళ్లు కొత్త కాదు.. అలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి తానెప్పుడూ సిద్ధమే అంటోంది యూఎస్‌ పారా అథ్లెట్‌ ఒక్సానా మాస్టర్స్‌. పుట్టుకతోనే పలు శారీరక లోపాలతో జన్మించిన ఆమెపై.. చెర్నోబిల్‌ దుర్ఘటన మరింత తీవ్ర ప్రభావం చూపింది.

Published : 02 Sep 2021 19:39 IST

విధిని జయించిన వారికి సవాళ్లు కొత్త కాదు.. అలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి తానెప్పుడూ సిద్ధమే అంటోంది యూఎస్‌ పారా అథ్లెట్‌ ఒక్సానా మాస్టర్స్‌. పుట్టుకతోనే పలు శారీరక లోపాలతో జన్మించిన ఆమెపై.. చెర్నోబిల్‌ దుర్ఘటన మరింత తీవ్ర ప్రభావం చూపింది. దీంతో రెండు కాళ్లను మోకాళ్ల వరకు కోల్పోయిన ఆమె.. అందరూ తనను చూసి గర్వపడాలే కానీ జాలి పడకూడదని ఆ క్షణమే నిర్ణయించుకుంది. తన ఆలోచనకు అనుగుణంగానే ఆటలపై మక్కువ పెంచుకొని ఒకటి కాదు రెండు కాదు.. నాలుగు క్రీడల్లో ఆరితేరింది. వేదికేదైనా పతకాల వేటే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం టోక్యో పారాలింపిక్స్‌లోనూ తన దూకుడు ఏమాత్రం తగ్గలేదనడానికి ఆమె సాధించిన రెండు బంగారు పతకాలే సాక్ష్యం! ఈ క్రమంలో సమ్మర్‌, వింటర్‌ పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నాలుగో అమెరికన్‌ మహిళా అథ్లెట్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకుంది ఒక్సానా. ప్రతికూలతలెదురైనా అధైర్య పడనని, ఓటమిని ఒప్పుకోనని చెప్పే ఈ యూఎస్‌ అథ్లెట్‌ స్ఫూర్తి గాథ ఇది!

ఒక్సానా మాస్టర్స్‌ 1989లో ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌లో జన్మించింది. ఆమె పుట్టడానికి మూడేళ్ల ముందు చెర్నోబిల్‌ అణు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రేడియేషన్‌ ప్రభావంతోనే పలు శారీరక లోపాలతో జన్మించిన ఆమెను తల్లిదండ్రులిద్దరూ వద్దని వదిలేశారు. ఆ తర్వాత ఏడేళ్ల వయసొచ్చేదాకా అనాథాశ్రమాల్లోనే పెరిగిన ఒక్సానాను ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ దత్తత తీసుకుంది.

రోయింగ్‌తో మొదలై..!

అయితే పెరిగి పెద్దయ్యే క్రమంలో రేడియేషన్‌ ఆమె శరీరంపై మరింత తీవ్ర ప్రభావం చూపడంతో 9వ ఏట ఎడమ కాలిని, 14 వ ఏట కుడి కాలిని మోకాళ్ల వరకు తొలగించాల్సి వచ్చింది. దీనికి తోడు రెండు చేతులకూ పలుమార్లు శస్త్రచికిత్సలు జరగడంతో శారీరకంగా మరింతగా కుంగిపోయిందామె. శరీరానికి ఎన్ని సర్జరీలు జరిగినా మానసికంగా మాత్రం దృఢంగా ఉండేది ఒక్సానా. 13 ఏళ్ల వయసులో తన పెంపుడు తల్లితో కలిసి న్యూయార్క్‌కి వెళ్లిపోయిన ఆమె.. ఆ సమయంలోనే ఆటలపై మక్కువ పెంచుకుంది. రోయింగ్‌తోనే తన క్రీడా ప్రస్థానం ప్రారంభమైందని చెబుతుందీ పారా అథ్లెట్.

‘13 ఏళ్ల వయసులో తొలిసారి నాకు రోయింగ్‌ పరిచయమైంది. నీటిలోకి వెళ్లినప్పుడు ఏదో తెలియని ఆనందానికి లోనయ్యేదాన్ని. నా గత జీవితంలోని ప్రతికూలతలన్నీ తొలగిపోయి.. ఒక్కసారిగా నాకు స్వేచ్ఛ లభించినట్లుగా అనిపించేది. ఈ ఫీలింగే నన్ను ఈ క్రీడలో మరింత ఆరితేరేలా చేసింది. నన్ను వెనక్కి నెట్టే అలల్ని సవాల్‌ చేస్తూ ముందుకు సాగిన ప్రతిసారీ నాలో ఆత్మవిశ్వాసం రెట్టించేది.. అదే నన్ను 2012 లండన్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేలా చేసింది.. ఆ వేదికగా నా రోయింగ్‌ పార్ట్‌నర్‌ రాబ్‌ జోన్స్‌తో కలిసి కాంస్య పతకం అందుకున్న ఆ క్షణం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది..’ అంటోంది ఒక్సానా.

వెన్నెముక గాయంతో..!

ఎప్పుడూ కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇష్టపడే ఈ యూఎస్‌ అథ్లెట్‌.. లండన్‌ ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తర్వాత.. స్కీయింగ్‌పై దృష్టి పెట్టింది. 14 నెలల్లో ఈ క్రీడలో పట్టు సాధించి 2014 సోచీ పారాలింపిక్స్‌కి అర్హత సాధించింది. ఇందులో భాగంగా నోర్డిక్‌ క్రాస్‌ కంట్రీ స్కీయింగ్‌, బయాథ్లాన్‌ (క్రాస్‌ కంట్రీ స్కీయింగ్‌, రైఫిల్‌ షూటింగ్‌).. ఈ రెండు విభాగాల్లో పోటీ పడి రజత, కాంస్య పతకాలతో మెరిసి మురిసింది. ఈ క్రీడల్లో పాల్గొన్న సమయంలోనే వెన్నుపూస గాయంతో విలవిల్లాడిపోయిన ఆమె.. డాక్టర్ల సలహా మేరకు తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి హ్యాండ్‌ సైక్లింగ్‌పై దృష్టి పెట్టింది. రోడ్‌ సైక్లింగ్‌ విభాగంలో 2016 రియో పారాలింపిక్స్‌లో అర్హత సాధించినా పతకం మాత్రం చేజిక్కించుకోలేకపోయిందామె. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఆమె.. 2018లో దక్షిణ కొరియా వేదికగా జరిగిన పారాలింపిక్స్‌ క్రీడల్లోకి బుల్లెట్‌లా దూసుకొచ్చింది. ఈ వేదికగా క్రాస్‌ కంట్రీ స్కీయింగ్‌ ఈవెంట్‌లో పాల్గొని పారాలింపిక్స్‌ వేదికపై తొలిసారి బంగారు పతకం ముద్దాడిందామె. ఇక బయాథ్లాన్‌ ఈవెంట్స్‌లో రెండు రజతాలు, మరో క్రాస్‌ కంట్రీ స్కీయింగ్‌ ఈవెంట్‌లో కాంస్యం దక్కించుకొని.. మొత్తంగా ఆ ఏడాది పారాలింపిక్స్‌లో నాలుగు పతకాల్ని తన ఖాతాలో వేసుకుంది.

‘బంగారు’ కొండ!

ప్రస్తుతం టోక్యో పారాలింపిక్స్‌లో రోడ్‌ సైక్లింగ్‌ క్రీడ (Women's Road Time Trial H4-5 Event)లో ఇప్పటికే ఒక స్వర్ణాన్ని ముద్దాడిన ఒక్సానా.. ఇప్పుడు అదే క్రీడలో Women's Road Race H5 Event లో రెండో పసిడిని ఒడిసిపట్టింది. దీంతో సమ్మర్‌, వింటర్‌ పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నాలుగో అమెరికన్‌ మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిందామె. అంతేకాదు.. ఈ రెండు క్రీడల్లో కలిపి మొత్తంగా పది పతకాలు కైవసం చేసుకున్న ఆమె ఖాతాలో నాలుగు స్వర్ణాలుండడం విశేషం. ఈ ఏడాది మేలో తొడ ఎముకలో ఏర్పడిన ట్యూమర్‌ను తొలగించుకోవడానికి ఆపరేషన్‌ చేయించుకున్న ఆమె.. త్వరగా దాన్నుంచి కోలుకొని పారాలింపిక్స్‌లో పాల్గొనడం, పతకాల వేట కొనసాగించడం ఆమె పట్టుదలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఓటమిని ఒప్పుకోను!

తాజాగా రోడ్‌ రేస్‌లో తొలిసారి పతకాలను చేజిక్కించుకున్న ఆమె.. ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని చెబుతోంది. ‘సవాళ్లు ఎదుర్కోవడం నాకు కొత్త కాదు.. నేను పుట్టినప్పట్నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజూ, ప్రతి క్షణం నాకు సవాలే! అందుకే నా జీవితంలో ఓ భాగమైన వాటినే నేను ప్రేమించడం నేర్చుకున్నా. టోక్యో పారాలింపిక్స్‌లో రోడ్‌ రేస్‌లో తొలిసారిగా పతకం గెలుచుకున్నా. ఈ విజయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఓడిపోయినప్పుడల్లా అసలు జీవితంలో రోడ్‌ రేస్‌లో పతకం గెలుస్తానా? అని నాపై నాకే సందేహం కలిగేది. ఈ గెలుపుతో ఆ సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. ఓడిపోవడం అంటే నాకు అస్సలు నచ్చదు. బహుశా.. నా గత పరిస్థితులే నన్నింత దృఢంగా మార్చాయేమో!’ అంటోంది ఒక్సానా.

కాఫీ అంటే పిచ్చి!

* ఆటలంటే ప్రాణం పెట్టే ఒక్సానాకు కాఫీ అంటే అమితమైన ఇష్టమట! మూగ జీవాల్ని ప్రేమించడం, ప్రపంచాన్ని చుట్టేయడం.. కూడా తనకెంతో మక్కువంటోందామె.

* చిన్నతనంలోనే కన్న తల్లిప్రేమకు దూరమై.. పెంచిన తల్లి మమకారానికి దగ్గరైన ఒక్సానా.. ఆమె నవ్వు చూడగానే తన కష్టాలన్నీ మర్చిపోతానంటోంది.

* పారాలింపిక్స్‌తో పాటు నేషనల్‌ ఛాంపియన్‌షిప్స్‌, వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌, వరల్డ్‌ కప్‌ ఈవెంట్లు.. వంటి పలు క్రీడల్లోనూ మెరిసింది ఒక్సానా. ఈ క్రమంలో ఈ నాలుగు ఈవెంట్లలో పాల్గొని పలు పతకాలు తన ఖాతాలో వేసుకుంది.

శారీరక లోపమున్నా.. తనను చూసి అందరూ గర్వపడాలే తప్ప జాలి పడకూడదని చెప్పే ఒక్సానా.. అదే రీతిలో కెరీర్‌లో దూసుకుపోతోంది. తన అద్భుత విజయాలతో తన దేశాన్నే కాదు.. యావత్‌ ప్రపంచాన్నీ పులకరింపజేస్తోంది..!

సాహో ఒక్సానా!!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్