అప్పుడు ఒక్క అమ్మాయి కూడా లేదు..!

బిహార్‌లోని ‘రాంతి’ ప్రభుత్వ పాఠశాల...15 ఏళ్ల క్రితం వరకు ఈ స్కూల్‌లో ఒక్క అమ్మాయి కూడా కనిపించేది కాదు. కానీ కొన్నేళ్లుగా అక్కడ చదువుకోవడానికి బాలికలు ‘క్యూ’ కడుతున్నారు. ఇప్పుడు మొత్తం 900 మంది విద్యార్థులుంటే అందులో 60 శాతం (540) అమ్మాయిలే.

Published : 21 Aug 2021 18:35 IST

(Photo: Facebook)

బిహార్‌లోని ‘రాంతి’ ప్రభుత్వ పాఠశాల...15 ఏళ్ల క్రితం వరకు ఈ స్కూల్‌లో ఒక్క అమ్మాయి కూడా కనిపించేది కాదు. కానీ కొన్నేళ్లుగా అక్కడ చదువుకోవడానికి బాలికలు ‘క్యూ’ కడుతున్నారు. ఇప్పుడు మొత్తం 900 మంది విద్యార్థులుంటే అందులో 60 శాతం (540) అమ్మాయిలే. ఇందుకు ప్రధాన కారణం ఆ స్కూల్ ఇంగ్లిష్‌ టీచరమ్మ చందనా దత్‌. ఇలా బాలికా విద్య కోసం విశేషంగా పాటుపడిన ఆమె కృషిని తాజాగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారానికి ఎంపిక చేసింది.

బాలికా విద్య కోసం!

2021 సంవత్సరానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ ఇటీవల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులకు ఈ అవార్డులు దక్కాయి. అందులో బిహార్‌లోని మధుబని జిల్లా రాంతి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు 47 ఏళ్ల చందనా దత్‌ కూడా ఉంది. బాలికల విద్య కోసం ఎంతో పాటుపడిన ఆమె సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోనుంది. అవార్డు కింద మెడల్‌, సర్టిఫికెట్‌తో పాటు 50 వేల రూపాయల నగదును కూడా అందుకోనుందీ టీచరమ్మ.

ఒక్క అమ్మాయి కూడా లేదు!

చందనా దత్‌కు బోధనా రంగంలో 17 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. 2005 నుంచి ఆమె రాంతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే ఆమె మొదటిసారి పాఠశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఒక్క బాలిక కూడా కనిపించలేదట. 
‘2005లో ఇంగ్లిష్‌ టీచర్‌గా వెళ్లినప్పుడు పాఠశాలలో ఒక్క అమ్మాయి కూడా కనిపించలేదు. నాకు ఆశ్చర్యమేసింది. ‘మీ అక్కాచెల్లెళ్లు ఎందుకు స్కూల్‌కు రావడం లేదు’ అని తరగతిలోని అబ్బాయిల్ని అడిగాను. ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత పాఠశాల సిబ్బంది, ఇతరులను అడిగి అసలు విషయం తెలుసుకున్నాను. అక్కడి ప్రజల పేదరికం, నిరక్షరాస్యతే వీటికి ప్రధాన కారణాలని అర్థమైంది. తమ కూతుళ్లను పాఠశాలకు పంపేలా వారిలో మార్పు తెద్దామనుకున్నాను. ఇందులో భాగంగా స్కూల్‌కు వెళ్లే ముందు, స్కూల్‌ అయిపోయిన తర్వాత ఇంటింటికీ వెళ్లి అమ్మాయిలను చదివించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించాను. బాలికల రక్షణతో పాటు వారి బాధ్యతలన్నీ నేనే తీసుకుంటానని హామీ ఇచ్చాను. దీంతో తల్లిదండ్రులు నెమ్మదిగా తమ అమ్మాయిలను పాఠశాలకు పంపించడం మొదలుపెట్టారు. క్రమంగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతేడాదే మా పాఠశాల హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ అయ్యింది. ప్రస్తుతం మా పాఠశాలలో మొత్తం 900 మంది విద్యార్థులు ఉంటే అందులో 60 శాతం మంది అమ్మాయిలే ఉండడం విశేషం’ అని చెప్పుకొచ్చిందీ టీచరమ్మ.

రచయిత్రిగానూ!

చందన తండ్రి పేరు నిత్యానంద్‌ లాల్‌ దాస్‌. ఓ కాలేజీలో ఇంగ్లిష్‌ విభాగాధిపతిగా పనిచేసి ఉద్యోగ విరమణ తీసుకున్న ఆయన గతంలో సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు. ఇక మైథిలీ భాషలో (ఇండో-ఆర్యన్‌ లాంగ్వేజ్‌) పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ పట్టా అందుకున్న చందనకు రచయిత్రిగా ఎంతో అనుభవం ఉంది. ఆమె రాసిన కథలు, ఆర్టికల్స్‌ వివిధ పత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. వివిధ పద్యాలు, కథల సమాహారంతో మైథిలీ భాషలో ఆమె రాసిన ‘గంగా స్నాన్‌’ పుస్తకం మంచి ప్రాచుర్యం పొందింది. ‘మిథిలా పెయింటింగ్‌ (మధుబని చిత్రకళ)లోనూ ప్రావీణ్యమున్న ఈ టీచరమ్మ తన విద్యార్థులకు కూడా ఈ కళను నేర్పిస్తోంది. ఇలా టీచర్‌గా, రచయిత్రిగా సేవలు అందిస్తోన్న ఆమె గతంలో రాధాకృష్ణన్‌ పురస్కారంతో పాటు పలు అవార్డులు అందుకుంది. తాజాగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి కూడా ఎంపికైంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్