గ్రామీ పోటీల్లో కియారా...

సంగీతంలో అంతర్జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక అవార్డు ‘గ్రామీ.’ 6 దశాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న దీనికి ఇప్పటి వరకూ 49 సార్లు భారతీయులు నామినేట్‌ అయితే.. గెలిచింది

Updated : 23 Nov 2021 06:11 IST

సంగీతంలో అంతర్జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక అవార్డు ‘గ్రామీ.’ 6 దశాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న దీనికి ఇప్పటి వరకూ 49 సార్లు భారతీయులు నామినేట్‌ అయితే.. గెలిచింది 17 సార్లే! అందునా అమ్మాయిలు ఇద్దరు. మహామహులు పోటీపడే దీనికి నామినేట్‌ అవ్వడమే గొప్పగా భావిస్తారు. ఆ అవకాశాన్ని 18 ఏళ్ల వయసులోనే దక్కించుకుంది కియారా ఛెత్రి. ఆమెకది ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం రండి.

గుడ్‌గావ్‌కు చెందిన కియారాకు బాల్యం నుంచి నృత్యంపై ఆసక్తి. తల్లి సంగీత పాఠశాల నిర్వాహకురాలు. అలా సంగీతంపై ఆసక్తి కలిగి నేర్చుకోవడం ప్రారంభించింది. 13 ఏళ్లకే లండన్‌ ట్రినిటీ కాలేజీలో వోకల్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. దీన్నే కెరియర్‌గా మార్చుకోవాలనుకుంది. కొద్దికాలంలోనే తానే రాసి, పాడుతూ సొంతంగా ఆల్బమ్‌లు చేయడం మొదలుపెట్టింది. గాయనిగా తన 15వ ఏటనే ‘యూ విల్‌ సీ’ పేరుతో తొలి ట్రాక్‌ను, 17 ఏళ్లు నిండేలోపే ‘4 ఏఎమ్‌’ అనే ఆల్బమ్‌ను విడుదల చేసి, లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. పది పాటలున్న ఈ ఆల్బమ్‌లో తొమ్మిది ఆంగ్లం, ఒకటి (కినారా తూ) హిందీ. దీన్ని తన తల్లికి నివాళిగా అర్పించింది. తాజాగా వివిధ వాయిద్యాలపై ‘వై’ పేరుతో ఓ మెలొడీ గీతాన్ని రూపొందించింది. ఇదే తనను గ్రామీ అవార్డుల పోటీలో నిలబెట్టడమే కాదు.. ప్రముఖుల ప్రశంసల్నీ అందించింది. ఈ పాట ‘బెస్ట్‌ పాప్‌ సోలో పెర్ఫార్మెన్స్‌’ క్యాటగిరీలో పోటీ పడుతోంది.

‘ఎందరో మహామహులు నిలబడాలనుకునే ఈ వేదికపై నాకూ స్థానం దక్కాలని ఎదురుచూస్తున్నా. నామినేట్‌ అవ్వడాన్నే నమ్మలేకపోతున్నా. చాలా ఉద్వేగంగా, ఆశ్చర్యంగా ఉంది. ఇంత తక్కువ సమయంలో నా సంగీతానికి ఆ అర్హత దొరుకుతుందని కలలో కూడా ఊహించలేదు. ఏటా గ్రామీ అవార్డుల సంబరాలను టీవీలో చూస్తూ.. ఏదోరోజు నాకూ ఆ వేడుకల్లో పాల్గొనే అవకాశం వస్తుందని అనుకుంటుంటా. ఆ అదృష్టం ఇంత తర్వగా వచ్చిందని ఊహిస్తేనే చెప్పలేనంత ఆనందంగా ఉంది. మొదటి ట్రాక్‌ విడుదల చేశాక వచ్చిన స్పందన నా లక్ష్యాన్ని మరింత పెంచింది. భవిష్యత్తులో మరిన్ని ఆల్బమ్‌లు చేయడానికి సిద్ధమవుతున్నా’ అని అంటున్న కియారా ఇంటర్‌ చదువుతోంది. చదువును, సంగీతాన్నీ సమన్వయం చేసుకుంటోంది. లైవ్‌ ప్రోగ్రామ్స్‌లోనూ పాల్గొంటోంది. ప్రస్తుతం మరొక సోలో సాంగ్‌ ‘ఫాలింగ్‌’ పూర్తి చేసిన ఈ యువతేజం గ్రామీ సాధించి సంగీతంలో దేశ పతాకాన్ని రెపరెపలాడించాలని ఆశిద్దాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్