Updated : 26/05/2022 16:16 IST

Domestic Abuse: అప్పుడు చనిపోవాలనుకుంది.. ఇప్పుడు పోలీసైంది!

(Image for Representation)

సరిగ్గా ఆరేళ్ల క్రితం.. భర్త పెట్టే హింసను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని బావి దగ్గరికి వెళ్లిందామె. ఎందుకో కాళ్లు, చేతులు వణకడం మొదలైంది.. ఆ క్షణం తన ఏడాది కొడుకు, తల్లిదండ్రులు-తోబుట్టువులు, అష్టకష్టాలు పడి చదివిన డిగ్రీలు.. ఇవన్నీ కళ్ల ముందు కదలాడాయి. అడుగు వెనక్కి వేసింది.. ధైర్యం తెచ్చుకుంది. ఆత్మహత్య ప్రయత్నం విరమించుకొని కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఇన్నాళ్లూ మగ్గిన హింసాత్మక బంధం నుంచి తన కొడుకును తీసుకొని బయటికొచ్చేసింది.. ఉన్నతోద్యోగంతోనే తానేంటో నిరూపించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. కట్ చేస్తే.. కేరళ పోలీస్‌ అకాడమీలో ఇటీవలే ఏడాది శిక్షణ పూర్తిచేసుకొని సివిల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలందుకుంది. ‘పెళ్లి కాదు.. ఉద్యోగమే మన శక్తి సామర్థ్యాలను ఈ ప్రపంచానికి చాటిచెబుతుందం’టోన్న మహిళా పోలీసాఫీసర్‌ నౌజీష కథ మహిళలెందరికో స్ఫూర్తిదాయకం!

నౌజీషది కేరళ కోజికోడ్‌లోని ఓ గ్రామం. ఎంసీఏ వరకు చదువుకొని స్థానిక కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్‌గా చేరింది. ఇలా ఏడాది పాటు విధులు నిర్వర్తించిన ఆమెకు పెళ్లి సంబంధం వచ్చింది. వివాహం తర్వాత తన ఉద్యోగాన్ని కొనసాగించాలనుకుంది.. ఇదే విషయం కాబోయే భర్త, అత్తమామలతో చెప్పగా.. వారూ అందుకు అంగీకరించారు. దాంతో సంతోషంగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది నౌజీష.

తిట్టినా, కొట్టినా.. మౌనంగా భరించేదాన్ని!

మొదట్లో కొన్ని రోజులు అత్తింటి వాళ్లు ఆమెను బాగానే చూసుకున్నారు. ఆ తర్వాతే వాళ్ల అసలు స్వరూపం బయటపడింది. నిజానికి నౌజీష ఉద్యోగం చేయడం ఆమె భర్తకు ఇష్టం లేదు. దీంతో వంటింటికే పరిమితం కావాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అప్పటిదాకా తనతో బాగానే మెలిగిన తన భర్త ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక అయోమయంలోనే ఉద్యోగం మానాల్సి వచ్చిందామె.

‘అతడికి (నౌజీష భర్తకు) నేను కష్టపడి చదివిన డిగ్రీలంటే లెక్కలేదు. ఎలాగోలా నేను వంటింటికే పరిమితం కావాలనుకునేవాడు. మొదట్లో ఇది గ్రహించలేక ఉద్యోగం మానేశాను. ఆ తర్వాత తెలిసింది.. అతడికి వేరే మహిళతో సంబంధం ఉందని! బహుశా.. ఈ విషయం నేనెక్కడ తెలుసుకుంటానో అన్న భయంతో నన్ను ఇంటికే పరిమితం చేశాడు. అయితే అతడి దగ్గర ఈ ప్రస్తావన ఎప్పుడు తెచ్చినా కోపంతో ఊగిపోయేవాడు.. ఒక్కోసారి విచక్షణ కోల్పోయి నాపై చేయి కూడా చేసుకునేవాడు.. ఇలా ఈ హింసను ఏడాది పాటు భరించా. పోనీ.. దీని గురించి అత్తింటి వారికి చెప్పినా నిరుపయోగమే! అమ్మానాన్నలకు చెప్పి వారిని నొప్పించడం నాకిష్టం లేదు..’ అంటూ ఏడాది పాటు తనలో తానే కుమిలిపోయానంటోంది నౌజీష.

ఆత్మహత్య అంచుల దాకా వెళ్లి..!

భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా, భర్త భార్యను ఎంత హింసించినా.. పిల్లలు పుట్టాక వారి ప్రవర్తనలో ఎంతో కొంత మార్పు వస్తుందంటారు. కానీ నౌజీష భర్త విషయంలో అదీ జరగలేదు. పెళ్లైన ఏడాదికి పండంటి కొడుక్కి జన్మనిచ్చిందామె. తన ముద్దుల మూటకు ఐహం నజల్‌ అనే పేరు పెట్టుకుంది. వారసుడు పుట్టినా భర్తలో ఇసుమంతైనా మార్పు కనిపించలేదామెకు. అదే సమయంలో తన భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న నౌజీష కోపం కట్టలు తెంచుకుంది.. మానసికంగా కుంగిపోయింది.. క్షణికావేశంలో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది.

‘ఆ రాత్రి ఆత్మహత్య చేసుకుందామని బావి దగ్గరికి చేరుకున్నా. అయితే ఒక్కసారిగా నా కాళ్లూ, చేతులు వణకడం ప్రారంభించాయి. ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఆ క్షణం నేను ఓ బిడ్డకు అమ్మనన్న విషయం గుర్తొచ్చింది.. నన్ను కన్న తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్లు, రాత్రింబవళ్లూ నేను కష్టపడి చదివిన డిగ్రీలు.. ఇవన్నీ గుర్తొచ్చాయి. నాకోసం ఇంత మంది ఉన్నప్పుడు నేనెందుకు చావాలి.. అంటూ అడుగు వెనక్కి వేశాను. గుండె నిండా ధైర్యం నింపుకొని ఇంటికి చేరుకున్నా. మరుసటి రోజే నా కొడుకుని తీసుకొని పుట్టింటికెళ్లిపోయా..’ అంటూ చెప్పుకొచ్చింది నౌజీష.

పుట్టింటి వారే ఆదుకున్నారు!

కొడుకును తీసుకొని పుట్టింటికి వెళ్లిన నౌజీషకు తన తల్లిదండ్రులు, తోబుట్టువులు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే భర్తతో విడిపోవడానికి నిర్ణయించుకున్న నౌజీష.. విడాకుల కోసం అప్లై చేసింది. మరోవైపు లెక్చరర్‌గా తిరిగి ఉద్యోగంలో చేరింది. అంతలోనే ‘కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎలాగైనా పోలీసు ఉద్యోగం సంపాదించాలని పట్టుబట్టింది.

‘ఓవైపు ఉద్యోగం కొనసాగిస్తూనే.. మరోవైపు పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షల కోసం కోచింగ్‌కు హాజరయ్యేదాన్ని. అయితే తొలి ప్రయత్నం (2018)లో రాత పరీక్షలో పాసైనా.. భౌతిక పరీక్షలో విఫలమయ్యా. అయినా పట్టువదలకుండా 2020లో సక్సెసయ్యా. ‘విమెన్‌ సివిల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌’ జాబితాలో రాష్ట్ర స్థాయిలో 141వ ర్యాంక్‌ వచ్చింది. దీంతో గతేడాది ఏప్రిల్‌లో శిక్షణలో చేరాను..’ అంటూ చెప్పుకొచ్చింది నౌజీష.

వాళ్లకు అండగా ఉంటా!

‘కేరళ పోలీస్‌ అకాడమీ’లో ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకొని సివిల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలందుకుంది నౌజీష. ఈ క్రమంలోనే గ్రాడ్యుయేటింగ్‌ పరేడ్‌ పూర్తిచేసుకున్న అనంతరం తన కొడుకును గుండెలకు హత్తుకొని ఒకింత భావోద్వేగానికి గురైందామె. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

‘ఆఫర్‌ లెటర్‌ అందుకున్న క్షణం భావోద్వేగానికి లోనయ్యా. ఎందుకంటే నా భర్త టార్చర్‌ చేస్తున్నాడని ఒకప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లడానికి నేను భయపడేదాన్ని. అలాంటిది ఇప్పుడు పోలీసాఫీసర్‌గా ఉద్యోగం రావడం గర్వంగా ఉంది. నాలా ఎంతోమంది మహిళలు గృహహింసను మౌనంగా భరిస్తున్నారు. అలాంటి వాళ్లు మిత్ర హెల్ప్‌లైన్‌ నంబర్‌ 181కు కాల్‌ చేయచ్చు. వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తాను. మరొక్క మాట.. పెళ్లే మన జీవిత లక్ష్యం కాదు.. ఆర్థికంగానూ మనం మన కాళ్లపై నిలబడగలిగేలా తయారుకావాలి. చీకట్లో నుంచి బయటికి రండి.. మీరు కన్న కలల్ని నెరవేర్చుకోండి.. ఈ విజయమే మన శక్తి సామర్థ్యాలను బయటి ప్రపంచానికి చాటుతుంది. నా అనుభవం నాకు చెప్పిన పాఠమిదే!’ అంటూ తన మాటలతోనూ ఈతరం మహిళల్లో స్ఫూర్తి నింపుతోంది నౌజీష.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని