కాపర్‌ బాటిల్స్‌ని ఇలా కడిగేద్దాం!

ప్రతి విషయంలోనూ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నాం. ఇందులో భాగంగానే కాపర్‌ బాటిల్స్‌ ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది.

Published : 10 Feb 2024 20:34 IST

ప్రతి విషయంలోనూ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నాం. ఇందులో భాగంగానే కాపర్‌ బాటిల్స్‌ ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. రాత్రంతా ఈ బాటిల్‌లో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడడంతో పాటు బహుళ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఏదేమైనా వీటిని తరచూ ఉపయోగించడం వల్ల.. గాలిలో ఆక్సిజన్‌తో చర్య జరిపి అవి రంగు మారిపోవడం, బాటిల్‌ అడుగున ఆకుపచ్చగా తయారవడం సహజం. మరి, వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటేనే బాటిల్‌ పరిశుభ్రంగా ఉంటుంది.. ఆరోగ్యానికీ మంచిది. ఇందుకోసం కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు.

⚛ ఉప్పు, వెనిగర్‌ కొద్ది మొత్తాల్లో తీసుకొని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని బాటిల్ ఉపరితలంపై రుద్దడంతో పాటు.. ద్రావణంలా చేసి బాటిల్ లోపలి భాగాన్ని శుభ్రం చేయాలి. ఫలితంగా బాటిల్‌ పూర్వపు రంగులోకొస్తుంది.

⚛ ఇదే వెనిగర్‌, ఉప్పును మరో విధానంలో ఉపయోగించి కాపర్ బాటిల్స్‌ని శుభ్రం చేయచ్చు. టేబుల్‌స్పూన్‌ ఉప్పు, కప్పు వెనిగర్‌ను ఒక పెద్ద గిన్నెలో వేయాలి.. ఇందులో బాటిల్‌ను ఉంచి.. పాత్ర నిండా నీళ్లు నింపాలి. ఇప్పుడు ఈ గిన్నెను స్టౌపై పెట్టి అరగంట పాటు మరిగించాలి. ఆపై చల్లారాక బాటిల్‌ను శుభ్రం చేస్తే తళతళా మెరుస్తుంది.. లోపలి భాగం కూడా శుభ్రమవుతుంది.

⚛ నిమ్మలోని ఆమ్ల గుణాలు ఏ వస్తువునైనా ఇట్టే శుభ్రపరుస్తాయి. కాపర్‌ బాటిల్‌నూ ఇలాగే శుభ్రం చేయచ్చు. నిమ్మకాయను సగానికి కట్‌ చేసి.. దాంతో బాటిల్‌ పైభాగాన్ని రుద్దడం, నిమ్మరసాన్ని బాటిల్‌లో పోసి మృదువైన క్లాత్‌తో లోపలి భాగాన్ని క్లీన్‌ చేయడం వల్ల బాటిల్‌ శుభ్రపడుతుంది.

⚛ నిమ్మరసం, ఉప్పు కలిపి తయారుచేసిన పేస్ట్‌తోనూ కాపర్‌ బాటిల్‌/కాపర్‌ పాత్రల్ని శుభ్రం చేయచ్చు. దీన్ని ఆయా పాత్రలపై వేసి.. మృదువైన క్లాత్‌తో రుద్దడం వల్ల అవి శుభ్రపడతాయి. కొత్తవాటిలా మెరుస్తాయి. ఇక బాటిల్‌ లోపలి భాగాన్ని శుభ్రం చేయడానికి ఈ మిశ్రమాన్ని ద్రావణంగా చేసుకొని ఉపయోగించాలి.

⚛ కాపర్‌ బాటిల్‌లో కాస్త వేడిగా ఉన్న నీటిని పోసి.. అందులో కొద్దిగా ఉప్పు, రెండు నిమ్మ చెక్కలు, కాస్త వెనిగర్‌ వేసి.. అరగంట పాటు పక్కన పెట్టేయాలి. నీళ్లు చల్లారాక.. కాటన్‌ క్లాత్‌తో లోపలి భాగాన్ని శుభ్రం చేస్తే సరిపోతుంది.

⚛ చింతపండు రసంలో కొద్దిగా ఉప్పు వేసి బాటిల్‌లో పోయాలి. కాసేపటి తర్వాత షేక్‌ చేస్తూ దీన్ని శుభ్రం చేయాలి. ఇదే చింతపండు గుజ్జుతో బాటిల్‌ బయటి భాగాన్నీ శుభ్రం చేసి మెరిపించచ్చు.

ఇవి గుర్తుంచుకోండి!

⚛ రాగి బాటిల్స్‌ని శుభ్రం చేయడానికి కాస్త వేడిగా ఉన్న నీటిని ఉపయోగిస్తే అవి త్వరగా శుభ్రపడతాయి.

⚛ శుభ్రపరిచే క్రమంలో సహజసిద్ధమైన పదార్థాల్ని ఉపయోగించినప్పటికీ.. చేతులకు గ్లోవ్స్‌ పెట్టుకోవడం మంచిది. తద్వారా చర్మ అలర్జీలు రాకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ పదిహేను రోజులకోసారి బాటిల్స్‌ని శుభ్రం చేయడం వల్ల అవి ఎప్పుడూ కొత్త వాటిలా మెరుస్తాయి.. బాటిల్‌ కూడా క్లీన్‌గా ఉంటుంది. లేదంటే రుద్ది మరీ కడగాల్సి వస్తుంది.

⚛ బాటిల్స్‌ లోపలి భాగాన్ని కడిగే క్రమంలో గరుకుగా ఉండే బ్రష్‌లు వాడకూడదు. బయటి భాగానికి కూడా స్క్రబ్బర్లు ఉపయోగించకపోవడమే మంచిది. ఎందుకంటే వీటివల్ల బాటిల్‌పై గీతలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మృదువైన కాటన్‌ క్లాత్‌తో వీటిని శుభ్రం చేయాలి.

⚛ అన్ని పాత్రల్లా వీటిని గాలికి ఆరబెట్టకూడదు. కడిగిన వెంటనే పొడి వస్త్రంతో తుడవడం వల్ల అవి ఆక్సిడేషన్‌ ప్రక్రియకు లోను కావు.. అలాగే బాటిల్‌పై నీటి మరకలు పడకుండానూ జాగ్రత్తపడచ్చు.

⚛ ఎండలో, వేడి ఎక్కువగా ఉండే ప్రదేశంలో వీటిని ఉంచకూడదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్