ఆ నూనెతో.. లక్షల వ్యాపారం!

ఏ మందులకూ లొంగని నొప్పి నుంచి ఉపశమనం కోసం ఆ అక్కాచెల్లెళ్ల చేసిన పరిశోధన వారిని హెంప్‌ (గంజాయి కుటుంబానికి చెందిన మొక్క)నూనె వద్దకు చేర్చింది. స్వీయ అనుభవం నుంచి

Updated : 16 Sep 2022 07:24 IST

ఏ మందులకూ లొంగని నొప్పి నుంచి ఉపశమనం కోసం ఆ అక్కాచెల్లెళ్ల చేసిన పరిశోధన వారిని హెంప్‌ (గంజాయి కుటుంబానికి చెందిన మొక్క)నూనె వద్దకు చేర్చింది. స్వీయ అనుభవం నుంచి పొందిన సత్ఫలితాన్ని అందరికీ అందించాలనుకున్నారు. హెంప్‌ ఉత్పత్తుల తయారీ ప్రారంభించి, దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్న జయంతి, షాలినిల స్ఫూర్తి కథనమిది.

చదువు పూర్తిచేసి కెరియర్‌లో స్థిరపడ్డారు జయంతి, షాలిని భట్టాచార్యలు. అకస్మాత్తుగా ఓ రోజు షాలినికి నడుంనొప్పి మొదలైంది. వైద్య పరీక్షలు, చికిత్సలతో నెలలు గడుస్తున్నా ఉపశమనం దొరకలేదు. ఆఫీస్‌కు వెళ్లడమూ మానేసింది. కనీసం కూర్చుని పనిచేయడానికీ శరీరం సహకరించేది కాదు. చిన్న బరువునూ ఒంగి తీయలేకపోయేది. వీళ్లది బెంగళూరు. ఆ నగరంలో వీళ్లు తిరగని డాక్టర్‌ లేరు. చేయించుకోని వైద్యం లేదు. ఆయుర్వేదం, హోమియోపతి అంటూ రకరకాల వైద్యాలు... ఏది చేసినా తాత్కాలిక ఉపశమనమే తప్ప, శాశ్వత పరిష్కారం కనిపించలేదు. ఈ అనారోగ్యం నుంచి చెల్లెలిని ఎలా బయటపడేయాలో జయంతికి అర్థమయ్యేది కాదు. తెలిసిన వారిని అడగడం, రకరకాల పుస్తకాలు చదవడం వంటివి చేస్తూ సరైన ఔషధం కోసం జయంతి అధ్యయనం మొదలుపెట్టింది. అప్పుడే హెంప్‌ నూనె గురించి తెలుసుకుంది. హెంప్‌ మొక్క నుంచి తయారయ్యే ఈ నూనెను వాడితే నడుం నొప్పి నుంచి నెమ్మదిగా ఉపశమనం దొరికింది. నెలల తరబడి బాధించిన నొప్పి తగ్గు ముఖం పట్టడం అక్కాచెల్లెళ్లకు చాలా ఆశ్చర్యాన్ని, సంతోషాన్నీ కలిగించింది.

అధ్యయనం చేసి..
హెంప్‌ నూనె గురించి లోతుగా అధ్యయనం చేశారీ అక్కాచెల్లెళ్లు. దాంట్లో ఉన్న ఔషధ గుణాలు, వాటి వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలపై అవగాహన తెచ్చుకున్నారు. చాలా అనారోగ్యాలను దీంతో తగ్గించొచ్చని తెలుసుకొన్నారు. అప్పుడే వాళ్లకు మరో ఆలోచన వచ్చింది. ఈ మొక్క ఔషధ ఉత్పత్తులను మనమే ఎందుకు తయారు చేయకూడదు అనుకొన్నారు. 2019లో ‘ఇండియా హెంప్‌ అండ్‌ కో’ స్టార్టప్‌ని ప్రారంభించారు. 2021లో ఆహార ఉత్పత్తుల్లో హెంప్‌ విత్తనాలను ఫుడ్‌ అండ్‌ బెవరేజస్‌లో వినియోగించడానికి ‘ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ అనుమతి ఇవ్వడం మాకు మరింత ప్రోత్సాహాన్ని అందించింది అంటుంది జయంతి. ‘ఈ పంట కూడా త్వరగా చేతికొస్తుంది. ఈ మొక్క నాలుగునెలల్లోనే ఎదుగుతుంది. ఇందులో ఔషధగుణాలతో పాటు పోషకాలూ మెండుగా ఉన్నాయి. ప్రొటీన్లు, పీచు, ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలం. గుండె, మెదడు, చర్మం ఆరోగ్యాన్ని పరిరక్షించే గుణాలు ఈ మొక్కలో ఉన్నాయి. హార్మోన్ల మార్పును ఇది సమన్వయం చేస్తుంది. పలు ఔషధాల్లోనూ ఇప్పటికే దీన్ని వినియోగిస్తున్నారు. దీంతో చేసే మందులను ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక వ్యాధులకు సూచిస్తున్నారు. మేం ఈ మొక్క నుంచి హెంప్‌ హార్ట్స్‌, హెంప్‌ ట్రయల్‌ మిక్స్‌, ప్రొటీన్‌ పౌడర్‌, నూడుల్స్‌, బూందీ, బాంబే మిక్చర్‌, వెర్మిసెల్లితోపాటు పెంపుడు జంతువులకు ప్రత్యేకంగా నూనె తయారు చేస్తున్నాం. వీటి ప్యాకింగ్‌ కూడా పర్యావరణ హితంగా తయారు చేస్తున్నాం. మొదట్లో ఈ ఉత్పత్తులను ప్రజలకు చేర్చడానికి చాలా కష్టపడ్డాం. ఈ మొక్క ప్రయోజనాలపై ఎవరికీ అవగాహన లేదు. ఎగ్జిబిషన్ల ద్వారా మా ఉత్పత్తుల గురించి అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేశాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, అమెజాన్‌, బిగ్‌బాస్కెట్‌, నేచర్స్‌ బాస్కెట్‌ వంటి ఫ్లాట్‌ఫారంల ద్వారా వినియోగదారులకు చేరుస్తున్నాం’ అని చెబుతున్న జయంతి తన చెల్లెలు షాలినితో కలిసి గతేడాది రూ.50 లక్షల ఆదాయాన్ని అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్