ఈ చిట్కాలు పాటిస్తే కుడుములు అదుర్స్!

వినాయక చవితి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే పిండి వంటకం కుడుములు/మోదక్‌. ఇవంటే ఆ పార్వతీ నందనుడికి ఎంతిష్టమో మాటల్లో చెప్పలేం! అందుకే ఈ పండక్కి ఏది చేసినా చేయకపోయినా వివిధ రకాల మోదకాలు చేసి ఆ గణనాథుడికి నైవేద్యంగా సమర్పిస్తాం.

Published : 17 Sep 2023 14:05 IST

వినాయక చవితి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే పిండి వంటకం కుడుములు/మోదక్‌. ఇవంటే ఆ పార్వతీ నందనుడికి ఎంతిష్టమో మాటల్లో చెప్పలేం! అందుకే ఈ పండక్కి ఏది చేసినా చేయకపోయినా వివిధ రకాల మోదకాలు చేసి ఆ గణనాథుడికి నైవేద్యంగా సమర్పిస్తాం. అయితే వీటిని తయారుచేయడానికీ ఓ ప్రత్యేకమైన పద్ధతుంది. పిండి కలపడం దగ్గర్నుంచి స్టఫింగ్‌ కోసం తయారుచేసే పదార్థాల దాకా ప్రతి ఒక్క దశలోనూ పకడ్బందీగా ఉండాలి. ఆయా పదార్థాల మోతాదు, స్టఫింగ్‌ తయారీ, తియ్యదనం.. వంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మనం తయారుచేసే కుడుములు ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయేలా వస్తాయి. అలా ఈ మోదకాలు మృదువుగా, రుచిగా రావాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మరి, అవేంటో చూసేద్దామా?

మోదకాలు తయారుచేసే క్రమంలో మనం చేసే మొట్టమొదటి పని బియ్యప్పిండి కలుపుకోవడం. అయితే పిండిని తయారుచేసుకునేటప్పుడు కప్పు బియ్యప్పిండికి కప్పు నీళ్లు పోసి కలుపుకుంటే పిండి ముద్ద సాఫ్ట్‌గా తయారవుతుంది. అదే నీళ్లు కాస్త ఎక్కువ, తక్కువ అయినా కుడుములు మరీ గట్టిగా వస్తాయి. ఇలా పిండి కలిపాక కాసేపు నానబెట్టాలి.

బియ్యప్పిండిని కలుపుకొనేందుకు వేడి నీటిని ఉపయోగించినా కుడుములు సాఫ్ట్‌గా వస్తాయి. అయితే ఈ నీళ్లు మరిగించే క్రమంలో అందులో చిటికెడు ఉప్పు, టీ స్పూన్‌ నెయ్యి వేస్తే పిండి మృదువుగా తయారవుతుంది.. సువాసన కూడా వస్తుంది.

ఇక ఈ కుడుముల్లో స్టఫింగ్ కోసం చాలామంది కొబ్బరి తురుము-బెల్లం కలిపి తయారుచేసిన మిశ్రమాన్ని వాడతారు. అయితే ఈ మిశ్రమం తయారు చేసుకునేటప్పుడు తేమ పూర్తిగా ఇగిరిపోయి స్టఫింగ్‌ ముద్దలా మారేంత వరకు సిమ్‌లో మిశ్రమాన్ని వేయించుకోవాలి. అలాగని మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే పొడిపొడిగా తయారై.. మిశ్రమం స్టఫ్‌ చేయడానికి వీలుగా ఉండదు.

ముందుగా కలిపి నానబెట్టుకున్న బియ్యప్పిండిని కుడుములు చేసుకునే ముందు మరోసారి మృదువుగా కలుపుకోవాలి. ఈ క్రమంలో పిండి కాస్త గట్టిగా, పొడిగా అనిపిస్తే కొన్ని వేడి నీళ్లు చల్లి మరోసారి కలుపుకుంటే సరిపోతుంది. అలాకాకుండా పిండి కలిపిన వెంటనే దానిపై ఓ తడిగుడ్డ చుట్టినా పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇక మోదక్‌ తయారుచేసేటప్పుడు కూడా మీకు కావాల్సినంత పిండిని తీసుకొని మిగతా పిండిపై తడి గుడ్డ వేసే ఉంచాలి.

మోదకాలు తయారుచేసుకునేటప్పుడు మోదక్‌ మౌల్డ్స్‌ ఉపయోగించినా లేదంటే చేత్తోనే మోదక్‌ ఆకృతిలో చుట్టినా.. వాటిపై పగుళ్లు లేకుండా జాగ్రత్తపడాలి. లేదంటే స్టఫింగ్‌ బయటికి వచ్చే అవకాశం ఉంది.

మోదకాలు తయారుచేసేటప్పుడు పిండి చేతులకు అంటుకోకుండా ఉండాలంటే నీళ్లు లేదా నెయ్యిని చేతులకు రాసుకోవాలి.

కుడుముల్లో స్టఫింగ్‌ కోసం వాడే కొబ్బరి తురుము అప్పటికప్పుడు తురుముకున్నది ఉపయోగిస్తే రుచిగా ఉంటాయి. అలాగే మీరు తినేంత తియ్యదనానికి, కొబ్బరి తురుముకు సరిపడా బెల్లం వేసుకున్నప్పుడే వాటి రుచి పెరుగుతుందని గుర్తు పెట్టుకోండి.

కుడుముల్ని ఆవిరిపై 10 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. అలాకాకుండా కొంతమంది మరింత ఉడకాలని ఇంకాసేపు అలాగే ఉంచుతారు. అలా చేయడం వల్ల అవి గట్టిపడతాయి.

బియ్యప్పిండికి బదులుగా రవ్వతో చేసిన మోదకాలైతే ఆవిరిపై ఉడికించాల్సిన అవసరమే ఉండదు. ముందుగా రవ్వను వేడినీటిలో ఉడికించుకొని మెత్తటి ముద్దగా చేసుకుంటే సరిపోతుంది.

ఇక కుడుములు ఉడికాయో, లేదో తెలుసుకోవడానికి దాని పైభాగాన్ని టచ్‌ చేసి తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో పిండి చేతులకు అంటుకోకపోతే అవి ఉడికినట్లే లెక్క! లేదంటే మరో ఐదు నిమిషాల పాటు సన్నటి మంటపై ఉంచితే సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్