అందుకే పిల్లలందరికీ తన పుస్తకాలంటే ఎంతో ఇష్టం!

‘వంద భావాలను, వెయ్యి ఆలోచనల్ని ఒక చిత్రంతో చెప్పచ్చ’న్నట్లు.. ఇలాంటి బొమ్మలే పిల్లలకు చదువుపై ఆసక్తిని మరింతగా పెంచుతాయంటున్నారు ముంబయికి చెందిన రచయిత, ఇలస్ట్రేటర్‌ దీపా బల్‌సావర్‌. చిన్నవయసు నుంచే పదాలు, బొమ్మలపై ప్రేమ పెంచుకున్న ఆమె.. అందులోనే తన కెరీర్‌ను వెతుక్కున్నారు. పలు కార్టూన్‌ క్యారక్టర్లను సృష్టించి పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఇలస్ట్రేషన్‌ పుస్తకాలు రాశారు. పాఠ్యాంశాలనూ బొమ్మల రూపంలో అందించేందుకు UNICEFతో కలిసి పనిచేశారామె.

Published : 19 Dec 2021 13:45 IST

(Photo: Facebook)

‘వంద భావాలను, వెయ్యి ఆలోచనల్ని ఒక చిత్రంతో చెప్పచ్చ’న్నట్లు.. ఇలాంటి బొమ్మలే పిల్లలకు చదువుపై ఆసక్తిని మరింతగా పెంచుతాయంటున్నారు ముంబయికి చెందిన రచయిత, ఇలస్ట్రేటర్‌ దీపా బల్‌సావర్‌. చిన్నవయసు నుంచే పదాలు, బొమ్మలపై ప్రేమ పెంచుకున్న ఆమె.. అందులోనే తన కెరీర్‌ను వెతుక్కున్నారు. పలు కార్టూన్‌ క్యారక్టర్లను సృష్టించి పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఇలస్ట్రేషన్‌ పుస్తకాలు రాశారు. పాఠ్యాంశాలనూ బొమ్మల రూపంలో అందించేందుకు UNICEFతో కలిసి పనిచేశారామె. ఇలా పిల్లలకు చదువుపై ప్రేమ పెంచడానికి తాను పడిన తాపత్రయమే ఆమెకు పలు అవార్డులు-రివార్డులు తెచ్చిపెట్టింది. టాటా ట్రస్ట్స్‌కు చెందిన పరాగ్‌ ఇనీషియేటివ్‌ ఇటీవలే అందించిన ‘బిగ్‌ లిటిల్‌ బుక్‌ అవార్డు’ కూడా అందులో ఒకటి.

ముంబయిలో పుట్టి పెరిగిన దీపా బల్‌సావర్‌కు స్కూలుకెళ్లే వయసు నుంచే పదాలు, బొమ్మలంటే అమితాసక్తి. తన తల్లిదండ్రులతో కలిసి ఎక్కడికి వెళ్లినా పబ్లిక్‌ బోర్డులపై ఉండే బొమ్మలు, గుర్తుల్ని తీక్షణంగా పరిశీలించేదామె. ఏ ఊరు వెళ్లినా స్థానిక గ్రంథాలయానికి వెళ్లి తనకు కావాల్సిన పుస్తకాలు ఇంటికి తెచ్చుకునేది. అంతేకాదు.. ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేసేయాలన్న పట్టుదల ఆమెలో ఎక్కువ! బహుశా ఇదే తనను ఓ రచయిత్రిగా, ఇలస్ట్రేటర్‌గా మార్చిందేమో అంటారామె.

జర్నీ.. అలా మొదలైంది!

చదువు పూర్తయ్యాక ఓ ఆర్ట్‌ స్కూల్లో అడ్వర్టైజింగ్‌ విభాగంలో చేరారు దీప. అయితే ఎంత చేసినా ఆ పనిలో మాత్రం తనకు సంతృప్తి దొరకలేదు. ఈ క్రమంలోనే బొమ్మల పుస్తకాల్ని ఆధారంగా చేసుకొని పిల్లలతో మమేకమై పనిచేయాలని ఆరాటపడ్డారు. అందుకోసం తన ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఓ సంస్థలో చేరారామె. ముంబయిలోని మున్సిపల్‌ స్కూళ్లలో చదివే పిల్లలకు పాఠ్యాంశాల్ని రూపొందించే సంస్థ అది. పిల్లలు నేర్చుకునే విషయాలను, నిజ జీవితంలో జరిగే విషయాలతో ముడిపెట్టి సోదాహరణగా వివరించడం, తద్వారా వారిలో నైపుణ్యాలను పెంపొందించడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం. ఇక దీంతో పాటు తనే కొన్ని కథల్ని రాసుకొని.. వాటికి బొమ్మల రూపమిచ్చి.. పబ్లిష్‌ చేయించుకునే వారు దీప. రోజులు గడిచే కొద్దీ తన పుస్తకాలంటే పిల్లల్లోనూ ఆదరణ పెరగడం మొదలైంది. దీంతో పలు ముద్రణ సంస్థలే బొమ్మల పుస్తకాల కోసం తనను సంప్రదించడం మొదలుపెట్టాయి. ఇక అప్పట్నుంచి రచయిత్రిగా, ఇలస్ట్రేటర్‌గా వెనక్కి తిరిగి చూసుకొనే అవసరం తనకు రాలేదంటారు దీప.

పాత్రలే ఆమె నేస్తాలు!

‘పేజీలకు పేజీలు కంటెంట్‌ ఉన్న పుస్తకాల కంటే బొమ్మల పుస్తకాలు పిల్లలకు చదువుపై ప్రేమను మరింతగా పెంచుతాయి.. పైగా అందులోని విషయాన్ని వారు సులభంగా గ్రహించడానికి ఈ బొమ్మలు చక్కగా ఉపయోగపడతాయి’ అంటారు దీప. ఈ క్రమంలోనే నాని వంటి విభిన్న పేర్లతో కార్టూన్‌ క్యారక్టర్లను రూపొందించి.. వాటితో పిల్లలకు బొమ్మల కథల పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. మరికొన్ని పుస్తకాలకు ఇలస్ట్రేటర్‌గానూ వ్యవహరించారు. ముఖ్యంగా ‘The Seed’, ‘The Lonely King and Queen’, ‘The Lion and the Fox’.. వంటి పుస్తకాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. కొన్ని పుస్తకాలు తెలుగు, గుజరాతీ, బెంగాలీ.. వంటి భాషల్లోకీ అనువాదం అయ్యాయి.

యునిసెఫ్‌తో కలిసి..!

అంతేకాదు.. పిల్లలకు పాఠ్యాంశాల్ని అందించే పలు కార్యక్రమాల్లోనూ భాగమయ్యారామె. ఈ క్రమంలోనే ‘Avehi-Abacus Project’లో భాగంగా మున్సిపల్‌ స్కూళ్లకు టీచింగ్‌-లెర్నింగ్‌ కిట్స్‌ని అందించారు. యునిసెఫ్‌ ఆధ్వర్యంలో గణితం, ఇతర రీడింగ్‌ ప్రోగ్రామ్స్‌కి సంబంధించిన NCERT పాఠ్యాంశాలకు బొమ్మల రూపమిచ్చారు. అంతేకాదు.. పిల్లల కోసం యునిసెఫ్‌ రూపొందించిన ‘ఎంపవర్‌మెంట్‌ సిరీస్‌’లో ఈ సంస్థ రూపొందించిన యానిమేటెడ్‌ క్యారక్టర్‌ మీనా కోసం స్క్రిప్ట్ కూడా రాశారు దీప.

12 గంటలూ పుస్తకాలతోనే దోస్తీ!

ఇలా పుస్తకాల పురుగైన ఆమె రోజుకు 12 నుంచి 13 గంటల పాటు పుస్తకాలతోనే దోస్తీ కడతానంటున్నారు. అంతేకాదు.. పేపర్‌ వృథా కాకుండా, పబ్లిష్‌ చేసే క్రమంలో రసాయనాల వినియోగం లేకుండా ఆన్‌లైన్‌లోనే పిల్లలకు మెటీరియల్‌ను చేరువ చేయాలన్న ఆలోచనతో ఉన్నానంటున్నారామె. ఈ క్రమంలోనే ఇలస్ట్రేషన్‌లో 3D ఆర్ట్‌ మోడల్‌ను నేర్చుకునే పనిలో పడ్డారు. ఇలా పిల్లలకు సులభంగా, సరళంగా అర్థమయ్యేందుకు ఆమె పడుతోన్న తాపత్రయమే ఇటీవల ‘బిగ్‌ లిటిల్‌ బుక్‌ అవార్డు’ను ఆమెకు కట్టబెట్టింది. టాటా ట్రస్ట్స్‌కు చెందిన పరాగ్‌ ఇనీషియేటివ్‌.. ఏటా రచయిత, ఇలస్ట్రేటర్‌/ఆర్టిస్ట్‌.. ఇలా రెండు విభాగాల్లో ఈ అవార్డును అందిస్తుంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఇలస్ట్రేషన్‌ విభాగంలో ఈ పురస్కారం గెలుచుకున్నారు దీప. ఇక రచయిత విభాగంలో కొట్టాయంకు చెందిన ప్రొఫెసర్‌ ఎస్‌ శివదాస్‌ అవార్డు అందుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్