అలా వాళ్లందరికీ అమ్మగా మారింది!

హెచ్‌ఐవీ, ఎయిడ్స్.. ఇది అంటువ్యాది కానప్పటికీ ఈ జబ్బు ఉన్నవారితో మాట్లాడడానికి కూడా వెనకాడుతుంటారు చాలామంది. ఇక అసలు ఈ వ్యాధి ఎందుకొచ్చిందో తెలియని పిల్లల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఇలాంటి పిల్లల్ని సమాజం వెలివేసి ఏకాకిగా.....

Published : 11 Apr 2022 17:11 IST

(Photos: palawi.org)

హెచ్‌ఐవీ, ఎయిడ్స్.. ఇది అంటువ్యాది కానప్పటికీ ఈ జబ్బు ఉన్నవారితో మాట్లాడడానికి కూడా వెనకాడుతుంటారు చాలామంది. ఇక అసలు ఈ వ్యాధి ఎందుకొచ్చిందో తెలియని పిల్లల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఇలాంటి పిల్లల్ని సమాజం వెలివేసి ఏకాకిగా మార్చిన సంఘటనలెన్నో. మహారాష్ట్రకు చెందిన మంగల్‌ అరుణ్‌ షాకు కూడా ఇలాంటి ఇద్దరమ్మాయిలు ఎదురయ్యారు. కానీ ఆమె అందరిలాగా వారిని వదిలేయలేదు. అక్కున చేర్చుకుంది. తనే సొంతంగా ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఇలాంటి చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తోంది. అలా ఇప్పుడు ఆమె 100 పైగా చిన్నారులకు తల్లైంది. ఆ కథేంటో తెలుసుకుందాం రండి...

సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంలో మంగల్‌షా ఎప్పుడూ ముందుంటారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తనవంతు సహాయం చేస్తుంటారు. ఆమె వయసు 69 ఏళ్లు. ఈ వయసులోనూ ఆమె తన సేవాకార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇదే అలవాటు తన కూతురు డింపుల్‌ గాడ్గేకి కూడా వచ్చిందంటారు ఆమె. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే మహిళా రోగులకు వీళ్లిద్దరూ తమవంతు సహాయం అందించేవారు. ఈ క్రమంలో అక్కడ హెచ్‌ఐవీకి గురైన సెక్స్‌ వర్కర్స్‌ పడుతున్న ఇబ్బందులను దగ్గర నుంచి గమనించారు. మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతంలో ఇలాంటి మహిళలు చాలామంది ఉన్నారని తెలుసుకున్నారు. దాంతో ఇద్దరూ కలిసి సెక్స్‌ వర్కర్స్‌కి హెచ్‌ఐవీ/ఎయిడ్స్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారికి ఎదురైన ఓ సంఘటన వారి సేవా ప్రస్థానంలో కొత్త మార్పు తీసుకొచ్చింది.

అలాంటి వారి కోసం..

ఈ సంఘటన 2001లో జరిగింది. మంగల్‌షా పండరపుర్‌ ప్రాంతంలో సెక్స్‌వర్కర్స్‌కి సంబంధించిన అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుండగా దగ్గర్లోని గ్రామంలో ఇద్దరు అమ్మాయిలను పశువుల కొట్టం దగ్గర వదిలేసినట్టుగా వారికి సమాచారం వచ్చింది. వారు హెచ్‌ఐవీ బాధితులు. వారి తల్లిదండ్రులు ఎయిడ్స్‌తో చనిపోయారు. దాంతో ఆ అమ్మాయిలకు సహాయం అందించడానికి కుటుంబ సభ్యులతో పాటు, ఆ గ్రామంలో ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో ఒళ్లంతా గాయాలతో వారు ఎంతో దీన స్థితిలో ఉన్నారు. మంగల్‌షా వారిని వెంటనే దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఎయిడ్స్‌ ఉన్న పిల్లలకు చికిత్స చేయడానికి మార్గదర్శకాలు లేవనే కారణంతో వారిని ఆసుపత్రిలో చేర్చుకోలేదు. ఆ అమ్మాయిల ఆరోగ్య పరిస్థితి చూసిన డాక్టర్లు వారు ఎక్కువ రోజులు బతకరని చెప్పారట. ఆ తర్వాత పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఇదే సమాధానం ఎదురైంది. దాంతో ఇలాంటి పిల్లలకు తనే సొంతంగా సాయం చేయాలనుకున్నారు. అనుకుందే తడవుగా 2001లో అదే ప్రాంతంలో పాలావి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు.

2 నుంచి 125..

అలా మంగల్‌షా ఆ ఇద్దరమ్మయిలతో సేవా సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సేవా సంస్థ ద్వారా హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు వసతి కల్పిస్తూ వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. వారికి విద్య, వైద్యం అందించడమే కాకుండా తల్లిదండ్రులు లేని లోటును కూడా తీరుస్తున్నారు. వారికి స్వీయ సంరక్షణ విద్యలను నేర్పించడం, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం వంటివి చేస్తున్నారు. ఈ ట్రస్ట్‌లో ఆశ్రయం పొందిన తొమ్మిది మంది విద్యార్థులు ఇప్పుడు స్వతంత్రంగా జీవించే స్థాయికి ఎదిగారు. కొంతమందికి వివాహాలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఈ ట్రస్ట్‌లో 125 మందికి పైగా చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. మంగల్‌షా సేవలను గుర్తించిన వివిధ సంస్థలు ఆమెకు పలు అవార్డులను కూడా అందించాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్