Happiness Gurukul: అలా సంతోషాన్ని పంచుతోంది!

సంతోషం కోసం మనం ఏవేవో మార్గాల్ని అన్వేషిస్తుంటాం. నచ్చిన పనులు చేయడం.. ఇష్టమైన వారితో గడపడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే ‘ఇలాంటి సంతోషం ఎక్కడో లేదు.. మనలోనే దాగుంద’ని చెబుతోంది ముంబయికి చెందిన శృతి మహేశ్వరి. వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఆందోళనలతో.....

Published : 27 Apr 2022 21:02 IST

(Photos: happinessgurukul.com)

సంతోషం కోసం మనం ఏవేవో మార్గాల్ని అన్వేషిస్తుంటాం. నచ్చిన పనులు చేయడం.. ఇష్టమైన వారితో గడపడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే ‘ఇలాంటి సంతోషం ఎక్కడో లేదు.. మనలోనే దాగుంద’ని చెబుతోంది ముంబయికి చెందిన శృతి మహేశ్వరి. వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఆందోళనలతో సతమతమవుతూ.. నిరాశలో కూరుకుపోయిన వారికి సంతోషాన్ని దగ్గర చేస్తోంది.. జీవితానికి ఓ ఆశ కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ స్టార్టప్‌నే స్థాపించిందామె. స్వీయానుభవంతో నెగెటివిటీ నుంచి పాజిటివిటీ వైపు అడుగేసిన శృతి.. ‘లివ్‌ లవ్‌ లాఫ్‌’ అంటూ తన సంస్థ ద్వారా ఎంతోమంది ముఖాల్లో నవ్వుల పువ్వులు పూయిస్తోంది.

శృతిది ముంబయి. ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై మక్కువతో దిల్లీ నిఫ్ట్‌లో డిజైనింగ్‌ విభాగంలో మాస్టర్స్‌ చేసింది. నచ్చిన పని చేయడంలోనే సంతోషాన్ని, సంతృప్తిని వెతుక్కుంటూ ముందుకు సాగిన ఆమె.. ఈ రంగంలో తిరుగులేదనిపించింది.

సక్సెసైనా సంతృప్తి లేదు!

సుమారు 15 ఏళ్ల పాటు ఫ్యాషన్‌ రంగంలో కొనసాగిన శృతి.. ఈవెంట్‌ డిజైనర్‌గానూ పేరు సంపాదించింది. ఈ క్రమంలో జాతీయంగా, అంతర్జాతీయంగా తన నైపుణ్యాల్ని నిరూపించుకుంది. ఇందుకు ప్రతిగా పలు అవార్డులు, రివార్డులు ఆమె సొంతమయ్యాయి. అయితే అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా సాగిన ఆమె ప్రయాణానికి ఉన్నట్లుండి బ్రేక్‌ పడింది. నచ్చిన వృత్తిలోనే ఉన్నా.. ఆ క్షణం తన జీవితాశయం ఇది కాదనిపించిందామెకు. ఈ క్రమంలోనే గత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా ఆమె కళ్ల ముందు మెదిలాయి. దీంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిందామె. దీనికి ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ కూడా తోడయ్యాయి. కొన్నాళ్ల పాటు ఇదే నెగెటివిటీతో సావాసం చేసిన ఆమె.. ఆ తర్వాత వీటి నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తనకు తానే ఆత్మపరిశీలన చేసుకుంది. శరీరానికి, మనసుకు ఉన్న సంబంధమేంటో తెలుసుకోవడానికి చిన్న పాటి పరిశోధనలే చేసింది. ఇందులో భాగంగానే మానసిక అనారోగ్యం శరీరంపై ఎంతలా ప్రభావం చూపుతుందో తెలుసుకుంది. మన శరీరంలోని 95 శాతం అనారోగ్యాలకు ఒత్తిడే మూలమన్న విషయం ఈ రెండేళ్ల పరిశోధనల అనంతరమే గ్రహించానంటోంది శృతి.

‘హ్యాపినెస్‌ గురుకుల్‌’ ఉద్దేశమదే!

‘మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనల్ని మానసిక ఒత్తిడిలోకి నెట్టేస్తుంటాయి. ఇలాంటి ప్రతికూలతల్లోంచి బయటపడడానికి ఏవేవో చికిత్సలు తీసుకుంటాం.. మందులు వాడుతుంటాం. నిజానికి ఇలాంటి ప్రతికూలతల్ని దూరం చేసి సంతోషాన్ని దగ్గర చేసే శక్తి ఎక్కడో లేదు.. మనలోనే ఉంది. దాన్ని కనుక్కోగలిగితే మనం సంతోషంగా ఉండడానికి కారణాలు వెతుక్కోవాల్సిన అవసరమే రాదు. మనలోని ఈ అంతర్గత ఆనందాన్ని కనుక్కోవడానికే ‘హ్యాపినెస్‌ గురుకుల్‌’ని ప్రారంభించా. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ వర్క్‌షాప్స్‌, కోచింగ్‌ సెషన్స్‌, కార్పొరేట్‌ సెషన్స్‌.. వంటివి నిర్వహిస్తున్నా..’ అంటూ తన సంస్థ గురించి పంచుకుంది శృతి. తన సెషన్స్‌ ద్వారా మానసిక సమస్యలకు సంబంధించిన మూలాలు వెతుకుతూనే.. వాటిని దూరం చేసే యోగా, ధ్యానం, ప్రాణాయామం, తీసుకునే ఆహారం.. వంటి వాటిని బాధితులకు దగ్గర చేస్తోంది. మరోవైపు.. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఆర్టికల్స్‌ రూపంలో తన వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేస్తూ మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుతోంది శృతి.

అలాగని తనేదో నామమాత్రంగా వీటి గురించి చెబుతుందనుకునేరు.. ఆయా అంశాలపై సర్టిఫైడ్‌ కోచ్‌గా కూడా గుర్తింపు పొందింది శృతి. ముంబయిలోని ‘ది యోగా ఇనిస్టిట్యూట్‌’ నుంచి రిజిస్టర్డ్‌ యోగా ప్రాక్టిషనర్‌గా, ‘హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌’ నుంచి వెల్‌నెస్‌ కోచ్‌గా, క్యాలిఫోర్నియాలోని ‘బెర్క్‌లే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వెల్‌బీయింగ్‌’ నుంచి హ్యాపినెస్‌ కోచ్‌గా.. ధ్రువీకరణ పత్రాలు అందుకుందామె. ఇలా తన నైపుణ్యాలతో ఎంతోమందికి ఆనందాన్ని చేరువ చేస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్