ఆర్జన సరే.. నిర్వహణా నేర్చుకోండి!

ఆర్థిక అంశాల్లో తడబడే అమ్మాయిలే ఎక్కువ. అందుకే డబ్బు నిర్వహణ తండ్రి, అన్న, భర్తల చేతుల్లో పెట్టేస్తుంటారు. తీరా ఏదైనా అత్యవసర పరిస్థితిలో వాళ్లు అందుబాటులో లేనపుడు ఏం చేయాలో తెలియదు. తనలా చాలామంది ఇలానే ప్రవర్తిస్తుండటం షగున్‌ బన్సాలీని ఆలోచనలో పడేసింది. ఆర్థిక నిర్వహణలో కొంత తోడ్పాటునందిస్తే ఈ స్థితిలో కొంత మార్పు తేవచ్చనుకుంది....

Published : 22 Jun 2021 01:26 IST

ఆర్థిక అంశాల్లో తడబడే అమ్మాయిలే ఎక్కువ. అందుకే డబ్బు నిర్వహణ తండ్రి, అన్న, భర్తల చేతుల్లో పెట్టేస్తుంటారు. తీరా ఏదైనా అత్యవసర పరిస్థితిలో వాళ్లు అందుబాటులో లేనపుడు ఏం చేయాలో తెలియదు. తనలా చాలామంది ఇలానే ప్రవర్తిస్తుండటం షగున్‌ బన్సాలీని ఆలోచనలో పడేసింది. ఆర్థిక నిర్వహణలో కొంత తోడ్పాటునందిస్తే ఈ స్థితిలో కొంత మార్పు తేవచ్చనుకుంది.

గున్‌ బన్సాలీ ఓ ప్రముఖ సంస్థలో పీఆర్‌ ప్రొఫెషనల్‌గా చేసేది. మొదటి నుంచి జీతాన్ని నాన్నకి ఇచ్చేది. ఆయన దాన్ని ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టేవారు. తన ఖర్చులు మినహా మిగతా ఎక్కడ, ఎలా దాచారన్న దానిపై ఆమెకు అవగాహన ఉండేది కాదు. పెళ్లయ్యాక భర్త చూసుకోవడం మొదలుపెట్టాడు. ఓసారి తనకో వ్యాపార ఆలోచన వచ్చింది. దాన్ని ప్రారంభించాక అన్ని పనులూ స్వయంగా చూసుకునేది. అకౌంటింగ్‌ దగ్గరికొచ్చేసరికి ఏమీ పాలుపోయేది కాదు. దాంతో భర్త సాయాన్ని తీసుకునేది. కానీ అలా ఆధారపడటం నచ్చలేదంటుందీ ముంబయి అమ్మాయి.

చుట్టూ ఉన్నవాళ్లని కనుక్కొని వాళ్ల మార్గాన్ని అనుసరిద్దామనుకుంది. స్నేహితులు, తోటి ఉద్యోగులూ ఇంట్లో మగవాళ్లపైనే ఆధారపడుతున్నారని తెలుసుకుంది. కానీ ‘ఏదైనా ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తే ఎలా?’ అని ఆలోచించింది. తన సంస్థకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ తనే చూసుకోవడం మొదలుపెట్టింది. అకౌంటింగ్‌ ప్రాథమికాంశాలను నేర్చుకుంది. కానీ ఇవన్నీ నేర్చుకోవడం ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. చిన్న పొరబాటు ఒక్కోసారి పెద్ద చిక్కునే తెచ్చిపెట్టేది. దీంతో నేర్చుకుని చేయడం కంటే దీనిలో ప్రావీణ్యం ఉన్నవారి సలహా తీసుకుని చేయడం మంచిదనుకుంది. ఆ ఆలోచనను తను ఆచరించడంతోపాటు నలుగురికీ అందించాలనుకుంది. దాని ఫలితమే ‘మిస్‌ పిగ్గీ బ్యాంక్స్‌’.

మొదట ఈ పేరుతోనే ఇన్‌స్టా, బ్లాగుల్లో నిపుణుల సాయంతో ఆర్థికపరమైన సలహాలను ఇచ్చేది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పేరున్న ఫైనాన్షియల్‌ ప్లానర్‌లు, అడ్వయిజర్లతో నేరుగా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందుకుగానూ కొన్ని నెలలపాటు ఆర్థిక నిపుణులతోపాటు, సాయం కోసం చూస్తున్న 500 మందితో మాట్లాడింది. వీరిలో 20-40 ఏళ్ల వరకు వారూ ఉన్నారు. రంగంలో పేరున్న, నమ్మకమైన వారి వివరాలను ప్రావీణ్యం ఉన్న విభాగం, సలహా కోసం తీసుకునే ఫీజు వివరాలతో సహా వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. సలహా కావాలనుకునేవారు క్లిక్‌ చేయడం ద్వారా అపాయింట్‌మెంట్‌ పొందొచ్చు.

‘ప్రస్తుతం 16 మంది నిపుణులు మాకోసం పనిచేస్తున్నారు. ఇంకొంత మందితో సంప్రదింపులు చేస్తున్నాం. నైపుణ్యం, నమ్మకమైన వారికే ప్రాధాన్యమిస్తున్నాం. 2021 ప్రారంభంలో వెబ్‌సైట్‌ను మొదలుపెట్టాం. ఇప్పటివరకూ లక్షన్నరకు పైగా మమ్మల్ని సంప్రదించారు. ఆర్థిక స్వాతంత్య్రం కోసం చూసేవారందరికీ ఈవిధంగా మార్గం చూపించడం ఆనందంగా ఉంది’ అంటోంది షగున్‌. అంతేకాదు వెబ్‌సైట్‌ ద్వారా పెట్టుబడి సంబంధిత అంశాలపై వెబినార్లే కాకుండా బిగినర్‌ కోర్సులనూ అందించనున్నారట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్