మన అమ్మాయికి.. అంతర్జాతీయ అవార్డు!

ప్రపంచవ్యాప్తంగా గణితశాస్త్రంలో ప్రతిభను చాటేవారికి అందించే ‘రామానుజన్‌ అవార్డు’కు 37 ఏళ్ల నీనాగుప్తా ఎంపికయ్యారు. కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈమె, ఆల్‌జీబ్రాయిక్‌ జామెట్రీ, కమ్యూనిటివ్‌

Updated : 15 Dec 2021 03:27 IST

ప్రపంచవ్యాప్తంగా గణితశాస్త్రంలో ప్రతిభను చాటేవారికి అందించే ‘రామానుజన్‌ అవార్డు’కు 37 ఏళ్ల నీనాగుప్తా ఎంపికయ్యారు. కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈమె, ఆల్‌జీబ్రాయిక్‌ జామెట్రీ, కమ్యూనిటివ్‌ ఆల్జీబ్రాలపై చేసిన కృషి ఈ గౌరవాన్ని పొందేలా చేసింది. దీంతో దేశం నుంచి ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డును దక్కించుకున్న నాలుగో భారతీయురాలిగానూ నిలిచారు.

‘డీఎస్‌టీ-ఐసీటీపీ-ఐఎమ్‌యూ రామానుజన్‌ ప్రైజ్‌’ కమిటీ ఏటా ప్రపంచవ్యాప్తంగా 45 ఏళ్లలోపు గణిత శాస్త్రజ్ఞులను గుర్తించి అవార్డుతో గౌరవిస్తుంది. ఈ ఏడాది నీనాగుప్తాను ఎంపిక చేయడమే కాకుండా, ఆల్జీబ్రాయిక్‌లో ఆమె నైపుణ్యం, ఆవిష్కరణ రేపటితరానికి మార్గదర్శకంగా ఉన్నాయంటూ ప్రశంసించింది. 1949లో మోడ్రన్‌ ఆల్జీబ్రాయిక్‌ జామెట్రీ రూపకర్త ఆస్కార్‌ జరిస్కి లెక్కను 65 ఏళ్ల తర్వాత ఈమె అంటే 2014లో పరిష్కరించి ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ (ఐఎన్‌ఎస్‌ఏ) నుంచి ‘యంగ్‌ సైంటిస్ట్‌’ అవార్డును అందుకున్నారు. 2019లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో ‘శాంతి స్వరూప్‌ భట్నాగర్‌’ వంటి ఎన్నో ప్రముఖ అవార్డులను అందుకున్నారు. స్కూలు స్థాయి నుంచే ఈమెకు లెక్కలంటే ఆసక్తి. బెతునే కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్‌, ఐఎస్‌ఐలో మాస్టర్స్‌, పీహెచ్‌డీ పూర్తిచేసి, అక్కడే ఫ్యాకల్టీ మెంబర్‌గా చేరారు.

అమ్మ చెప్పేది... ‘పదోతరగతి వరకు అమ్మే నాకు లెక్కలు చెప్పేది. ప్రతి చిన్న విషయాన్నీ అర్థమయ్యేలా చెప్పే ఆమె తీరు నాకు ఈ సబ్జెక్టుపై మరింత ఆసక్తిని పెంచింది. తరగతిలో లెక్కల్లో అందరి కంటే ఎక్కువ మార్కులు నేనే తెచ్చుకోవాలనుకునేదాన్ని. ఎప్పుడైనా తగ్గినా పోటీపడి మరీ పై స్థాయిలో ఉండటానికి ప్రయత్నించేదాన్ని. డిగ్రీలోనూ మేథమేటిక్స్‌నే ప్రధానాంశంగా తీసుకున్నా. పీహెచ్‌డీ తర్వాత ఐఎస్‌ఐ కోల్‌కతాకు విజిటింగ్‌ సైంటిస్ట్‌గా వెళ్లేదాన్ని. ముంబయి టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌లో ఫెలోషిప్‌ చేశా. అప్పుడే ఇండియన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నుంచి ‘ఇన్‌స్పైర్‌’ అవార్డునందుకున్నా. ఆ తర్వాత అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా 2012లో కోల్‌కతాకు తిరిగొచ్చా. ఈ స్థాయికి చేరుకున్నానంటే కారణం అమ్మానాన్నే. ఆడపిల్లలకు చదువెందుకు అని ఎంతమంది వారించినా నన్ను చదివించారు. ఎన్నో ఆక్షేపణలు, విమర్శలెదురైనా నాకిష్టమైన రంగంలో నన్ను ప్రోత్సహించారు. నైపుణ్యానికి లింగవివక్ష ఉండదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ అమ్మాయిలు మాత్రం నైపుణ్యాలున్నా.. సామాజికపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాంటి సమయంలో భరోసా నింపి, చేయూతనిచ్చే కుటుంబం ఉంటే చాలు. అసాధ్యమంటూ ఏదీ ఉండదు. గణితాన్ని సాధించాలంటే ఒక జీవితం సరిపోదనిపిస్తుంది. ఈ అవార్డుకు  అర్హత సాధించడం సంతోషంగా ఉంది. మన దేశంలో ఇంకా ఎందరో మేధావులున్నారు. వారి పరిశోధనలు, ఆవిష్కరణలను వెలుగులోకి  తెస్తేనే వాళ్ల విలువ ప్రపంచానికి తెలుస్తుంది’ అంటున్నారు నీనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్