ఇంకా పక్క తడుపుతున్నారా?

శ్వేత  కొడుక్కి పదేళ్లు వచ్చినా నిద్రలో పక్క తడుపుతాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ అలవాటును దూరం చేయలేక సతమతమవుతోంది. పిల్లలకు ఈ అలవాటును మాన్పించడానికి కొన్ని చిట్కాలు చెబుతున్నారు నిపుణులు.కొందరు పిల్లలు రాత్రుళ్లు నిద్రలో మూత్రం వస్తున్నట్లు తెలుసుకోలేరు,

Updated : 09 Sep 2022 11:52 IST

శ్వేత  కొడుక్కి పదేళ్లు వచ్చినా నిద్రలో పక్క తడుపుతాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ అలవాటును దూరం చేయలేక సతమతమవుతోంది. పిల్లలకు ఈ అలవాటును మాన్పించడానికి కొన్ని చిట్కాలు చెబుతున్నారు నిపుణులు.

కొందరు పిల్లలు రాత్రుళ్లు నిద్రలో మూత్రం వస్తున్నట్లు తెలుసుకోలేరు, తెలిసినా అదుపు చేసుకోలేరు. కొందరిలో బ్లాడర్‌ చిన్నదిగా ఉండటంతో ఎక్కువ మొత్తంలో మూత్రం నిల్వ ఉండకపోవడం, మరికొందరిలో స్లీప్‌ ఆప్నియా కారణంగా అనుకోకుండా మూత్రం బయటికి రావడం వంటివి కారణాలు అవుతాయి. ఒత్తిడి, భయం ఉన్న చిన్నారుల్లో కూడా మూత్రవిసర్జన తెలియకుండానే అవుతుంది. వీటితోపాటు మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్లు ఉన్నా ఇలా జరుగుతుంది.

శీతలపానీయాలు వద్దు...

జీవనశైలి, ఆహారపుటలవాట్లలో మార్పులు చేస్తే ఈ పక్క తడిపే అలవాటును మాన్పించొచ్చు. రోజంతా కావాల్సినంత నీటిని లేదా ద్రవపదార్థాలను మాత్రమే అందించాలి. రాత్రుళ్లు నీళ్లు, కాఫీ, శీతల పానీయాలు, సోడా వంటివి తాగించకూడదు. నిద్రపోయే రెండు గంటలముందే భోజనం పెట్టాలి. గంట ముందే పాలను తాగించి, పక్కపైకి వెళ్లేటప్పుడు ఒకసారి మూత్ర విసర్జన చేయించాలి. రోజుకి అయిదు నుంచి ఏడు సార్లు మూత్రానికి వెళ్లేలా అలవాటు చేయాలి. వీటితో వాళ్లు నిద్రలో పక్క తడపడం మానే అవకాశం ఉంది.

మాటలతో..

పిల్లలు పక్క తడిపినప్పుడు మాటలతో అవమానించకూడదు. అది పెద్ద విషయం కాదని, క్రమేపీ ప్రయత్నిస్తే తగ్గుతుందనే నమ్మకాన్ని అందించాలి. ఇదొక వ్యాధి అన్నట్లుగా వారి పట్ల తల్లిదండ్రులు ప్రవర్తించి దండించకూడదు. ఇలా చేస్తే భయాందోళనలు కలుగుతాయి. ఇది ఒత్తిడిగా మారి ఈ అలవాటు మరింత అదుపు తప్పుతుంది. అలాగే రాత్రి నిద్రలో ఒకసారి లేపి, మూత్రవిసర్జన చేయించాలి. ఈ అలవాటు క్రమేపీ నిద్రలో మూత్రం వస్తున్నప్పుడు పిల్లలు మేలుకునేలా చేస్తుంది.

నిద్రకు ముందుగా..

చిన్నారులు నిద్రపోయే ముందు ప్రశాంతంగా ఉండేలా చేయాలి. వారికి కథలు, కబుర్లు చెప్పడం, ప్రశాంతంగా నిద్రలోకి జారుకునేలా చేయడం మంచిది. ఒత్తిడి లేకుండా హాయిగా నిద్రపోవడం కూడా ఈ అలవాటు నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుంది. ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచాలి. చిన్నారులెదుట పెద్దవాళ్లు అరుచుకోవడం, నిందించుకోవడం, ఇంటి సమస్యలను చర్చించుకోవడం వంటివి చేయకూడదు. ఇవన్నీ వారి మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. దాంతో పక్కతడిపే అలవాటుకు దగ్గరయ్యే ప్రమాదం ఉంది. ఇల్లెంత ప్రశాంతంగా ఉంటే పిల్లలు అంత మానసికారోగ్యంతో ఎదుగుతారు. ఇలాంటి అలవాట్లకు దూరమవుతారు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా ఈ అలవాటు తగ్గకపోతే వైద్యుల్ని సంప్రదిస్తే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్