వెండితెరపై మెరిసిన తొలి నటీమణి!

హీరోయిన్ అవుతానని ఒక మధ్యతరగతి ఆడపిల్ల అంటే వింతగా చూసే కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. అలాంటిది వందేళ్లకు పూర్వం అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో వూహించడం కూడా కష్టమే..! కానీ ఆనాడు ఆమె వేసిన మొదటి అడుగే ఇవాళ ఇంతమంది నటీమణుల ఆశయాలకు పునాదిగా నిలిచింది.....

Updated : 06 Mar 2022 16:49 IST

హీరోయిన్ అవుతానని ఒక మధ్యతరగతి ఆడపిల్ల అంటే వింతగా చూసే కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. అలాంటిది వందేళ్లకు పూర్వం అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో వూహించడం కూడా కష్టమే..! కానీ ఆనాడు ఆమె వేసిన మొదటి అడుగే ఇవాళ ఇంతమంది నటీమణుల ఆశయాలకు పునాదిగా నిలిచింది. ఆమే భారతీయ వెండితెరపై తొలిసారిగా మెరిసిన నటీమణి దుర్గాబాయి కామత్. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ఈ మొదటి మహిళ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

1913లో భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే తన మొదటి చిత్రం 'రాజా హరిశ్చంద్ర' విడుదల చేశారు. అందులోని స్త్రీ పాత్రలన్నీ పురుషులే వేశారు. ఎందుకంటే మనదేశంలో ఆడవారు వేదికలెక్కి నటించడం అప్పటికి నిషిద్ధం. నాటకాలలో కూడా స్త్రీ పాత్రలను మగవారే ధరించేవారు. అదే పద్ధతి సినిమాలోనూ కొనసాగింది. అయితే అందులోని కృత్రిమత్వం ఇష్టపడని ఫాల్కే తన తరువాతి సినిమా 'మోహినీ భస్మాసుర్'లో ముఖ్యమైన స్త్రీ పాత్రలను ఆడవారితోనే వేయించాలని నిర్ణయించుకున్నారు. విప్లవాత్మకమైన ఆయన నిర్ణయానికి అంతే ధైర్యవంతులు తోడయ్యారు. ఫలితంగా దుర్గాబాయి కామత్ అనే మరాఠీ మహిళ 'మోహినీ భస్మాసుర్'లో పార్వతిగా నటించడానికి ముందుకొచ్చారు. అలా మొదటిసారి మన వెండితెరపై ఓ నటీమణి అవతరించింది. ఆమె కుమార్తె కమలాబాయి కూడా అదే చిత్రంలో మోహినిగా నటించి భారతీయ చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి బాలనటిగా నిలిచారు.

వీగిపోయిన బంధం!

భారతీయ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి వెండితెరపై తొలిసారి వెలిగిన నటీమణిగా చరిత్రలో నిలిచిపోయిన దుర్గాబాయి కామత్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. తన కూతురిగా, వెండితెరపై మొదటి బాలనటిగా పరిచయమైన కమలాబాయి ఓసారి ఇంటర్వ్యూలో భాగంగా తన తల్లి గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. దుర్గాబాయి 1879లో జన్మించారు. ఆ కాలంలోనే ఆమె ఏడో తరగతి వరకూ చదువుకోవడం విశేషం. ఆ తర్వాత కొన్నాళ్లకు ముంబయిలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో హిస్టరీ టీచర్‌గా పనిచేసిన ఆనంద్ నానోస్కర్‌ను వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహబంధం ఎక్కువకాలం కొనసాగలేదు. పలు కారణాల రీత్యా 1903లో ఇద్దరూ విడిపోయారు. అప్పటికి ఆ దంపతులకు మూడేళ్ల కూతురు (కమలాబాయి) ఉంది.

అలా సినిమాల్లోకి ఎంట్రీ!

ఆ కాలంలో భర్త నుంచి విడిపోయిన భార్య పరిస్థితులు ఎంత దయనీయంగా ఉండేవో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటి పరిస్థితే దుర్గాబాయిది కూడా! ఆ సమయంలో తాను బతకడానికి, తన మూడేళ్ల కూతురిని పోషించుకోవడానికి ఆమె వద్ద డబ్బులు కూడా సరిగ్గా లేవు. అందుకే నటనను ఎంచుకున్నారు దుర్గాబాయి. వూరూరా తిరుగుతూ నాటకాలు వేస్తూ పైసా పైసా కూడబెట్టుకోవడం మొదలుపెట్టారు. దీంతో తన కూతురు చదువుకోవడానికి కూడా వీలుపడలేదు. అందుకే తన కూతురి కోసం ఇంట్లోనే ట్యూషన్ పెట్టించారామె. ఇలా నటన పట్ల తాను కనబరుస్తోన్న ఆసక్తిని గమనించిన దాదాసాహెబ్ ఫాల్కే తన చిత్రం 'మోహినీ భస్మాసుర్'లో ఆమెకు తొలిసారిగా అవకాశమిచ్చారు. అలా భారతీయ వెండితెరపై అరంగేట్రం చేసిన నటీమణిగా చరిత్రలో నిలిచిపోయారు దుర్గాబాయి కామత్. అంతేకాదు.. ఆ కాలంలో సింగిల్ మదర్‌గానూ సక్సెసయ్యారామె.

బెదిరింపులెన్నో!

సినిమాల్లోకి నటీమణుల ఎంట్రీకి బాటలు పరిచిన దుర్గాబాయి కామత్‌కు తన కెరీర్ ప్రారంభంలో చాలామంది నుంచి బెదిరింపులు ఎదురయ్యాయని ఓ సందర్భంలో భాగంగా చెప్పుకొచ్చారు ఆమె కుమార్తె కమలాబాయి. 'అప్పట్లో సినిమాల్లో, నాటకాల్లో ఆడవాళ్ల పాత్రల్ని కూడా మగవాళ్లే పోషించేవారు. ఆ సమయంలో అమ్మ సినిమాల్లోకి ప్రవేశించడం, తద్వారా ఆడవారు కూడా సినిమాల్లోకి ప్రవేశించేందుకు మార్గం సుగమం చేయడంతో చాలామంది మగవాళ్లు ఆమెను బెదిరించారు. ఇందుకు వారికి అవకాశాలు తగ్గడమే ప్రధాన కారణం. అంతేకాదు.. కొన్ని కంపెనీలైతే మహిళల్ని సినిమాల్లోకి తీసుకోవద్దనే నియమనిబంధనల్ని కూడా తీసుకొచ్చాయి. అయినా అమ్మ ధైర్యంగా నిలబడ్డారు..' అని ఓ సందర్భంలో కమలాబాయి పేర్కొనడం గమనార్హం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్