Updated : 06/02/2022 15:36 IST

Lata Mangeshkar: సంగీత సాగరాన మెరిసిన రత్నం..!

భారతీయ సంగీత సామ్రాజ్యానికే ఆమె 'బడీ దీదీ'...

తన గానమాధుర్యంతో ఆబాలగోపాలాన్నీ అలరించిన సుస్వరాల కోకిల..

అత్యున్నత పురస్కారాలకే వన్నె తెచ్చిన మేటి గాయని..

ఆమె దీటైన వ్యక్తిత్వం సంగీత కళాకారులెందరికో నిత్య ప్రేరణ..

ఆమె గాత్రం నుంచి జాలువారే సంగీత సౌరభాలు నిత్య నూతనం.. నిత్య శోభితం..

‘నైటింగేల్ ఆఫ్ బాలీవుడ్’ అని అభిమానంగా పిలుచుకున్నా..

‘మెలోడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా పట్టం కట్టినా అవన్నీ ఆ మహాగాయనికి చంద్రునికో నూలు పోగులాంటివే..!

అఖండ భారతావనిలోనే కాదు.. అంతర్జాతీయ సంగీత ప్రపంచంలోనే తనదైన గాన మాధుర్యంతో అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న ఆ మహా గాయనే..

‘బడీ దీదీ’ లతా మంగేష్కర్. ఈ సుస్వరాల గానకోకిలపై ప్రత్యేక కథనం మీకోసం..

కళాకారుల కుటుంబం నుంచి..

1929, సెప్టెంబర్ 28న ఇండోర్‌లో ఓ మరాఠా కుటుంబంలో జన్మించారు లత. దీనానాథ్ మంగేష్కర్, సుధామతి దంపతులు ఆమె తల్లిదండ్రులు. దీనానాథ్ అప్పటికే మంచి సంగీత విద్వాంసునిగా, నాటకకర్తగా ప్రసిద్ధుడు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో అతని కుటుంబం తరచూ ప్రదర్శనలు ఇస్తూ ఉండేది. లతా మంగేష్కర్ పుట్టినప్పుడు ఆమెకు శాస్త్రోక్తంగా పెట్టిన పేరు ‘హేమ’. అయితే, కొన్నాళ్లు గడిచాక దీనానాథ్ తాను రచించిన ‘భవబంధన్’ అనే నాటికలోని ‘లతిక’ అనే పాత్ర ప్రేరణతో తన కూతురికి ‘లత’ అని మళ్లీ నామకరణం చేశారని చెబుతారు. అయితే చిన్నప్పుడే చనిపోయిన ఆయన మొదటి భార్య కుమార్తె పేరు కూడా లతికే కావడం గమనార్హం.

ఐదేళ్ల వయసు నుంచే..!

ఐదు సంవత్సరాల వయసు నుంచే లత తన తండ్రి దర్శకత్వం వహించే నాటకాల్లో నటించేది. రోజూ తంబురతో సంగీత సాధన చేసేది. దీనానాథ్ నాటక రంగాన్ని వదిలి సినిమా రంగానికి వచ్చాక, అనుకోకుండా వారు ఎన్నో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. దాంతో ఆయన కుటుంబం కూడా ఎన్నో కష్టాలు పడింది. 1942లో దీనానాథ్ చనిపోయేటప్పటికి లత వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే.

ఇంటికి పెద్దకూతురిగా..

తండ్రి చనిపోయాక ఇంటికి పెద్దకూతురిగా కుటుంబ భారమంతా లతా మంగేష్కర్ మీదే పడింది. కానీ తండ్రి ఆమెకు ఇచ్చిన ఆస్తి సంగీతమే! ఆమెకు ఆశ, ఉష, మీనా అనే ముగ్గురు చెల్లెళ్లు, హృదయేంద్రనాథ్ అనే ఒక తమ్ముడు తోబుట్టువులు. వాళ్లు అప్పటికి చిన్నపిల్లలు. వారందరి బాగోగులు చూసుకుంటూనే లత సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్‌గా అవకాశాల కోసం ప్రయత్నించేవారట. దీనానాథ్ స్నేహితుడైన వినాయక్ దామోదర్ ఆ సమయంలో లతకు అండగా నిలిచారు. 1942లో ‘కితి హాసల్’ అనే మరాఠీ చిత్రంలో లతకు తొలిసారిగా పాట పాడే అవకాశం లభించింది. అయితే, అనివార్య కారణాల వల్ల ఆ గీతాన్ని దర్శకుడు చిత్రం నుంచి తొలగించారు. ఆ తర్వాత అడపాదడపా చిన్న చిన్న చిత్రాల్లో పాడిన లత, కుటుంబ పోషణ నిమిత్తం తన చెల్లెలితో కలిసి అప్పుడప్పుడూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించేవారట!

తొలి బ్రేక్..

వినాయక్ దామోదర్ ప్రోద్బలంతో 1945లో కుటుంబంతో సహా ముంబయి వచ్చేసిన లతా మంగేష్కర్ ‘గజబాహు’ అనే చిత్రంలో ‘మాతా ఏక్ సపూత్ కీ దునియా బదల్ దే తూ’ అనే పాటను తొలిసారిగా హిందీలో పాడారు. సినిమాల్లో పాటలు పాడుతూనే ఉస్తాద్ అమానత్ అలీ ఖాన్ దగ్గర హిందుస్థానీ సంగీతంలో శిష్యరికం చేసేవారు లత. 1947లో అలీఖాన్ భారత్-పాక్ విభజన నేపథ్యంలో పాకిస్తాన్‌కు తరలి వెళ్లిపోయాక, లత సంగీతం నేర్చుకోవడానికి అమానత్ ఖాన్ దేవస్వాతే వద్ద చేరారు. ఆ తర్వాత కొన్నాళ్లు పండిట్ తులసీదాస్ శర్మ దగ్గర కూడా పాఠాలు నేర్చుకున్నారు. సినిమా రంగంలో సంగీత దర్శకుడు గులామ్ హైదర్ ఆమెను బాగా ప్రోత్సహించేవారు. 1948లో విడుదలైన ‘మజ్బూర్’ చిత్రంలోని ‘దిల్ మేరా తోడా’ అనే పాటను లత ఆయన సంగీత దర్శకత్వంలోనే పాడారు. అయితే 1949లో వచ్చిన ‘మహల్’ చిత్రంలోని ‘ఆయేగీ ఆనేవాలా’ అనే పాట చిత్ర పరిశ్రమలో లతా మంగేష్కర్ పేరును మార్మోగేలా చేసిందని చెప్పచ్చు. అదే తన సంగీత కెరీర్‌కు తొలి బ్రేక్‌ అంటారు లతాజీ.

నేనెవరికీ పోటీ కాను..

1950ల్లో లతకు అనిల్ బిశ్వాస్, శంకర్‌ జైకిషన్, నౌషద్ అలీ, ఎస్.డి.బర్మన్, కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ, మదన్‌మోహన్ లాంటి సంగీత దర్శకులతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. బైజూబావరా (1952), బర్సాత్ (1953), శ్రీ 420 (1955), దేవదాస్ (1955), మదర్ ఇండియా (1957) లాంటి సినిమాలు లత గానమాధుర్యాన్ని హిందీ చిత్రపరిశ్రమకు రుచి చూపించాయి. 1958లో సలీల్ చౌదరి సంగీత దర్శకత్వంలో ‘మధుమతి’ చిత్రానికి పాడిన ‘ఆజా రే పరదేశీ’ పాట లతా మంగేష్కర్‌కు తొలి ఫిల్మ్‌ఫేర్‌ను అందించింది. అయినప్పటికీ.. ఆమె పాడే విధానం, శైలిపై పలువురు ప్రముఖులు విమర్శలు చేశారు. వాటిని సవాలుగా తీసుకున్న లత మరింత పట్టుదలతో ముందుకు సాగారు. అలాగే, కెరీర్ తొలినాళ్లలో ఆమె నూర్జహాన్, షంషద్ బేగం వంటి గాయనీమణుల నుంచి గట్టిపోటీని ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే ‘నాకెవరూ పోటీ కాదు.. నేనెవరికీ పోటీ కాను’ అని చాలా ధైర్యంగా చెప్పేవారు లత. ఆ మనోధైర్యమే ఆమెకు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కట్టబెట్టిందని చెప్పచ్చు.

కంటతడి పెట్టిన నెహ్రూ..

1960ల్లో తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు అధిగమించారు లత. ‘మొఘల్-ఏ-ఆజమ్’లో ఆమె పాడిన ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ పాట సినిమా ఇండస్ట్రీనే ఒక వూపు వూపింది. ఆ పాట వినడం కోసమే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్ల వద్దకు క్యూ కట్టేవారట. అలాగే, భారత్-చైనా యుద్ధ నేపథ్యంలో సైనికులను ఉద్దేశించి ఒక మీటింగ్‌లో లత పాడిన ‘యే మేరే వతన్ కే లోగో’ అనే గీతాన్ని విని అప్పటి భారత ప్రధాని నెహ్రూ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారని, అప్రయత్నంగానే ఆయన కళ్లు చెమర్చాయని చెబుతారు. అలాగే, ‘గైడ్’ చిత్రంలో లత పాడిన ‘ఆజ్ ఫిర్ జీనేకీ తమన్నా హై’, ‘గాతా రహే మేరా దిల్’ పాటలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ సాంగ్స్‌గా మిగిలిపోతాయని చెప్పడం అతిశయోక్తి కాదు. 1963లో వచ్చిన ‘బీస్ సాల్ బాద్’ చిత్రంలో పాడిన ‘కహీ దీప్ జలే కహీ దిల్’ పాటకు, 1969లో వచ్చిన ‘జీనేకీ రాహ్’ చిత్రంలోని ‘ఆప్ ముఝే అచ్చే లగే’ గీతానికి ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు వరించాయి. ప్లేబ్యాక్‌ సింగర్‌గా నాలుగు సార్లు, స్పెషల్‌ అవార్డ్స్‌ విభాగంలో రెండుసార్లు, జీవిత సాఫల్య పురస్కారం విభాగంలో ఓసారి ఫిల్మ్‌ఫేర్‌ అందుకున్నారు లతాజీ.

తెలుగులోనూ తిరుగులేదు!

భారత సంగీత ప్రపంచంలో మేటి గాయనిగా కొన్ని దశాబ్దాల పాటు రాణించిన లతా మంగేష్కర్ దక్షిణ భారతదేశంలో సుసర్ల దక్షిణామూర్తి, ఇళయరాజా, ఏ.ఆర్.రెహమాన్ లాంటి సంగీత దర్శకుల బాణీలకు కూడా తన గాత్రాన్ని అందించారు. ఆమె తొలిసారిగా 1950ల్లో వచ్చిన ‘సంతానం’ చిత్రంలో ‘నిదురపోరా తమ్ముడా’ అనే తెలుగు పాట పాడారు. ఇదే పాటను రీరికార్డింగ్ తర్వాత మళ్లీ ఘంటసాల తన శైలిలో పాడడం విశేషం. ఆపై దొరికితే దొంగలు (1965), ఆఖరి పోరాటం (1988) చిత్రాలకు కూడా ఆమె గాత్ర సహకారం అందించారు. ఇలా గాయనిగానే కాదు.. కొన్ని మరాఠీ చిత్రాలకు సంగీత దర్శకురాలిగా, మరికొన్ని చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారీ లెజెండరీ గాయని. తన ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ సంగీత కెరీర్‌లో దాదాపు 36 భారతీయ భాషల్లో సుమారు 50 వేల పైచిలుకు పాటలు పాడి గిన్నిస్‌ రికార్డు పుటల్లోకి కూడా ఎక్కారామె.

భారత‘రత్నం’!

లతా మంగేష్కర్ తన గాన మాధుర్యానికి గానూ అనేక అత్యున్నత పురస్కారాలను సొంతం చేసుకున్నారు. కళారంగంలో చేసిన సేవకు గాను లతా మంగేష్కర్‌కు పద్మభూషణ్ (1969), పద్మవిభూషణ్ (1999) పురస్కారాలు వరించాయి. 1989లో ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు కూడా అందుకున్నారు. 1999లో భారతప్రభుత్వం ఆమెను రాజ్యసభ సభ్యురాలిగా కూడా నామినేట్ చేసింది. న్యూయార్క్ విశ్వవిద్యాలయంతో పాటు అనేక విద్యాసంస్థలు ఈ మహా గాయనిని డాక్టరేట్‌తో సత్కరించాయి. 2001లో ప్రతిష్టాత్మక ‘భారతరత్న’ పురస్కారం కూడా ఈ గాయనీమణి సిగలోకి చేరింది. 2006లో ఫ్రాన్స్ ప్రభుత్వపు అధికారిక పురస్కారమైన ‘ది లీజియన్ ఆఫ్ ఆనర్’ లతకు దక్కడం విశేషం.

నేనేంటో నాకు తెలుసు!

మహాగాయనిగా, నైటింగేల్‌ ఆఫ్‌ బాలీవుడ్‌గా కీర్తి గడించిన లత జీవితంలోనూ కొన్ని అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఒక గాయనిగా స్టార్ హోదాను సంపాదించాక లతాజీ అప్పటికి వర్థమాన గాయనీమణులుగా పైకొస్తున్న ఎందరికో అవకాశాలు రాకుండా చేశారని భిన్నవాదనలు తెరమీదికొచ్చాయి. అలాగే, మహ్మద్ రఫీతో పాడిన పాటలకు గానూ ఆమె అదనంగా రాయల్టీ డిమాండ్ చేశారన్న వార్తలు కూడా అప్పట్లో పెద్ద దుమారాన్నే లేపింది. తన తర్వాత తనంత స్థాయిని సంపాదించుకున్న చెల్లెలు ఆశాభోంస్లే విషయంలో కూడా లత కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని వార్తలొచ్చాయి. అయినా ఇలాంటి విమర్శల్ని ధైర్యంగా ఎదుర్కొన్నారీ గ్రేట్‌ సింగర్‌. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఏ ఒక్క విషయాన్నీ సహించలేనని, నవ్వుతూ మాట్లాడుతూనే.. తనేంటో తనకు తెలుసనే విషయాన్ని పలు ఇంటర్వ్యూల ద్వారా ఈ లోకానికి చెప్పకనే చెప్పేవారామె.

క్రికెట్‌ లవర్‌!

* లతాజీకి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. లార్డ్స్ స్టేడియంలో క్రికెట్ చూడాలని అనిపించినప్పుడల్లా తన పేరు మీద ఎప్పుడూ ఏకంగా ఒక గ్యాలరీనే బుక్ చేసుకునేవారట.

* అలాగే నవలలు చదవడం కూడా తనకు ఎంతో ఇష్టమనే లతాజీ.. శరత్‌బాబు, బంకించంద్ర ఛటర్జీ, వి.యస్. ఖండేకర్ తన అభిమాన రచయితలని చెబుతుంటారు.

* కె.ఎల్ సైగల్ పాటలంటే చెవి కోసుకునేదాన్నని పలు సందర్భాల్లో లత పేర్కొనడం గమనార్హం.

* సేవా కార్యక్రమాల నిమిత్తం విదేశాల్లో కూడా అనేక సంగీత ప్రదర్శనలు ఇచ్చారామె.

* అలాగే ఓ సౌందర్య ఉత్పత్తుల సంస్థ లత పేరిట ‘లతా ఇయె డె పెర్ఫమ్’ అనే పెర్ఫ్యూమ్‌ను కూడా మార్కెట్‌లోకి విడుదల చేయడం గమనార్హం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని