సముద్ర ఇంధన వనరుల గుట్టు విప్పాలని..!

తెలియని విషయాలు తెలుసుకోవడమంటే ఎవరికైనా ఆసక్తే! అయితే ఈ విషయంలో కొంతమంది ఓ అడుగు ముందుకేసి ఆయా అంశాలపై పరిశోధనలు సాగిస్తుంటారు. తమ ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ  స్థాయుల్లో చేపట్టే పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో చోటు దక్కించుకుంటుంటారు.

Published : 15 Jan 2022 15:32 IST

(Photo: Twitter)

తెలియని విషయాలు తెలుసుకోవడమంటే ఎవరికైనా ఆసక్తే! అయితే ఈ విషయంలో కొంతమంది ఓ అడుగు ముందుకేసి ఆయా అంశాలపై పరిశోధనలు సాగిస్తుంటారు. తమ ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ  స్థాయుల్లో చేపట్టే పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో చోటు దక్కించుకుంటుంటారు. అలాంటి అరుదైన అవకాశమే అందుకున్నారు డాక్టర్‌ కోమల్‌ వర్మ. ప్రస్తుతం బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, పరిశోధకురాలిగా కొనసాగుతోన్న ఆమె.. సముద్ర ఇంధన వనరులపై పరిశోధనలు జరిపే ‘అంతర్జాతీయ మహాసముద్ర ఆవిష్కరణ కార్యక్రమా’నికి తాజాగా ఎంపికయ్యారు. మరి, ఈ యాత్రలో భాగంగా ఆమె ఏం చేయనున్నారో తెలుసుకుందాం రండి..

డాక్టర్‌ కోమల్‌ వర్మకు పరిశోధనలంటే చిన్న వయసు నుంచే ఆసక్తి. భూమి పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకోవాలన్న తపనే ఆమెను భూగర్భ శాస్త్రంలో ఎమ్మెస్సీ చేసేలా ప్రేరేపించిందని చెప్పచ్చు. 2015లో బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్న ఆమె.. 2017 నుంచి అదే యూనివర్సిటీలో భూగర్భశాస్త్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, పరిశోధకురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఆ యాత్రలో భాగమై..!

అంతర్జాతీయ మహాసముద్ర ఆవిష్కరణ కార్యక్రమం.. సముద్ర గర్భంలోని ఇంధన వనరుల సామర్థ్యాన్ని పరిశోధించే లక్ష్యంతో చేపడుతున్న యాత్ర ఇది. ఈ ఏడాది అక్టోబర్‌-డిసెంబర్ మధ్య అట్లాంటిక్‌ మహా సముద్రంలో చేపట్టబోయే ఈ యాత్రకు మన దేశం తరఫున ఎంపికయ్యారు కోమల్. 

ఇక ఈ పరిశోధన యాత్ర కోసం యూకే, యూఎస్‌ఏ, జర్మనీ, జపాన్‌, చైనా.. ఇలా 17 దేశాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొనబోతున్నారు. సూక్ష్మ శిలాజాలపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తగా ఈ యాత్రలో భాగం కానున్న కోమల్.. సముద్ర ఇంధన వనరుల సామర్థ్యాన్ని పరిశీలించడం దిశగా ఈ బృందంతో కలిసి పరిశోధనలు సాగించనున్నారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో కోమల్‌ భాగమవడం వల్ల సముద్ర శాస్త్రంలో అధునాతన పరిశోధన, బోధనకు అపూర్వమైన అవకాశం లభిస్తుందంటూ ఆమె ఎంపికను కొనియాడింది బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం.

ఎన్నెన్నో బాధ్యతలు!

* ఇలా BHUలో ఓవైపు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, శాస్త్రవేత్తగా బిజీగా ఉంటూనే.. మరోవైపు ఆ యూనివర్సిటీకి చెందిన వివిధ కమిటీల్లోనూ సభ్యురాలిగానూ కొనసాగుతున్నారు కోమల్. అలాగే వృత్తిపరమైన బాధ్యతల్లో భాగంగా.. వివిధ ప్రతిష్టాత్మక సంస్థల్లో సభ్యురాలిగా కూడా  వ్యవహరిస్తున్నారు కోమల్.

* ప్రస్తుతం ఉత్తర హిందూ మహా సముద్రంలో శిలాజ జీవుల వర్గీకరణపై పరిశోధనలు సాగిస్తోన్న కోమల్‌.. తన కెరీర్‌లో వివిధ పరిశోధనలకు గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులు, ఫెలోషిప్‌లు అందుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్