ఆర్థ్రైటిస్.. అయినా సరే అంటార్కిటికా యాత్ర పూర్తి చేసింది!

వృత్తి-ప్రవృత్తుల్లో సత్తా చాటే కొంతమంది మహిళలు.. తమ అరుదైన సాహసాలతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంటారు. చరిత్రలో తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు. బెంగళూరుకు చెందిన అటవీ శాఖ అధికారిణి దీప్‌ జె కాంట్రాక్టర్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. భావి తరాల్లో పర్యావరణ స్పృహ పెంచే.....

Published : 19 Apr 2022 18:28 IST

(Photo: Twitter)

వృత్తి-ప్రవృత్తుల్లో సత్తా చాటే కొంతమంది మహిళలు.. తమ అరుదైన సాహసాలతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంటారు. చరిత్రలో తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు. బెంగళూరుకు చెందిన అటవీ శాఖ అధికారిణి దీప్‌ జె కాంట్రాక్టర్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. భావి తరాల్లో పర్యావరణ స్పృహ పెంచే ఓ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అంటార్కిటికా యాత్రలో భాగమైందామె. ఎంతో కఠోర పరిశ్రమ చేసి.. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ మంచు ఖండాన్ని దాటింది. తద్వారా అంటార్కిటికా యాత్ర పూర్తి చేసిన తొలి మహిళా ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌గా, మొత్తమ్మీద మూడో ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌గా తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది దీప్‌. మహిళలు తలచుకుంటే అసాధ్యమనేదే ఉండదంటోన్న ఈ లేడీ షేర్నీ సాహస యాత్ర గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..!

అసలేంటీ యాత్ర?!

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రకృతిని సంరక్షించుకోవడం మన కర్తవ్యం. ఈ క్రమంలో సహజసిద్ధమైన వనరుల్నీ కాపాడుకోవాల్సి ఉంటుంది. అందులో మంచు ఖండం అంటార్కిటికా కూడా ఒకటి. మానవ తప్పిదాలు, స్వార్థం వల్ల ఈ మంచు ఖండం అంతరించి పోకుండా ఉండాలంటే.. ముందు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తీసుకోవాల్సిన చర్యలపై అందరిలో అవగాహన పెంచేందుకు యూకేకు చెందిన పర్యావరణ ప్రేమికుడు, రచయిత కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే.. ‘2041 పర్యావరణ దళ అంటార్కిటికా యాత్ర’ను ప్రారంభించారాయన. ఇందులో మన దేశం తరఫున పాల్గొన్న వారిలో బెంగళూరుకు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి దీప్‌ జె కాంట్రాక్టర్‌ ఒకరు. తద్వారా ఈ యాత్రలో భాగమైన తొలి మహిళా ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్‌గా, మొత్తమ్మీద మూడో ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌గా నిలిచారామె.

భర్త ప్రోత్సాహంతో..!

కర్ణాటక క్యాడర్‌కు చెందిన 2011 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి దీప్‌. వృత్తిని ఎంతగానో ప్రేమించే ఆమెకు సాహసాలన్నా మక్కువే. ఈ క్రమంలోనే ఈ యాత్రకు దరఖాస్తు చేసుకున్న ఆమె.. ఇటీవలే ఈ యాత్రను ముగించుకొని స్వదేశం చేరుకుంది. మహిళనన్న వివక్ష తనను వెనక్కి లాగడానికి ప్రయత్నించినా.. తాను మాత్రం తన భర్త ప్రోత్సాహంతో లక్ష్యాన్ని చేరుకున్నానంటున్నారు దీప్.

‘గతంలో ఈ యాత్రలో పాల్గొన్న ఐఏఎస్‌ అధికారిణి చారులతా సోమల్‌ స్ఫూర్తితోనే నేను ఈ యాత్రకు దరఖాస్తు చేసుకున్నా. అయితే మహిళలు ఎప్పుడూ కంఫర్ట్‌ జోన్‌లో, ఒకరి నీడలోనే ఉండాలనుకుంటారు చాలామంది. నేను అంటార్కిటికా యాత్రకు ఎంపికయ్యాక చాలామంది ఇలాగే స్పందించారు. మీ ఆయన్ని వెంట తీసుకెళ్లొచ్చుగా? అన్నవారూ లేకపోలేదు. అయితే మావారు మాత్రం ఇందుకు ససేమిరా అన్నారు. ‘భర్త, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడం కంటే ఒంటరిగా (తెలియని బృంద సభ్యులతో కలిసి) ఇలాంటి యాత్రలు చేస్తే ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవచ్చం’టూ నన్ను ప్రోత్సహించారు. ఇదే యాత్రను  విజయవంతంగా పూర్తి చేసే ధైర్యాన్ని నాకు అందించింది..’ అంటారు దీప్.

ఆర్థ్రైటిస్‌.. ఆపై అపెండిసైటిస్..!

మంచు ఖండాన్ని చుట్టడమంటే ఏదో నాలుగు కిలోమీటర్లు నడిచినంత సులభం కాదు.. అక్కడి వాతావరణ పరిస్థితులు, అనుకోకుండా వచ్చే సవాళ్లను అధిగమించగలగాలి.. ఇందుకు ముందు నుంచే సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ‘సాహస యాత్రంటే శారీరకంగా, మానసికంగా అన్నింటికీ సిద్ధపడాలి. ఇందుకోసం వ్యాయామం, ఇతర కసరత్తులు చేయాల్సి ఉంటుంది. అయితే వ్యాయామాలు చేసే క్రమంలో నన్ను ఆర్థ్రైటిస్‌ సమస్య వేధించింది. దానికోసం మందులు వాడుతూనే ఫిజియోథెరపీ తీసుకున్నా. అదే సమయంలో అపెండిసైటిస్‌ సమస్యతో మరో రెండు నెలల పాటు సాధనకు దూరమవ్వాల్సి వచ్చింది. ఇక విరామం తర్వాత మరింత కఠోర పరిశ్రమ చేశా. వీటితో పాటు మనం వెంట తీసుకెళ్లే బరువుతో మంచులో నడవగలిగేలా శిక్షణ తీసుకున్నా.. ఇది శారీరకంగానే కాదు.. మానసికంగానూ నన్ను దృఢంగా మార్చింది..’ అంటూ తన సాధన గురించి ఓ సందర్భంలో పంచుకున్నారు దీప్.

అడుగడుగునా అనుభూతులే!

ఈ ఏడాది నిర్వహించిన ఈ యాత్రలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల నుంచి 170 మంది ఇందులో పాలుపంచుకున్నారు. ఇలా ఓవైపు సాహస యాత్ర చేయడం, మరోవైపు వివిధ దేశాల వారి ఆలోచనలు తెలుసుకోవడం ఓ మధురానుభూతి అంటున్నారు దీప్.

‘ఒకటా, రెండా.. ఈ యాత్ర నాకు మిగిల్చిన మధురానుభూతుల గురించి ఓ పుస్తకమే రాయచ్చనిపిస్తోంది. ఓవైపు చలికి తట్టుకుంటూ, శీతల పవనాలకు ఎదురీదుతూ ముందుకు సాగాం. మరోవైపు నీటిపై తేలియాడే మంచు కొండలు, ఎటు చూసినా మంచు దుప్పటి కప్పుకున్న పరిసరాలు, గడ్డ కట్టుకుపోయిన ఉపరితలాలు, సముద్ర జీవుల అందాలు.. ఇవన్నీ నాకు మరపురాని మధురానుభూతులే! ఇక మరోవైపు ఈ యాత్రలో భాగమైన విదేశీయుల ఆలోచనలు తెలుసుకోవడం, పర్యావరణ పరిరక్షణ దిశగా వాళ్ల దగ్గర్నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం, నా ఆలోచనల్ని వారితో పంచుకోవడం కొత్తగా అనిపించింది..’ అంటూ తన ప్రయాణం గురించి పంచుకున్నారు దీప్.

ఈ ఒక్క యాత్రతో తనివి తీరలేదంటోన్న ఈ లేడీ షేర్నీ.. భవిష్యత్తులో ఇలాంటి మరో సాహస యాత్రలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నానంటున్నారు. మహిళలు తలచుకుంటే అసాధ్యమనేది ఏదీ ఉండదంటూ తన మాటలతో స్ఫూర్తి నింపుతోన్న ఈ లేడీ ఆఫీసర్‌.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని కోరుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్