ఇక ఐదేళ్లు ఆ చింత ఉండదు!  

టీనేజర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ శానిటరీ నాప్కిన్లని ఐదేళ్లు మార్చాల్సిన అవసరం లేదు. భూమిలోనూ తేలిగ్గా కలిసిపోతాయి. పన్నెండేళ్ల క్రితం తనకెదురయిన అనుభవమే ఈ ఆవిష్కరణకు మూలం అని వివరించారు హైదరాబాదీ యువతి దేవీ దత్త...99లో ఒడిశాని వరదలు ముంచెత్తిన సమయం అది. అప్పటికి పదిహేనేళ్ల వయసున్న దేవిదత్త...

Updated : 14 Aug 2021 04:45 IST

టీనేజర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ శానిటరీ నాప్కిన్లని ఐదేళ్లు మార్చాల్సిన అవసరం లేదు. భూమిలోనూ తేలిగ్గా కలిసిపోతాయి. పన్నెండేళ్ల క్రితం తనకెదురయిన అనుభవమే ఈ ఆవిష్కరణకు మూలం అని వివరించారు హైదరాబాదీ యువతి దేవీ దత్త...

99లో ఒడిశాని వరదలు ముంచెత్తిన సమయం అది. అప్పటికి పదిహేనేళ్ల వయసున్న దేవిదత్త.. తల్లితోపాటు ఆ ప్రాంతాలన్నీ తిరిగి మహిళలకు అవసరమైన సాయం అందించింది. వరదనీరు ముంచెత్తిన ఆ సమయంలో స్త్రీలు ఆకలితో కన్నా, నెలసరిలో అవసరం అయిన శానిటరీ నాప్కిన్లు దొరక్కే ఎక్కువ ఇబ్బంది పడ్డారు. ఆ అనుభవం దేవిని కొన్నేళ్లు వెంటాడింది. దానికో పరిష్కారం కోసం పరితపించేలా చేసింది. అందుకే ఆమె 12 ఏళ్లు పాటు ఎన్ని పెద్ద ఉద్యోగాలు చేసినా.. అవన్నీ వదిలి శానిటరీ నాప్కిన్ల తయారీపై దృష్టి పెట్టి విజయం సాధించింది. ‘మా సొంతూరు భువనేశ్వర్‌. నాన్న రాధాకాంతదాస్‌ ప్రభుత్వోద్యోగి. అమ్మ ఓ కాలేజీని నడుపుతూ, సేవా కార్యక్రమాలూ చేసేది. అమ్మ వెంట నేనూ తిరిగేదాన్ని. ఆ సమయంలోనే మహిళలు రుతుస్రావ సమయంలో పడే ఇబ్బందులు, వాళ్లు పాటించే అశాస్త్రీయ విధానాల కారణంగా వచ్చే జబ్బుల గురించీ తెలిసింది. అప్పుడే దీనికో పరిష్కారం కనుక్కోవాలని అనుకున్నా’ అని వివరించింది దేవి. అందుకోసమే తను బయోటెక్నాలజీలో ఇంజినీరింగ్‌ చేసింది. ఆ తర్వాత ఐసీఐసీఐ, వొడాఫోన్‌, ఎయిర్‌సెల్‌ వంటి సంస్థల్లో సేల్స్‌/మార్కెటింగ్‌ విభాగాల్లో 12 ఏళ్లు పని చేసినా లక్ష్యాన్ని మాత్రం మర్చిపోలేదు. ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత ‘రాయల్‌ మెల్‌బోర్న్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ నుంచి ‘డిజైన్‌ థింకింగ్‌’లో ఎంబీఏ చేసింది. ఇంజినీరుగా తన పరిజ్ఞానానికి ఈ కోర్సులో నేర్చున్న డిజైనింగ్‌ నైపుణ్యాలని జోడించి రుతుస్రావ సమస్యలకు పరిష్కారం చూపాలనుకుంది. అలా ‘లెమిబీ’ పేరుతో హైదరాబాద్‌లో స్టార్టప్‌ని ప్రారంభించి ‘పీరియడ్‌ కేర్‌ మార్కెట్‌’లోకి ప్రవేశించింది. టీనేజర్ల కోసం ప్రత్యేక శానిటరీ ప్యాడ్లు, హెవీ ఫ్లో ప్యాడ్లు, టాంపూన్లు అందుబాటులోకి తెచ్చింది. ‘జడ్‌ కప్‌’, ‘జడ్‌ డిస్క్‌’ పేరుతో వినూత్న డిజైన్లని రూపొందించింది. తన ఉత్పత్తులకు యూఎస్‌కు చెందిన ‘ఎఫ్‌డీఏ’ (ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌) అనుమతులూ లభించాయి. ప్లాస్టిక్‌ పరిశోధనా సంస్థ సీపెట్‌ సహకారంతో భూమిలో కలిసిపోయే ప్రత్యేకమైన మెటీరియల్‌తో ‘సూపర్‌ అబ్జార్బింగ్‌ పాలిమర్‌’ అనే ఉత్పత్తిని రూపొందించింది. మొత్తం 15 రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురాగా ఇవి ఆస్ట్రేలియాలోనూ ఆదరణ పొందుతున్నాయి. ‘వీటిని వినియోగించుకోవడం తేలిక. పర్యావరణహితమైనవి. సరిగా శుభ్రపరుచుకుంటే వీటిని ఐదేళ్ల వరకు నిస్సంకోచంగా వాడవచ్చు. ఆన్‌లైన్‌లో అమ్మకాలకి ఆదరణ పెరుగుతోంది. హైదరాబాద్‌లోని మూసాపేటలో వీటిని తయారు చేస్తున్నాం. 20 మందికి ప్రత్యక్షంగా మా సంస్థలో ఉద్యోగాలివ్వగలిగాను. ఈ డిజైన్లకు మేధోసంపత్తి హక్కుల కోసం కూడా దరఖాస్తు చేశా. సాటి మహిళల ఇబ్బందులకు పరిష్కారంగా తయారు చేసిన ఈ ఉత్పత్తులను అన్ని దేశాల్లోనూ విక్రయించాలన్నది నా లక్ష్యం,  దాన్ని సాధించగలను’ అంటూ ఆత్మవిశ్వాసంతో   వివరించింది దేవీదత్త.

- బి.ఎస్‌.రామకృష్ణ, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్