Womens Day Webinar: ఓ అతివా.. ఆకాశమే హద్దుగా సాగిపో!

అదీ ఇదీ అని లేకుండా- అవని నుంచి అంతరిక్షం దాకా.. మేరునగమై.. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు.. తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.. మగవాళ్లకు దీటుగా.. అన్నిట్లోనూ దిట్టగా.. మనకు సాటి లేదంటూ మున్ముందుకు సాగిపోతున్నారు..!  పెద్ద పెద్ద సంస్థలకు అధిపతులుగా.. దేశాధినేతలుగా.. తిరుగులేని నాయకులుగా రాణిస్తున్నారు..!

Updated : 20 Mar 2022 15:10 IST

ఈనాడు-వసుంధర వెబినార్

అదీ ఇదీ అని లేకుండా- అవని నుంచి అంతరిక్షం దాకా.. మేరునగమై.. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు.. తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.. మగవాళ్లకు దీటుగా.. అన్నిట్లోనూ దిట్టగా.. మనకు సాటి లేదంటూ మున్ముందుకు సాగిపోతున్నారు..!  పెద్ద పెద్ద సంస్థలకు అధిపతులుగా.. దేశాధినేతలుగా.. తిరుగులేని నాయకులుగా రాణిస్తున్నారు..!

అయినా ఇప్పటికీ ఇంకా కొన్ని చోట్ల మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది.

తపనేంటో తెలిసినా.. నీవల్లేమవుతుందన్న దెప్పిపొడుపులు..

వ్యాపారం చేస్తానంటే.. ఆడపిల్లవు అది నీకు చేతకాదన్న నిరుత్సాహపూరిత మాటలు..

పదవి నుంచి జీతభత్యాల దాకా.. అడుగడుగునా హారతి పట్టే అసమానతలు..

ఉనికినే లోపంగా చూపించి అణగదొక్కే అరాచక శక్తులు..

ఇంటా-బయట, వ్యక్తిగతంగా-వృత్తిపరంగా.. మహిళలు ఎన్ని విజయాలు సాధిస్తున్నా.. నేటికీ ప్రతిచోటా వివక్ష అనే సంకెళ్లు వారిని వెనక్కి లాగుతున్నాయి. వారి ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. అయితే చేపలా ఈ గాలానికి చిక్కకుండా.. సంకెళ్ల కట్టుబాట్లను తెంచే ఆయుధాలు సిద్ధం చేసుకోవాలంటున్నారు నిపుణులు. #BreakTheBias అంటూ ప్రతి చోటా మనపై ఉన్న లింగ వివక్షకు చరమగీతం పాడాలని సూచిస్తున్నారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘ఈనాడు-వసుంధర’ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్‌లో ఇదే విషయంపై ప్రసంగించి ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపారు నలుగురు మహిళా వక్తలు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది మహిళలు ఈ వెబినార్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు.


విజయానికి ఏడు సూత్రాలు!

- డా. పి. మధురిమా రెడ్డి, లావిన్‌స్పైర్‌ సీఈవో-లైఫ్‌ అండ్‌ బిజినెస్‌ కోచ్

‘సంతోషానికి పొంగిపోవడం.. కష్టాలకు కుంగిపోవడం..!’ చాలామంది చేసేదే! అయితే మన జీవితంలో జరిగే ప్రతి మార్పు వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుందన్న నమ్మకం ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి. అంతా మన మంచికే అన్న సిద్ధాంతం అలవర్చుకోవాలి. అలాగే ఏదైనా పనిచేయాలంటే అందుకు ముందు గట్టిగా సంకల్పించుకోవడం చాలా అవసరం. ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో రెండు ముఖ్యమైన రోజులుంటాయి.. ఒకటి - పుట్టిన రోజు, రెండోది - మన తపనేంటో తెలుసుకున్న రోజు. ఇవే సమాజంలో మన ఉనికి చాటుకునేందుకు ఊతమిస్తాయి. సమస్యను వదిలేయడం కంటే పరిష్కరించుకున్నప్పుడే విజయం సిద్ధిస్తుంది. అందుకే ఈ ఏడు సూత్రాల్ని జీవనశైలిలో భాగం చేసుకోవాలి.

1. ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలి. రోజూ గంట పాటు వ్యాయామాలు సాధన చేయాలి.

2. మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఏ పనైనా చురుగ్గా చేయగలం.. అందుకోసం సమస్యల్ని ఇతరులతో పంచుకోవడం, అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడానికీ వెనకాడద్దు.

3. ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. ఎవరి జీవితానికి వారే సృష్టికర్త. స్వీయ నమ్మకంతో ముందుకెళ్లండి.

4. జీవితంలోని ప్రతి క్షణం విలువైంది. భావోద్వేగాల్ని సానుకూలంగా అర్థం చేసుకోగలిగితే (EQ) సవాళ్లను ఎదుర్కోగలం.

5. మన గురించి మనకు పూర్తి అవగాహన ఉండడం ముఖ్యం. ఏది జరిగినా మీకు మీరే బెస్ట్‌ ఫ్రెండ్‌ అన్నది గుర్తుపెట్టుకోండి. ఈ నమ్మకమే మీకు మార్గనిర్దేశనం చేస్తుంది.

6. సమాజానికీ మన వంతుగా ఏం చేస్తున్నామన్నది స్వీయ పరిశీలన చేసుకోండి. పరోక్షంగా ఇది మానసిక సంతృప్తిని అందిస్తుంది.

7. శరీరం, మనసు, ఆత్మ.. ఈ మూడూ పెట్టి చేసిన పనే సక్సెసవుతుంది.


ఆకాశమే హద్దుగా..!

- డా. శాంతా తౌటం, తెలంగాణా ప్రభుత్వ చీఫ్‌ ఇన్నొవేషన్‌ ఆఫీసర్

అంతర్గతంగా ప్రతి ఒక్కరికీ కొన్ని ప్రతికూల ఆలోచనలుంటాయి. అవే మన ఉన్నతికి అవరోధాలుగా మారతాయి. వాటిని అధిగమించి ముందుకెళ్లాలంటే ఒక విజన్‌ ఏర్పరచుకోవాలి. లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలన్న ప్రణాళిక వేసుకోవాలి. ఈ క్రమంలో మార్పుల్ని అంగీకరించడం ముఖ్యం. అలాగే అందరూ వెళ్లే దారిలో వెళ్తే మన గురించి మనం తెలుసుకోలేం.. అందుకే మనకంటూ సొంత వేదికను/మార్గాన్ని నిర్మించుకోవాలి. మనకేం కావాలి, మనమేం చేయాలనుకుంటున్న విషయాలపై స్పష్టత ఉండాలి. మన జీవితానికి మనమే బాధ్యత వహించాలి.

కలల తీరం చేరే క్రమంలో ఎన్నో సవాళ్లు మనకు ఒత్తిడిని కలిగించచ్చు.. దాన్ని అధిగమించడానికి యోగ సాధన జీవనశైలిలో భాగం చేసుకోవాలి. అలాగే మనకెదురయ్యే సవాళ్లు-మన తపనను సమతుల్యం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఇతరుల అనుభవాల నుంచి తెలుసుకున్న దాని కంటే స్వీయానుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలే ఎప్పటికీ మనతో ఉండిపోతాయి. నక్షత్రాల్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకోండి.. కనీసం ఆకాశం వరకైనా వెళ్లగలుగుతారు. ఇలా మీరు ఎదగడమే కాదు.. తోటి మహిళలూ ఎదిగేలా ఊతమివ్వండి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండండి.. అవే మిమ్మల్ని నిరంతరం ఉత్సాహంగా ఉంచుతాయి.


ఐడియా, పట్టుదల.. ఈ రెండే కీలకం!

- దీప్తి రావుల, వి-హబ్‌ సీఈవో

చాలామంది ఏదైనా బిజినెస్/స్టార్టప్‌ ప్రారంభించాలనుకున్నప్పుడు తగిన ప్రోత్సాహం, పెట్టుబడి ఉండాలని, లేకపోతే సక్సెస్‌ కాలేమనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇందుకోసం మన దగ్గర స్పష్టమైన ఐడియా ఉండాలి.. సాధించాలన్న పట్టుదల కావాలి. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లకు సానుకూలంగా స్పందించే ఓర్పు-నేర్పు అవసరం. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతార’న్నట్లు.. పట్టుదలతో ప్రయత్నించి లక్ష్యాన్ని చేరుకుంటే ప్రోత్సాహం దానంతటదే వస్తుంది.

అన్నీ అనుకూలంగా ఉండే ఉద్యోగం చేయాలనుకుంటారు చాలామంది. కానీ దానివల్ల కొత్త విషయాలు నేర్చుకోలేం. ఎప్పుడూ తోటి వారి నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలనే తాపత్రయం కావాలి. ఫలానా పని నేను చేయగలుగుతాననే విశ్వాసం ఉండడం మంచిదే. కానీ ఎదుటివాళ్ల కంటే ఇంకా ఎదిగేందుకు ఇంకాస్త పరిశ్రమ, పరిశోధన చేయాల్సి ఉంటుంది. సమయం రావాలి.. ఫలానా పని చేయాలని ఎప్పుడూ గిరి గీసుకోకండి. ఏ వ్యాపారానికైనా మనకంటూ సొంత ఐడియాలజీ ఉండి.. సరైన ఆర్థిక ప్రణాళిక వేసుకోగలిగితే ఇంతింతై అన్నట్లుగా అందులో దూసుకుపోవచ్చు. ప్రస్తుతం ప్రతి రంగంలో ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకొని, అంకితభావంతో పని చేయగలిగితే విజయం మనదే అవుతుంది!


ముగ్గురమ్మలే మనకు స్ఫూర్తి!

- కె. శిల్పవల్లి, మాదాపూర్‌ డీసీపీ

ప్రస్తుతం సమాజంలో మహిళలపై కొన్ని రకాల మూసధోరణులున్నాయి. ఒక ప్రాజెక్ట్‌లో సక్సెసైతే మగవాళ్లకు క్రెడిట్‌ ఇస్తున్నారు.. అదే ఫెయిలైతే ఆడవాళ్ల తప్పిదం అంటున్నారు. మరోవైపు ఇంటి బాధ్యతలైతే ఆడవాళ్లే చూసుకోవాలి.. ఉద్యోగమంటే మగవాళ్లే చేయాలి.. ఇలాంటి అసమానతలు ఇంటి నుంచే మొదలవుతున్నాయి. నిజానికి ఇలా మహిళలు చేసే పనులన్నింటికీ సరైన గుర్తింపు దక్కట్లేదనే చెప్పాలి. దీంతో వారిలో నైపుణ్యాలున్నా, బోలెడంత అనుభవమున్నా ప్రోత్సాహం లేక వారిపై వారికే అపనమ్మకం ఏర్పడుతుంది. ఇలాంటి సవాళ్లు అధిగమించాలంటే.. అతివలు ముందు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. భయం-సందిగ్ధత వదిలిపెట్టాలి. ఇందుకు ఆ ముగ్గురమ్మలే మనకు స్ఫూర్తి.

* చదువుల తల్లి సరస్వతిలా నాలెడ్జ్‌ని పెంచుకుంటే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అలాగే తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని విద్యతో పాటు వారికి నచ్చిన అంశాల్లో ప్రోత్సహించాలి.

* ధనలక్ష్మిలా ఆర్థిక స్వేచ్ఛను సాధించాలి. అప్పుడే నిర్ణయాలు తీసుకోగలమన్న ధైర్యం ఏర్పడుతుంది.

* ధైర్యానికి, శక్తికి మారుపేరైన పార్వతీ దేవిలా మారాలి. నాయకత్వ లక్షణాల్ని పెంపొందించుకోవాలి. అపనమ్మకాలు, స్వీయ సందేహాలను వదిలిపెట్టాలి. పురుషాధిపత్యం ఉన్న రంగాల్లోకి ప్రవేశించినప్పుడే ఎక్కువ అనుభవం గడించచ్చు. తద్వారా మూసధోరణుల్ని బద్దలుకొట్టచ్చు.

పని ప్రదేశంలో లైంగిక హింస, ఇతర వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి ప్రతి కంపెనీలో అంతర్గత కమిటీ (విశాఖ గైడ్‌లైన్స్ ప్రకారం) ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఇది ఏర్పాటుచేయకపోయినా మహిళా ఉద్యోగులు ఈ దిశగా కృషి చేయచ్చు. ఇక లైంగిక హింస గురించి ఫిర్యాదు చేయడానికి.. షీబాక్స్‌, మహిళల రక్షణ కోసం అనుక్షణం పనిచేస్తోన్న షీటీమ్స్‌, సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌ భద్రతను పెంపొందించడానికి ఏర్పాటుచేసిన SCSC (సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌).. వంటి సౌకర్యాలెన్నో అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటితో పాటు మన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నప్పుడే ఎక్కడైనా మనగలుగుతాం..!

అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!

గమనిక: ఈ వెబినార్ వీడియో కోసం కింది లింక్ క్లిక్ చేయండి. CLICK HERE

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్