మూడ్‌ బాలేదా.. ఇవి లోపించాయేమో!

ఇల్లు, ఆఫీసంటూ తీరిక లేకుండా పని చేసేవారికి ఒత్తిడి సహజమే! కొందరికి పని ప్రభావం లేకపోయినా.. కోపం, ఆందోళన వంటివి వేధిస్తుంటాయి. ముఖ్యంగా డైట్‌ అంటూ కొలిచి మరీ, కొన్ని పదార్థాలనే తినే వారిలో ఈ సమస్య ఎక్కువ.

Updated : 17 Dec 2022 01:14 IST

ఇల్లు, ఆఫీసంటూ తీరిక లేకుండా పని చేసేవారికి ఒత్తిడి సహజమే! కొందరికి పని ప్రభావం లేకపోయినా.. కోపం, ఆందోళన వంటివి వేధిస్తుంటాయి. ముఖ్యంగా డైట్‌ అంటూ కొలిచి మరీ, కొన్ని పదార్థాలనే తినే వారిలో ఈ సమస్య ఎక్కువ. అలాంటప్పుడు శరీరంలో పోషకాలు తగ్గాయేమో చూసుకోమంటున్నారు నిపుణులు.

* మెగ్నీషియం.. నిద్ర సహా శరీరంలో జరిగే ఎన్నో చర్యలకు ఇది తప్పనిసరి. దీని స్థాయులు పడిపోతే నిద్రలేమి, తలనొప్పితోపాటు డిప్రెషన్‌, ఆందోళన, అకారణంగా ఏడుపు వంటి వాటికీ కారణమవుతుందట. కాబట్టి, ముదురు ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు, పప్పుదినుసులు, నట్స్‌, విత్తనాలను తరచూ తీసుకోండి.
* జింక్‌.. నరాల పనితీరులో దీనిది ప్రధాన పాత్ర. మెదడులోనే ఎక్కువ భాగం ఉంటుంది. ఇది ఏమాత్రం తగ్గినా డిప్రెషన్‌, ఒకదానిపై దృష్టిపెట్టలేకపోవడం, మతిమరపు వంటివి కలుగుతాయి. గుడ్లు, పుట్టగొడుగులు, పెరుగు, కోకోవా, చిక్కుడు వంటివి ఎక్కువ తీసుకుంటే దీని లోపముండదు.

విటమిన్‌ డి.. గుండె, మెదడు, కండరాలు, రోగనిరోధకత.. ఇలా ప్రతిదానిపై దీని ప్రభావం ఎక్కువే! శరీరంలో ఇది లోపిస్తే మెటబాలిజం దెబ్బతింటుంది. రోజూ ఉదయాన్నే కొద్దిసేపు ఎండలో ఉంటే దీని లోపముండదు. మరీ అవసరమైతే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లనీ తీసుకోవచ్చు.

* విటమిన్‌ సి.. దీన్ని మనసును ఉల్లాసపరిచే సహజ బూస్టర్‌గా చెబుతారు. మెదడులో న్యూరోట్రాన్‌స్మిటర్ల ఉత్పత్తిలో దీనిది ప్రధాన పాత్ర. ‘సి’ తగ్గితే డొపమైన్‌ స్థాయులూ తగ్గుతాయి. ఫలితమే మనసు బాగోకపోవడం. నిమ్మ, నారింజ, బత్తాయి వంటి సిట్రస్‌ ఫలాలు, క్యాబేజీ, క్యాలిఫ్లవర్‌, బ్రకలీ, ముల్లంగిల ద్వారా ఇది పుష్కలంగా దొరుకుతుంది.

* విటమిన్‌ బి12.. హిమోగ్లోబిన్‌ ఉత్పత్తిలో, నరాల వ్యవస్థ పనితీరులో దీనిది ప్రధాన పాత్ర. మెదడు ఆరోగ్యానికి బి12 సమపాళ్లలో అందడం తప్పనిసరి. ఇది లోపిస్తే డిమెన్షియాతోపాటు ఇతర నరాల సమస్యలొస్తాయి. డెయిరీ, చికెన్‌, గుడ్లు ఈ విటమిన్‌ పొందడానికి ఉత్తమ మార్గాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్