Booker Prize : తల్లీకూతుళ్ల మధ్య సంఘర్షణే చదివించేసింది!

‘కథ అంటే ఏకబిగిన పాఠకులతో చదివించేలా ఉండాలి.. అంతటి రచనా సామర్థ్యం కలిగి ఉండడం నాకు ఆ భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం..’ అంటారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ. పెరిగి పెద్దయ్యే క్రమంలో రచనలంటే మక్కువ పెంచుకున్న ఆమె ఎన్నో కథలు, కాల్పనికాలు, నవలలు రచించి.. తనదైన రచనా శైలితో అశేషమైన.....

Updated : 28 May 2022 12:57 IST

(Photo: Twitter)

‘కథ అంటే ఏకబిగిన పాఠకులతో చదివించేలా ఉండాలి.. అంతటి రచనా సామర్థ్యం కలిగి ఉండడం నాకు ఆ భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం..’ అంటారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ. పెరిగి పెద్దయ్యే క్రమంలో రచనలంటే మక్కువ పెంచుకున్న ఆమె ఎన్నో కథలు, కాల్పనికాలు, నవలలు రచించి.. తనదైన రచనా శైలితో అశేషమైన పాఠకాభిమానుల్ని సంపాదించుకున్నారు. అంతేనా.. ఆమె రచనలు పలు విదేశీ భాషల్లోకీ అనువాదితమై ఆమెకు ప్రపంచవ్యాప్త గుర్తింపు సంపాదించి పెట్టాయి. ఇక ఈ ఏడాది ఏకంగా ప్రతిష్టాత్మక ‘అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌’ గెలుచుకునేలా చేశాయి. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి హిందీ నవలా రచయిత్రిగా గుర్తింపు పొందారు గీతాంజలి. అంతేకాదు.. ఆమె రాసిన ‘రేత్‌ సమాధి (టూంబ్‌ ఆఫ్‌ శాండ్‌)’ రచనకు ఈ పురస్కారం దక్కగా.. భారతీయ భాషలో బుకర్‌ప్రైజ్‌ గెలుచుకున్న తొలి పుస్తకంగా తన రచన అరుదైన చరిత్రను లిఖించింది. ఇక ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో అనువదించిన డైసీ రాక్‌వెల్‌తో కలిసి బుకర్‌ప్రైజ్‌ను పంచుకున్నారు గీతాంజలి. ఈ నేపథ్యంలో ఈ మహిళా రచయిత్రి రచనా ప్రస్థానం గురించి కొన్ని విశేషాలు మీకోసం..

కథంటే లోనికి వెళ్లే కొద్దీ ఆద్యంతం ఆసక్తికరంగా, పాఠకుల్ని నవ్వించేలా ఉండాలంటారు దిల్లీ రచయిత్రి గీతాంజలి శ్రీ. ఈ అంశాల్నే తన ప్రతి కథలో రంగరించి తనకంటూ ప్రత్యేకమైన రచనా శైలిని సొంతం చేసుకున్న ఆమె.. తన రచనలతో ఎంతోమంది పాఠకుల ఆదరాభిమానాల్ని చూరగొన్నారు. ఇదే శైలితో 2018లో ‘రేత్‌ సమాధి’ పేరుతో హిందీలో ఓ నవల రాశారామె. దీన్ని అమెరికాకు చెందిన అనువాదకురాలు డైసీ రాక్‌వెల్‌ ‘టూంబ్‌ ఆఫ్‌ శాండ్‌’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ నవల ఈ ఏడాది ప్రతిష్టాత్మక ‘అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌’ గెలుచుకోవడం విశేషం.

ఇంతకీ, ఏంటా కథ?

‘టూంబ్‌ ఆఫ్‌ శాండ్‌’ కథలో భాగంగా.. ఉత్తర భారతానికి చెందిన ఓ 80 ఏళ్ల మహిళ తన భర్త మరణానంతరం తీవ్ర నిరాశా నిస్పృహలు, డిప్రెషన్‌లోకి కూరుకుపోతుంది. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడి తాను తిరిగి కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించిందన్నదే ఈ కథ సారాంశం. ఈ క్రమంలో ఆమె పాకిస్థాన్‌ వెళ్లడం, సంప్రదాయ వాది అయిన ఆమెకు, పూర్తి మోడ్రన్‌ వ్యక్తిత్వమున్న తన కూతురికి మధ్య జరిగే సంభాషణలు, తన జీవితంలోని ఎత్తుపల్లాలను ఎదుర్కొన్న విధానం.. వంటి మలుపులన్నీ రచయిత్రి ఆసక్తికరంగా, భావోద్వేగభరితంగా మలిచారు. అందుకే ఈ పుస్తకాన్ని పాఠకులే కాదు.. బుకర్‌ప్రైజ్‌ న్యాయనిర్ణేతలూ మెచ్చారు. ‘ఎదురులేని నవల’గా ఆమె రచనపై ప్రశంసలు కురిపించారు.

ఎన్నెన్నో ఘనతలు!

2018లో ‘రేత్‌ సమాధి’ పేరుతో గీతాంజలి రచించిన ఈ పుస్తకాన్ని ‘టూంబ్‌ ఆఫ్‌ శాండ్‌’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు యూఎస్‌ రచయిత్రి, అనువాదకురాలు డైసీ రాక్‌వెల్‌. ఈ ఏడాది విడుదలైన ఈ పుస్తకం ‘అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌’ గెలుచుకున్న తొలి హిందీ నవలగా, భారతీయ భాషా పుస్తకంగా చరిత్రకెక్కింది. అంతేకాదు.. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం గెలుచుకున్న తొలి హిందీ నవలా రచయిత్రిగా గీతాంజలి సరికొత్త చరిత్ర లిఖించారు. ఇందుకు ప్రతిగా 50 వేల పౌండ్ల (సుమారు 49.4 లక్షలు) నగదు బహుమతిని గెలుచుకున్న ఆమె.. ఈ మొత్తాన్ని అనువాదకురాలు డైసీతో కలిసి పంచుకున్నారు. ఇక, ఇప్పటికే ఈ పుస్తకం ‘ఇంగ్లిష్‌ పెన్‌ అవార్డు’ కూడా దక్కించుకుంది.

నాకు నేనే స్ఫూర్తి!

సాధారణంగా చాలామంది తమ విజయం వెనుక ఎవరో ఒక స్ఫూర్తి ప్రదాత ఉన్నారని చెబుతుంటారు. కానీ తన సక్సెస్‌కు స్వీయ స్ఫూర్తే కారణమని చెబుతున్నారు గీతాంజలి. మణిపూర్‌లో పుట్టి పెరిగిన ఆమె.. చిన్నతనంలో తన తండ్రి ఉద్యోగ రీత్యా వివిధ రాష్ట్రాలు తిరిగారు. ఆఖరికి దిల్లీలో స్థిరపడిన ఆమె.. ఆంగ్ల మాధ్యమంలోనే చదువు కొనసాగించినా.. హిందీకే ఆకర్షితురాలయ్యారు.

‘నేను రచయిత్రిగా మారేందుకు నాకు నేనే స్ఫూర్తి అని చెప్తా. ఎందుకంటే పెరిగి పెద్దయ్యే క్రమంలో నా గురించి నేను ఎక్కువగా తెలుసుకునే దాన్ని. ఆ విషయాలన్నీ ఓ పేపర్‌పై రాసుకునేదాన్ని. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వోద్యోగి అయిన మా నాన్న రచయిత కూడా! అందుకే ఇంట్లో ఎప్పుడూ ఆ వాతావరణం ఉండేది. ఇక అమ్మేమో ఎక్కువగా హిందీలోనే మాట్లాడేది. అలా రచనలపై, హిందీ భాషపై ఇష్టం పెరిగింది. ఇక పెరిగి పెద్దయ్యే క్రమంలో కొంతమంది ప్రముఖ హిందీ, ఉర్దూ రచయితల్ని కలిశాను. ఇలా నా మనసంతా ఎప్పుడూ పుస్తకాలు, సాహిత్యంపైనే ఉండేది. ఒక దశలో పుస్తకాలు, రచనలే నా వినోదంగా మారిపోయాయి..’ అంటూ చెప్పుకొచ్చారు గీతాంజలి.

అమ్మ పేరే ఇంటి పేరుగా..!

గీతాంజలి అసలు పేరు గీతాంజలి పాండే. అయితే కాలక్రమేణా తన తల్లి శ్రీ కుమారి పాండే పేరులోని ‘శ్రీ’ తన పేరు చివర చేర్చుకొని అమ్మతో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారామె. 1987లో ‘బెల్‌ పాత్రా’ పేరుతో తొలి కథ రాసిన ఆమె.. 1991లో ‘అనుగూంజ్‌’ పేరుతో లఘు కథా సంపుటిని పాఠకులకు అందించారు. వీటితో పాటు మరెన్నో షార్ట్‌ స్టోరీస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన గీతాంజలి.. ‘రేత్‌ సమాధి’ కంటే ముందు ‘మాయ్‌’, ‘హమారా షహర్‌ ఉస్‌ బరాస్‌’, ‘తిరోహిత్‌’, ‘ఖాలీ జగా’.. వంటి నాలుగు నవలలు రాశారు. హిందీ భాషలో ఆమె రాసిన కథలు.. దేశీయ పాఠకుల్నే కాదు.. ఆంగ్లం, ఫ్రెంచ్‌, జర్మన్‌, సెర్బియన్‌, కొరియన్‌.. వంటి విదేశీ భాషల్లోకీ అనువాదితమై.. అక్కడి పాఠ్య ప్రేమికుల్నీ ఆకట్టుకున్నాయి.

‘అద్భుతమైన రచనా సామర్థ్యం నాకు దేవుడు ప్రసాదించిన గొప్ప వరం. నా కథల ప్రయాణం ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు మొదలై.. సాయంత్రం 5 గంటలతో పూర్తవుతుంది. అలాగని మిగతా సమయంలో రచనలకు దూరంగా ఉంటానని అనుకోకండి.. కథను మరింత సృజనాత్మకంగా ఎలా మలచాలో? అందులో కొత్త కొత్త మలుపులు ఎలా తీసుకురావాలో? అన్న విషయాలపైనే నా మనసులో నిరంతరం మేథోమథనం జరుగుతుంటుంది..’ అంటున్నారు గీతాంజలి.

ఆమెతో నాది ఈ-మెయిల్‌ బంధం!

తన అద్భుతమైన రచనా శైలితో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పాఠకుల అభిమానాన్ని చూరగొన్న గీతాంజలి.. తన హిందీ నవలను ఆంగ్లంలోకి అనువదించిన డైసీతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని, జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు.

‘బుకర్‌ ప్రైజ్‌ ఆలోచన గానీ, దాన్ని గెలుచుకుంటానని గానీ కలలో కూడా ఊహించలేదు. ఇంత గొప్ప గుర్తింపు సొంతమైనందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ పుస్తకం హిందీ, ఇతర దక్షిణాసియా భాషల్లో అభివృద్ధి చెందుతోన్న సాహిత్య సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక ఈ క్రమంలో డైసీతో కలిసి పనిచేయడం మరో మధురానుభూతి. నిజానికి ఆమె, నేను ఈ-మెయిల్‌ ద్వారా మొదటిసారి కలుసుకున్నాం. ఇప్పటిదాకా మేమిద్దరం నేరుగా ఒకరినొకరు కలుసుకుంది లేదు. అయినా మా మధ్య సంభాషణలు, చర్చలు ఎంతో సున్నితంగా జరుగుతుంటాయి. నా ఆలోచనా సరళిని తను బాగా అర్థం చేసుకొని అనువదించే తీరు డైసీలో నాకు బాగా నచ్చే అంశం. రచనలకు సంబంధించి మా మధ్య జరిగే చర్చల్లో కొన్ని అంగీకారాలు, మరికొన్ని భిన్నాభిప్రాయాలు తలెత్తుతుంటాయి. అయినా ఆఖరికి అవుట్‌పుట్‌ మాత్రం పక్కాగా వస్తుంది. అందుకు తాజా ఉదాహరణే.. నా నవల బుకర్‌ ప్రైజ్‌ అందుకోవడం!’ అంటున్నారు గీతాంజలి.

ఇక అమెరికాకు చెందిన డైసీ రచయిత్రిగా, అనువాదకురాలిగా, పెయింటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, ఉర్దూ సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించడంలో ఆమె దిట్ట.

ఇలా తన రచనా శైలికి గుర్తింపుగా ‘ఇందూ శర్మ కథా సమ్మాన్‌’ పురస్కారం అందుకున్న గీతాంజలి.. భారత సాంస్కృతిక శాఖ, జపాన్‌ ఫౌండేషన్‌ నుంచి ఫెలోషిప్స్‌ దక్కించుకున్నారు. ఇలా రచనలతోనే కాకుండా.. ‘Vivadi’ అనే నాటక రంగ సంస్థతో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఆమెకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్