ఫోర్బ్స్‌ ‘అత్యంత శక్తిమంతమైన’ మహిళలు!

ఏ రంగంలోనైనా సరే మహిళలు అవకాశాల కోసం వెంపర్లాడే రోజులు పోయి.. పురుషులతో  పోటీ

Updated : 09 Dec 2021 19:15 IST

ఏ రంగంలోనైనా సరే మహిళలు అవకాశాల కోసం వెంపర్లాడే రోజులు పోయి.. పురుషులతో  పోటీ పడుతూ సమర్థంగా రాణించే రోజులొచ్చాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. ఏటా ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసే ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితా! ఈ నేపథ్యంలోనే ఇటీవల విడుదల చేసిన ఈ జాబితాలో నలుగురు భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు. ప్రపంచ వేదిక పైనా తమ జోరుకు తిరుగులేదని నిరూపించారు. ఇంతకీ ఎవరా నలుగురు? తెలుసుకుందాం రండి..

నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి

భారతదేశంలో ఇంటికో చాణక్య వారసురాలు ఉంటారు. చాలా ఇళ్లలో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేది స్త్రీలే. ఈ క్రమంలో భారతదేశానికి పూర్తి స్థాయిలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా 2019 మేలో పదవిని చేపట్టారు నిర్మలా సీతారామన్‌. ఇందిరా గాంధీ తర్వాత అటు ఆర్థిక మంత్రిగా, ఇటు రక్షణ మంత్రిగా బాధ్యతలను నిర్వహించిన మహిళగా ఆమె ఘనతకెక్కారు. మొదట సేల్స్‌ గర్ల్‌గా తన కెరీర్‌ని ప్రారంభించి తర్వాత వివిధ రంగాల్లో రాణిస్తూ మహిళా సాధికారతకు కృషి చేశారు నిర్మల. జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగానూ వ్యవహరించారు. తన అర్థశాస్త్ర నైపుణ్యంతో అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా దేశ ఆర్థిక రంగాన్ని తన భుజాలకెత్తుకునే స్థాయికి చేరారామె. అందుకే ఆమెకు అదనంగా కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా కూడా బాధ్యతలను అప్పగించింది మోదీ ప్రభుత్వం. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు పలు పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దిగజారిన దేశ ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కొన్ని ప్రత్యేక ప్యాకేజీలు సైతం ప్రకటించారు. ఇలా దేశ ఆర్థిక మంత్రిగా తనదైన ముద్ర వేస్తోన్న నిర్మలమ్మ.. తాజాగా ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘వందమంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలో 37 స్థానంలో నిలిచారు. వరుసగా మూడోసారి ఆమెకు ఈ గౌరవం దక్కడం విశేషం.

రోష్నీ నాడార్‌ మల్హోత్రా, HCL ఛైర్మన్‌

1976లో హెచ్‌సీఎల్‌ సంస్థను స్థాపించిన ప్రముఖ వ్యాపారవేత్త శివ్‌ నాడార్‌ భారతీయ ఐటీ రంగంలో తన సంస్థను ఒక మూలస్తంభంలా నిలబెట్టారు. అనతి కాలంలోనే వేల కోట్లకు ఎగబాకిన అటువంటి సంస్థకు సీఈఓగా బాధ్యతలు చేపట్టడం అంటే మామూలు విషయం కాదు. నాడార్‌ వారసురాలిగా ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించారు రోష్నీ నాడార్‌. ఇక గతేడాది సంస్థ ఛైర్మన్‌ పదవి నుంచి శివ్‌ నాడార్‌ వైదొలగడంతో ఆ బాధ్యతల్ని రోష్నీ అందుకున్నారు. తనదైన వ్యూహ రచనతో హెచ్‌సీఎల్‌ సంస్థను లాభాల బాట పట్టిస్తూ.. దేశంలోనే ధనిక మహిళల్లో ఒకరిగా ఎదిగారు. అంతేకాదు.. శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా భారతదేశంలో అత్యున్నత విద్యాసంస్థలను నెలకొల్పి భావితరాలకు విద్యా దానం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫోర్బ్స్‌ రోష్నీ నాడార్‌కు ‘అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితా’లో 52వ ర్యాంకును అందించింది.

కిరణ్‌ మజుందార్‌ షా, బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌

‘బయోకాన్ లిమిటెడ్’ పేరుతో దేశంలోనే అతిపెద్ద బయో ఫార్మాస్యూటికల్ కంపెనీని నెలకొల్పిన ఘనత ఆ సంస్థ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షాకే దక్కుతుంది. 1978లో ఈ సంస్థను స్థాపించిన కిరణ్.. దీని ద్వారా మధుమేహం, క్యాన్సర్, రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపే వ్యాధులను నయం చేసే మందుల్ని ఉత్పత్తి చేసే దిశగా కృషి చేశారు. చక్కటి వ్యాపార దక్షతతో మలేషియాలోనూ ఓ ఫ్యాక్టరీని నెలకొల్పి దాని ద్వారా ఆసియాలోనే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థగా బయోకాన్‌ను అభివృద్ధి చేశారామె. అంతేకాదు.. కొత్త తరహా ఔషధాలు రూపొందించే విషయంలో చొరవ తీసుకొని ముందుకు దూసుకుపోతున్నారు కిరణ్. ఈ క్రమంలోనే వివిధ క్యాన్సర్ల చికిత్స కోసం తయారుచేసే ఔషధాలలో ఉపయోగించే మందు విషయంలో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్‌డీఏ) అనుమతి కూడా తీసుకున్నారు.

కేవలం వ్యాపారంలో రాణించడమే కాదు.. తనలో సేవాగుణం కూడా ఉందంటున్నారు కిరణ్. అందుకే భవిష్యత్తులో ఓ మెడికల్ సెంటర్‌ను ఏర్పాటుచేసి, దాని ద్వారా క్యాన్సర్ చికిత్స కోసం అవసరమైన మందుల్ని సామాన్యులకు సైతం చేరువ చేసే ఆలోచనలో ఉన్నారీ బిజినెస్ వుమన్. ఇలా తనలోని క్రియేటివ్ ఆలోచనలతో కంపెనీని ముందుండి నడిపించడంతో పాటు సేవలోనూ ముందున్న కిరణ్.. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ‘వంద మంది శక్తిమంతమైన మహిళల’ జాబితాలో 72వ స్థానంలో కొనసాగుతున్నారు.

ఫల్గుణీ నాయర్‌, నైకా వ్యవస్థాపకురాలు

బ్యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించి.. ఐదు పదుల వయసులో ఫ్యాషన్‌ రంగంలో తనకున్న మక్కువను గుర్తించారు ఫల్గుణీ నాయర్‌. ఈ క్రమంలోనే నైకా పేరుతో ఆన్‌లైన్‌లో సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించారు. మస్కారా దగ్గర్నుంచి మేకప్‌ రిమూవర్‌ దాకా, ట్యాటూ మొదలుకొని మెహెందీ దాకా.. ఇలా నైకా బ్రాండ్‌తో దొరకని బ్యూటీ ఉత్పత్తంటూ లేదన్నంతగా తన కంపెనీని అభివృద్ధి చేశారామె. వీటితో హెయిర్‌కేర్‌ ఉత్పత్తుల విషయంలో ప్రత్యేక ముద్ర వేసిన ఈ ఉత్పత్తులన్నీ తన వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్స్‌, బ్యూటీ స్టోర్లలోనూ అందుబాటులో ఉంచారామె. అంతేకాదు.. కత్రినా కైఫ్‌, ఈషా అంబానీ.. వంటి ప్రముఖులతో చేతులు కలిపి తన వ్యాపారాన్ని మరింతగా పరుగులు పెట్టిస్తున్నారీ బిజినెస్‌ లేడీ. ఇటీవలే స్టాక్‌ మార్కెట్లోకి అడుగుపెట్టి తన కంపెనీ విలువను ఏకంగా లక్ష కోట్లు దాటేలా చేశారు నాయర్‌. ఇలా తనదైన వ్యాపార దక్షతతో సొంతంగా బిలియనీర్‌గా ఎదిగిన ఆమె.. తాజాగా ఫోర్బ్స్‌ ‘అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలో 88వ స్థానంలో నిలిచారు.

వీరు కూడా!

* మాజీ భర్త జెఫ్‌ బెజోస్‌ నుంచి వేల కోట్ల భరణాన్ని తిరస్కరించి.. దాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా అందించిన సేవా నిరతి మెకంజీ సొంతం.  ఇప్పటికీ తన సేవను కొనసాగిస్తోన్న ఆమె.. నవలా రచయిత్రిగానూ పేరు సంపాదించుకున్నారు. ఇలా సేవ, రచనల ద్వారా ఎంతోమందిలో స్ఫూర్తి రగిలిస్తోన్న మెకంజీ.. ఈ ఏడాది ఫోర్బ్స్‌ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.

* అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఈ ఏడాది జనవరిలో పదవి చేపట్టి.. తద్వారా ఈ బాధ్యతను భుజాలకెత్తుకున్న తొలి నల్లజాతీయురాలిగా, తొలి మహిళగా, తొలి దక్షిణాసియా-అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు కమలా హ్యారిస్‌. ఇక గత నెలలో బైడెన్‌ కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా అందుబాటులో లేని సమయంలో గంటన్నర పాటు అధ్యక్షురాలిగా వ్యవహరించారామె. తద్వారా అమెరికా చరిత్రలోనే అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తించిన తొలి మహిళగానూ ఖ్యాతి గడించారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్‌ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు కమల.

వీరితో పాటు మెలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌ (5), జెసిండా ఆర్డెర్న్‌ (34), షెరిల్‌ శాండ్‌బర్గ్‌ (36), షేక్‌ హసీనా వాజెద్‌ (43), క్వీన్‌ ఎలిజబెత్‌-2 (70), సనా మారిన్‌ (83), సెరెనా విలియమ్స్‌ (85).. తదితర ప్రముఖులు కూడా ఈ ఏడాది ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం సంపాదించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్