ఆరుణం తీర్చుకోవాలని..

ఐదేళ్ల వయసు.. అప్పటికి పెద్దగా ఊహ కూడా తెలియదు. నాన్న తీసుకెళ్లి కరాటే క్లాసులో చేర్చాడు. సత్తా చాటుకుంది. తర్వాత నాన్న కరాటె కాదు.. జిమ్నాస్టిక్స్‌ అన్నాడు. నాన్న మాటే వేదం. చెప్పినట్లే ఆట మార్చుకుంది. అందులోనూ ప్రతిభ చాటుకుంది. సాధన కోసం స్టేడియానికి తీసుకెళ్లేది నాన్నే. అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చేది నాన్నే. పాఠశాలకు వెళ్లాలన్నా... తిరిగి ఇంటికి రావాలన్నా నాన్నే...

Updated : 08 Dec 2022 20:13 IST

ఐదేళ్ల వయసు.. అప్పటికి పెద్దగా ఊహ కూడా తెలియదు. నాన్న తీసుకెళ్లి కరాటే క్లాసులో చేర్చాడు. సత్తా చాటుకుంది. తర్వాత నాన్న కరాటె కాదు.. జిమ్నాస్టిక్స్‌ అన్నాడు. నాన్న మాటే వేదం. చెప్పినట్లే ఆట మార్చుకుంది. అందులోనూ ప్రతిభ చాటుకుంది. సాధన కోసం స్టేడియానికి తీసుకెళ్లేది నాన్నే. అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చేది నాన్నే. పాఠశాలకు వెళ్లాలన్నా... తిరిగి ఇంటికి రావాలన్నా నాన్నే.
వయసు పెరిగింది. ఆట మెరుగైంది. అప్పుడు కూడా ఎక్కడ పోటీ జరిగినా వెంట నాన్నే ఉండాలి. ఆయనే నడిపించాలి. ఇలా అన్నీ తానై వ్యవహరించిన ఆయన హఠాత్తుగా కన్ను మూశాడు.
ఎప్పుడూ తన వెంటే ఉండి నడిపించే తోడు లేదు. ధైర్యం సడలింది. భవిష్యత్తు భయంకరంగా కనిపించింది. అలాంటపుడు 14 ఏళ్ల అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పేదేముంది..?
కానీ అంత కష్టంలోనూ ఆ అమ్మాయి పట్టు వదల్లేదు. ఆటను విడవలేదు. నాన్న కలను నెరవేర్చడమే ధ్యేయంగా సాగింది. ఏళ్ల తరబడి కష్టపడింది. ఇప్పుడు భారత జిమ్నాస్టిక్స్‌ చరిత్రలోనే ఎవ్వరూ సాధించని ఘనతను అందుకుంది.  ప్రపంచకప్‌లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా నిలిచింది. తన విజయాన్ని తండ్రికి అంకితం చేసింది. ఇదీ బుడ్డా అరుణారెడ్డి విజయగాథ!
నంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన అరుణ కుటుంబం దాదాపు మూడు దశాబ్దాల కిందటే హైదరాబాద్‌లో స్థిరపడింది. తండ్రి నారాయణరెడ్డి వృత్తి రీత్యా అకౌంటెంట్‌. ఆయనకు క్రీడలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే తన చిన్న కూతురు అరుణను ఐదేళ్ల వయసులోనే కరాటేలో చేర్చాడు. అందులో ప్రతిభ చాటుకున్న ఆమె రెండేళ్ల లోపే బ్లాక్‌బెల్ట్‌ సాధించింది. అయితే అరుణ శరీరం జిమ్నాస్టిక్స్‌కు సరిపోతుందన్న సలహా మేరకు తర్వాత అందులో చేర్చాడు తండ్రి. నిజానికి మొదట్లో జిమ్నాస్టిక్స్‌ అంటే అంత ఆసక్తి లేకున్నా తండ్రి మాట ప్రకారం అందులోనే సాధన చేసిందామె. కొంత కాలానికే అందులోనూ సత్తా చాటుకుంది. కొంచెం వయసు పెరిగే కొద్దీ ఈ ఆటపై ఆసక్తి పెరిగింది. పదేళ్ల వయసులోనే జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుకుంది. 12 ఏళ్ల వయసులో 2007 జాతీయ క్రీడల్లో వాల్ట్‌ విభాగంలో పతకం కూడా గెలిచింది. తన కూతురు ప్రపంచ స్థాయి క్రీడాకారిణి కాగలదని నారాయణరెడ్డికి నమ్మకం కుదిరింది అప్పుడే. ఆ తర్వాత పలు జాతీయ టోర్నీల్లో సత్తా చాటుకుందామె.
కారు నుంచి బస్సుకు..
2010.. అరుణ జీవితం పెద్ద కుదుపునకు లోనైన సంవత్సరం. ఆమె తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన ఉన్నపుడు కారుండేది. దానికి డ్రైవర్‌ ఉండేవాడు. తెల్లవారుజామునే అరుణను నిద్ర లేపి ఇంటి నుంచి ఎల్బీ స్టేడియంకు తీసుకెళ్లడం, సాధన అయ్యాక ఇంటికి తీసుకురావడం.. ఆపై పాఠశాలలో దింపి తన పనులు చూసుకోవడం.. మళ్లీ సాయంత్రం ఇంటికి తీసుకురావడం.. ఇదీ నారాయణరెడ్డి దినచర్య. అరుణ ఎక్కడ టోర్నీకి వెళ్లినా వెంట ఆయనుండేవాడు. ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేవాడు. కానీ నారాయణరెడ్డి మరణానంతరం పరిస్థితి తల్లకిందులైంది. ఆయన చికిత్సకు చాలా ఖర్చయింది. తల్లి గృహిణి. బయటి ప్రపంచం తెలియదు. సోదరికి అప్పటికే పెళ్లయింది. నారాయణరెడ్డి మరణంతో ఆదాయం ఆగిపోయింది. బీమా ద్వారా వచ్చిన డబ్బులతో ఇంటి అవసరాలైతే తీరాయి కానీ.. అరుణ ఆటలో కొనసాగడానికి అవసరమైన ఖర్చులు భరించడమే కష్టమైంది. ఆర్థిక ఇబ్బందులకు తోడు తనకు అన్నీ తానై వ్యవహరించే తండ్రి లేని బాధ ఆమెను కుంగదీసింది. దీంతో జిమ్నాస్టిక్స్‌ వదిలేద్దామన్న ఆలోచన వచ్చింది. కానీ ఆ సమయంలో తల్లి, అక్కా, బావ, కోచ్‌ బ్రిజ్‌ కిషోర్‌ ఆమెకు అండగా నిలిచారు. ధైర్యం నింపారు. తాను ప్రపంచ స్థాయి జిమ్నాస్ట్‌ కావాలని తండ్రి కన్న కలను నెరవేర్చి ఆయన రుణం తీర్చుకోవాలనుకుంది. దీంతో ఎన్ని ఇబ్బందులొచ్చినా ఆటలో కొనసాగాలనే నిర్ణయానికి వచ్చింది. తండ్రి చనిపోయాక కారు అమ్మేశారు. అప్పట్నుంచి సిటీ బస్సుల్లోనే ప్రయాణం. అంతకుముందు కార్లో ఏ కష్టం లేకుండా 20 నిమిషాల్లో స్టేడియానికి వెళ్లేది. కానీ తర్వాత బస్సు కోసం ఎదురు చూడటం.. కిక్కిరిసిన జనాల మధ్య ప్రయాణించడం.. ప్రయాణానికే చాలా సమయం అయిపోవడం.. లాంటి ఇబ్బందులు తప్పలేదు. ఓవైపు సాధన, మరోవైపు చదువు.. ఇంకా టోర్నీలు, గాయాలు, చికిత్సలు.. అప్పుడప్పుడూ కొన్ని వైఫల్యాలు.. ఇన్ని అడ్డంకుల మధ్య తన ప్రయాణాన్ని కొనసాగించింది అరుణ. టోర్నీల్లో ప్రదర్శన ద్వారా వచ్చే ప్రైజ్‌మనీలు, ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహకాలతోనే గత ఎనిమిదేళ్లుగా నెట్టుకొస్తున్న ఆమె.. తల్లికి ఏనాడూ భారం కాలేదు.


ఆశల్లేని స్థితి నుంచి..
ఎంత కృషి, పట్టుదల ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రభావంతో ఏదో ఒక దశలో నైరాశ్యం అలుముకోవడం సహజం. గత ఏడాది అరుణ కూడా అదే స్థితికి చేరింది. ఆటలో కొనసాగడంపై సందిగ్ధంలో పడింది. ప్రాక్టీస్‌లో ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల తన ప్రదర్శన ఒక స్థాయికి మించి మెరుగవకపోవడంతో ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బ తింది.  ఏడాదిలో ఓ మూణ్నాలుగు నెలలు జాతీయ శిబిరంలో పాల్గొనేది. అక్కడ కోచింగ్‌ పద్ధతులు కొంచెం భిన్నం. సౌకర్యాలు మెరుగ్గా ఉండేవి. హైదరాబాద్‌ వస్తే ఇక్కడ ఆ స్థాయి మౌలిక వసతులు ఉండేవి కావు. ఇక్కడ తన దీర్ఘకాలిక కోచ్‌ బ్రిజ్‌ కిషోర్‌ శ్రద్ధతో ఆమెకు శిక్షణ ఇచ్చినా.. సౌకర్యాల లేమి వల్ల అరుణ లయ దెబ్బ తినేది. దీంతో అంతర్జాతీయ పోటీల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. తన ప్రదర్శన తర్వాతి దశకు వెళ్లలేకపోతుండటం, దీనికి తోడు గాయాల బాధతో ఇక ఆట నుంచి తప్పుకుందామా అన్న ఆలోచన వచ్చిందామెకు. ఆట వదిలేసి సీఏ చేద్దామా అని ఆలోచించింది. అయితే ఆ సమయంలోనే కుటుంబ సభ్యులు, కోచ్‌ మరోసారి ఆమెలో ధైర్యం నింపారు. ఇంకో రెండేళ్లు ప్రయత్నించి చూడమని.. లేదంటే చదువుకోవచ్చని చెప్పారు. ఆ సమయంలోనే అరుణ ‘టాప్‌’ పథకానికి ఎంపికైంది. కొన్ని నెలల కిందటే ఉజ్బెకిస్థాన్‌లో శిక్షణకు వెళ్లే అవకాశం దక్కించుకుంది. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు అందకపోయినప్పటికీ చాముండీశ్వరీనాథ్‌ సకాలంలో స్పాన్సర్‌ను సమకూర్చి ఆర్థిక సాయం అందేలా చూడటంతో ఆమె అక్కడికి వెళ్లగలిగింది. అక్కడి శిక్షణే అరుణ కెరీర్‌ను మలుపు తిప్పింది. అంతర్జాతీయ ప్రమాణాలతో సాగిన శిక్షణ ప్రదర్శనను మెరుగుపరిచింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ శిక్షణ పూర్తయ్యాక పాల్గొన్న తొలి టోర్నీ జిమ్నాస్టిక్స్‌ ప్రపంచకప్‌. అందులో వాల్ట్‌ విభాగంలో కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించింది అరుణ.

అసలు టోర్నీకే వెళ్లాల్సింది కాదు..

 ప్రపంచకప్‌లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా నిలిచిన అరుణ.. ఒక దశలో ఈ టోర్నీకి వెళ్లడమే అనుమానంగా మారింది. రెండేళ్ల కిందట ఆమె భుజానికి గాయమైంది. అది కెరీర్‌నే ప్రమాదంలో పడేసేలా కనిపించింది. దిల్లీలో ఆమెను పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స అవసరమన్నారు. అది చేయించుకుంటే వెంటనే కోలుకోవడం, ఒకప్పట్లా విన్యాసాలు చేయడం కష్టమయ్యేది. ఈ ఏడాది ప్రపంచకప్‌కూ దూరం కావాల్సి వచ్చేది. అయితే హైదరాబాద్‌లో తెలిసిన వైద్యుల దగ్గర చూపించి.. మందులు, ఫిజియోథెరపీతోనే కోలుకుంది అరుణ. ఇక గత నెలలో దిల్లీలో కామన్వెల్త్‌ క్రీడల ట్రయల్స్‌లో పాల్గొన్నాక ప్రపంచకప్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంది కానీ.. ఆస్ట్రేలియా వీసా కోసం 20 రోజుల ముందు దరఖాస్తు చేయాల్సి ఉండగా.. అధికారులు ప్రయాణానికి ఐదు రోజుల ముందే దరఖాస్తు పంపారు. దీంతో వీసా కష్టమే అని భావించి దిల్లీ నుంచి హైద]రాబాద్‌ వచ్చేయడానికి సిద్ధమైందామె. ఐతే అధికారులు తర్వాత అప్రమత్తమై దౌత్య అధికారులకు మాట్లాడి, ప్రత్యేక పరిస్థితుల కింద వీసా ఇప్పించారు. గత నెల 20న సాయంత్రం ప్రయాణమైతే.. ఉదయానికి కానీ వీసా రాలేదు. ఆ రోజు గడిస్తే అరుణ ఆస్ట్రేలియాకు వెళ్లేది కాదు. ప్రపంచకప్‌ పతకం గెలిచేదీ కాదు.

న్ను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా చూడాలన్నది నాన్న కల. ఆయన చనిపోయాక ఆట వదిలేద్దామనిపించింది. కానీ ఆయన కోసమే ఆటలో కొనసాగాను. ఎప్పటికైనా ఓ అంతర్జాతీయ టోర్నీలో నేను పోడియం మీద ఉండగా భారత పతాకం  ఎగరాలని లక్ష్యంగా పెట్టుకున్నా. రియో ఒలింపిక్స్‌తో దేశం దృష్టిని ఆకర్షించిన దీప జాతీయ శిబిరాల్లో నా రూమ్‌ మేట్‌. ఐదేళ్లుగా కలిసి సాధన చేస్తున్నాం. 2014 కామన్వెల్త్‌ క్రీడల్లో దీప పతకం గెలిచినపుడు సంతోషించా. కానీ నా వైఫల్యం బాధ పెట్టింది. అయితే దీపకు స్థానికంగా అయినా, జాతీయ శిబిరంలో అయినా ఒకరే కోచ్‌. సౌకర్యాలు కూడా ఒకేలా ఉంటాయి. నా పరిస్థితి భిన్నం. జాతీయ శిబిరంలో పాల్గొన్నపుడు ప్రదర్శన మెరుగయ్యేది. హైదరాబాద్‌ వచ్చాక లయ తప్పేది. సౌకర్యాల లేమితో ఇబ్బంది ఎదురయ్యేది. విదేశీ శిక్షణ నాలో చాలా మార్పు తెచ్చింది.   ప్రపంచకప్‌ పతకం నాన్నకే అంకితం’’
-అరుణ 

పాపం..కోచ్‌

రుణకు దశాబ్దం కిందట్నుంచి శిక్షణ ఇస్తున్నాడు కోచ్‌ బ్రిజ్‌ కిషోర్‌. ఆయన తనను కూతురిలా చూస్తాడని, తనకెంతో అండగా ఉంటూ శిక్షణ ఇస్తాడని అంటుందామె. ఆమెతో పాటు ఉజ్బెకిస్థాన్‌లో శిక్షణకు కూడా వెళ్లాడు కిషోర్‌. నెల తర్వాత అక్కడ తన అవసరం లేదని భావించి హైదరాబాద్‌ వచ్చేశాడు. అయితే ఉజ్బెకిస్థాన్‌లో ఉండగానే ఆయన అనారోగ్యం పాలయ్యాడు. ఉదర సంబంధిత జబ్బు వచ్చింది. ఐతే హైదరాబాద్‌లో చికిత్సలో లోపం వల్ల ఆయన ఆరోగ్యం మరింత దెబ్బతింది. నెల రోజులుగా తిండి తినలేక బాగా నీరసించిపోయాడాయన. తన శిష్యురాలు ప్రపంచకప్‌లో గెలిచి చరిత్ర సృష్టించిన సందర్భాన్ని ఆయన ఆస్వాదించలేని పరిస్థితి.

- తిమ్మాపురం చంద్రశేఖర్‌ రెడ్డి  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్