బార్బీ బొమ్మలా ఉండాలని.. 43 సర్జరీలు!

చిన్నతనంలో మనం ఎన్నో బొమ్మలతో ఆడుకుంటాం.. వాటి అందానికి ముగ్ధులమవుతాం. అంతమాత్రానికే వాటిలా మారాలనుకుంటామా.. ఏంటి? కానీ ఇరాక్‌కు చెందిన దలియా నయీమ్‌ మాత్రం అలాగే అనుకుంది. చిన్న వయసులో బార్బీ బొమ్మను ఇష్టపడిన ఆమె.. దాంతోనే ఎక్కువగా....

Updated : 18 Apr 2023 20:59 IST

(Photos: Instagram)

చిన్నతనంలో మనం ఎన్నో బొమ్మలతో ఆడుకుంటాం.. వాటి అందానికి ముగ్ధులమవుతాం. అంతమాత్రానికే వాటిలా మారాలనుకుంటామా.. ఏంటి? కానీ ఇరాక్‌కు చెందిన దలియా నయీమ్‌ మాత్రం అలాగే అనుకుంది. చిన్న వయసులో బార్బీ బొమ్మను ఇష్టపడిన ఆమె.. దాంతోనే ఎక్కువగా ఆడుకునేది. అయితే అది తనకు ఎంతలా నచ్చిందంటే.. పెద్దయ్యాక తన రూపాన్ని బార్బీలా మార్చుకునేంతలా! అదే ఆలోచన, పట్టుదలతో పెరిగిన దలియా.. ఇందుకోసం ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 43 కాస్మెటిక్‌ సర్జరీలు చేయించుకుంది. ఇలా మొత్తానికి బార్బీ బొమ్మను పోలినట్లుగా తన రూపాన్ని మార్చుకున్న ఆమె.. ఆయా ఫొటోలు, వీడియోల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటుంది. అలా ఓ వీడియో ఇటీవలే వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఇరాకీ బార్బీ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో జన్మించింది దలియా. చిన్న వయసులో బార్బీ బొమ్మను ఎక్కువగా ఇష్టపడేదామె. దాని అందానికి ముగ్ధురాలైన ఆమె.. తనను బార్బీలా ఊహించుకొని మురిసిపోయేది. అలా ఆ బొమ్మ తన సర్వస్వంగా మారిపోయింది. ఈ ఇష్టమే పెరిగి పెద్దయ్యాక తన రూపాన్ని అచ్చం బార్బీ డాల్‌ను పోలినట్లుగా మార్చుకోవాలన్న ఆలోచనను తనలో రేకెత్తింపజేసింది.

43 సర్జరీలు!

ప్రస్తుతం నటిగా, టీవీ వ్యాఖ్యాతగా కొనసాగుతోన్న దలియా.. ఇప్పటికే పలు టీవీ షోలలో, సీరియల్స్‌లో మెరిసింది. తద్వారా సెలబ్రిటీ స్టేటస్‌ను సంపాదించుకుంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్ని పంచుకుంటూ ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. అయితే టీనేజ్‌లోకొచ్చాక బార్బీలా మారాలనుకున్న తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు సిద్ధమైందీ చక్కనమ్మ. ఈ క్రమంలోనే గత కొన్నేళ్ల నుంచి పలు కాస్మెటిక్‌ సర్జరీలు చేయించుకుంటోంది. లిప్‌ ఫిల్లర్‌, బ్రెస్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ సర్జరీ, బ్రెజిలియన్‌ బట్‌ లిఫ్ట్‌, ముక్కుకు శస్త్ర చికిత్స, మూడుసార్లు లైపోసక్షన్‌.. వంటి సౌందర్య చికిత్సలు చేయించుకుంది దలియా. ఇలా ఇప్పటివరకు సుమారు 43 సర్జరీలు చేయించుకున్న ఆమె.. నఖశిఖపర్యంతం బార్బీని పోలినట్లుగా తన రూపాన్ని మార్చుకుంది. ఈ క్రమంలో లక్షలు ఖర్చు చేసిందామె.

వాళ్ల మాటలు పట్టించుకోను!

అయితే తన పూర్వ రూపానికి సంబంధించిన ఫొటోలతో పాటు, బార్బీలా మారే క్రమంలో తనలో వస్తోన్న శారీరక మార్పులకు సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని సైతం ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తోంది దలియా. ఇలా ఈ రెండింటినీ పోల్చి చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయిందామె. అయితే ఇటీవలే ఓ వీడియోను పోస్ట్‌ చేసిన దలియా.. ‘నువ్వు అచ్చం బార్బీలా అందంగా ఉన్నావు డియర్‌..’ అంటూ తనను తానే ప్రశంసించుకుంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చిందామె. ఇది చూసిన చాలామంది నెటిజన్లు ‘ఇరాకీ బార్బీ’, ‘బ్యూటిఫుల్‌ రోజ్‌’, ‘రియల్‌ బార్బీ’.. అంటూ ప్రశంసిస్తున్నారు. మరోవైపు.. ‘డెవిల్‌ బార్బీ’, ‘జాంబీ’ అని విమర్శించిన వారూ లేకపోలేదు. ఏదేమైనా ఇలాంటి వాళ్ల మాటలు పట్టించుకోనంటోందీ ఇరాకీ బార్బీ.

‘నా రూపాన్ని చూసి ప్రశంసించిన వారి మాటలకు పొంగిపోను.. విమర్శించిన వాళ్ల మాటలు పట్టించుకోను. నా మనసుకు నచ్చిన పని చేశానన్న సంతృప్తి నాకు చాలు. అయితే పూర్తి స్థాయిలో బార్బీలా మారాలంటే నా శరీరంలో ఇంకా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ప్రస్తుతం ఇందుకోసం సన్నద్ధమవుతున్నా..’ అంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోందీ బార్బీ బ్యూటీ. ప్రస్తుతం ఈ చక్కనమ్మను ఇన్‌స్టాలో సుమారు 10 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.
Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని