ఎన్నాళ్లో వేచిన ఉదయం ‘పసిడి’తో సాకారమైంది!

ఒలింపిక్స్‌లో వరుస పరాభవాలు.. వెంటాడుతోన్న గాయాలు.. వీటికి తోడు అనీమియా, ఈటింగ్‌ డిజార్డర్స్‌.. ఈవేవీ ఆటపై ఆమెకున్న ప్రేమను ఆపలేకపోయాయి. ‘పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు’ నాలుగోసారి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది. ‘ఇక ఇదే ఆఖరు’ అన్నంత కసితో ఆడింది.

Updated : 30 Jul 2021 17:47 IST

ఒలింపిక్స్‌లో వరుస పరాభవాలు.. వెంటాడుతోన్న గాయాలు.. వీటికి తోడు అనీమియా, ఈటింగ్‌ డిజార్డర్స్‌.. ఇవేవీ ఆటపై ఆమెకున్న ప్రేమను ఆపలేకపోయాయి. ‘పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు’ నాలుగోసారి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది. ‘ఇక ఇదే ఆఖరు’ అన్నంత కసితో ఆడింది. పసిడి పతకాన్ని ముద్దాడి తనతో పాటు తన దేశ ప్రజలందరి కళ్లల్లో తొలిసారి ‘స్వర్ణ’ కాంతులు నింపింది. ఆమే బెర్ముడాకు చెందిన ఒలింపిక్‌ ట్రయథ్లాన్‌ ఛాంపియన్‌ 33 ఏళ్ల ఫ్లోరా డఫీ.

‘స్వర్ణ’ సాకారం!

అట్లాంటిక్‌ మహా సముద్రంలోని అతి చిన్న ద్వీపం బెర్ముడా. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అధీనంలో ఉన్న ఈ దేశ జనాభా 70వేలకు మించి ఉండదు. 1936 నుంచి ఒక్కసారి మినహా అన్ని ఒలింపిక్స్‌ క్రీడల్లోనూ ఆ దేశపు క్రీడాకారులు పాల్గొంటున్నారు. అయితే ఎవరూ పసిడి పతకాన్ని తీసుకురాలేకపోయారు. కానీ తాజా ఒలింపిక్స్‌లో ఆ దేశ ప్రజల స్వప్నం సాకారమైంది. మహిళల ట్రయథ్లాన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ఫ్లోరా డఫీ ఆ దేశానికి తొలి ఒలింపిక్‌ స్వర్ణాన్ని అందించింది. దీంతో పాటు విశ్వ క్రీడల చరిత్రలోనే పసిడి సాధించిన అతి చిన్న దేశం (జనాభా పరంగా)గా బెర్ముడా గురించి అందరూ చర్చించుకునేలా చేసింది.

అందని ద్రాక్షలా ఒలింపిక్స్‌ మెడల్‌!

ట్రయథ్లాన్‌.. పేరుకు తగ్గట్టే స్విమ్మింగ్‌, సైక్లింగ్‌, రన్నింగ్‌.. అనే మూడు క్రీడాంశాలతో మిళితమై ఉంటుందీ ఆట. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి ఫిట్‌నెస్‌, పట్టుదల ఉంటే తప్ప ఇందులో రాణించలేరు. అలాంటిది 2016లో ఒకే ఏడాది మూడు వరల్డ్‌ ట్రయథ్లాన్‌ సిరీస్‌లు గెలిచి చరిత్ర సృష్టించింది ఫ్లోరా. XTERRA వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌ పోటీల్లో వరుసగా ఐదు బంగారు పతకాలు (2014, 15, 16, 17, 19) సాధించింది. ITU ప్రపంచ ట్రయథ్లాన్‌ ఛాంపియన్‌గానూ సత్తాచాటింది.  2018 గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ బంగారు పతకం గెల్చుకుంది. ఇలా ప్రపంచ ఛాంపియన్‌షిప్, కామన్వెల్త్‌ పోటీల్లో తిరుగులేని విజయాలు సాధించిన ఫ్లోరాకు ఒలింపిక్స్‌ పతకం మాత్రం ‘అందని ద్రాక్ష’గానే ఉండిపోయింది.

నాలుగోసారి సాధించేసింది!

మొట్టమొదటిసారిగా 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఫ్లోరా. అయితే రేస్‌ పూర్తిచేయకుండానే పోటీల నుంచి నిష్ర్కమించింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో 45వ స్థానంతో సరిపెట్టుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో 8వ స్థానానికి పరిమితమైంది. అయితే నాలుగోసారి మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నించింది. తన ఒలింపిక్‌ లక్ష్యాన్ని నెరవేర్చుకుంది.

గాయాలు, రక్తహీనత ఇబ్బంది పెట్టినా!

2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే నాటికి ఫ్లోరా వయసు 20 ఏళ్లు. ఆ పోటీల్లో పరాభవం ఆమెను బాగా కుంగదీసింది. దీంతో ఆటను వదిలేసి ఓ దుకాణంలో పనికి చేరింది. చదువుపై దృష్టి సారించింది. యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో నుంచి గ్రాడ్యుయేషన్‌ పట్టా అందుకుంది. డిగ్రీ పూర్తయిన తర్వాత మళ్లీ ఆటలోకి పునరాగమనం చేసింది. పలు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో సత్తాచాటింది. అయితే 2013 నుంచి ఆమెను వరుస గాయాలు వేధించాయి. రక్తహీనతతో పాటు ఇతర రుగ్మతలు బాగా ఇబ్బందిపెట్టాయి. అయితే భర్త సహాయంతో ముందుకే అడుగేసింది ఫ్లోరా. ఆటలో మెరుగయ్యేందుకు పట్టుదలతో కృషి చేసింది. ఈ శ్రమకు ప్రతిఫలమే ప్రస్తుత ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం.

నా భర్తను చూస్తూ !!

‘గాయాలు, సమస్యలతో కొన్నిసార్లు ఈ ఆటను వదిలేద్దామనుకున్నా. అయితే ఎట్టకేలకు నా కల సాకారమైంది. పోటీలకు ముందు ఎలాగైనా గెలవాలన్న ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఈవెంట్‌ను పూర్తిచేశాను. అందుకు నా భర్తే కారణం. ఆయన పక్కనే ఉండి నన్ను ప్రోత్సహించారు. మావారి ముఖంలో చిరునవ్వు చూడగానే భావోద్వేగాలన్నింటినీ నియంత్రించుకున్నాను. విశ్వక్రీడల్లో స్వర్ణ పతకం గెల్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా బెర్ముడాకు మొదటి పసిడి పతకం అందించినందుకు ఎంతో గర్వపడుతున్నాను’ అంటూ ఆనందంతో తడిసి ముద్దయ్యిందీ ట్రయథ్లాన్‌ క్వీన్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్