యూట్యూబర్ల.. ఆదాయం పెంచేస్తాం!

సినిమా ప్రమోషన్లలో తారలూ.. ఇన్‌ఫ్లుయెన్సర్లను సంప్రదించడం చూస్తుంటాం. నెట్టింటి తారల ప్రభావం అలాంటిది మరి. అందుకే చిన్నా, పెద్దా సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ప్రచారానికి వారినే సంప్రదిస్తున్నాయి. ఒకరో ఇద్దరో అంటే సరే! వందల మందికి యాడ్‌లు ఇవ్వాలంటే ఎలా? మనలా సెర్చ్‌ బటన్‌లో వెతకాల్సిందేనా? అవసరం లేదు.. అందుకు మేమున్నాం అంటోంది ఆకెళ్ల కృష్ణప్రియ.

Updated : 13 Dec 2023 10:00 IST

సినిమా ప్రమోషన్లలో తారలూ.. ఇన్‌ఫ్లుయెన్సర్లను సంప్రదించడం చూస్తుంటాం. నెట్టింటి తారల ప్రభావం అలాంటిది మరి. అందుకే చిన్నా, పెద్దా సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ప్రచారానికి వారినే సంప్రదిస్తున్నాయి. ఒకరో ఇద్దరో అంటే సరే! వందల మందికి యాడ్‌లు ఇవ్వాలంటే ఎలా? మనలా సెర్చ్‌ బటన్‌లో వెతకాల్సిందేనా? అవసరం లేదు.. అందుకు మేమున్నాం అంటోంది ఆకెళ్ల కృష్ణప్రియ. ఈ నయా వ్యాపారం గురించి మనతో పంచుకుందిలా..

నిహారిక ఎన్‌ఎం.. దీప్తి సునయిన.. అయ్యో శారద.. సోషల్‌మీడియాలో వీళ్లకి అభిమానులెందరో. వీళ్లకోసం మనమే కాదు.. సంస్థలూ తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం చూస్తుంటాయి. వాళ్లిద్దరి మధ్యా వారధిగా ఉండటం మా పని. ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే.. మాది హైదరాబాద్‌. అమ్మ కళావతి టీచర్‌, నాన్న మూర్తి అకౌంట్స్‌ మేనేజర్‌. 2017లో బీటెక్‌ పూర్తవడంతోనే నాలుగు సంస్థల్లో ఉద్యోగాలొచ్చాయి. వాటిని కాదని స్టార్టప్‌లో టెక్‌ డెవలపర్‌గా చేరా. నిజానికి అప్పట్లో వీటికి అంత ఆదరణ లేదు. అయినా సంస్థ ఎదుగుతోన్న క్రమంలో అన్నీ దగ్గరుండి నేర్చుకోవచ్చని దీన్ని ఎంచుకున్నా. ఓసారి మా క్లయింట్‌ ఒకరు ఇన్‌ఫ్లుయెన్సర్లకి యాడ్‌ ఇవ్వడానికి ప్రయత్నించడం చూశా. ఉత్పత్తిని బట్టి తగినవారిని వెతకడం, జాబితాగా రాసుకొని ఒక్కొక్కరినీ సంప్రదిస్తూ వెళ్లడం వంటివెన్నో చేయాలి. వేగంగా చేస్తేనే పదిరోజుల పని. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌తో హిట్‌ అయ్యిందా సరే.. లేదంటే మరొకరిని వెతుక్కోవాలి. పెద్ద సంస్థలైతే ఒకేసారి వందల మందితో పనిచేస్తాయి. అదింకా సమస్య. ఈ ప్రక్రియంతా తగ్గేలా సాఫ్ట్‌వేర్‌ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇదే ఆలోచనను నేను పనిచేసే సంస్థ ఫౌండర్‌ అరవింద్‌తో పంచుకుంటే తనకీ నచ్చింది. కొంత పరిశోధన తర్వాత ఇద్దరం కలిసి 2021లో ‘స్టార్‌బజ్‌.ఏఐ’ ప్రారంభించాం.

ప్రక్రియ సులువుగా..

ఏఐతో మాకో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఉంది. దాంతో ఏదైనా సంస్థ మాకు కనీసం లక్షకుపైగా ఫాలోయర్లుండి.. ఫలానా రాష్ట్రం, ఇంత బడ్జెట్‌లో వచ్చే ఇంతమంది యూట్యూబర్లు కావాలంటే నిమిషాల్లో అందించగలం. అంతేకాదు.. మామూలుగా సంస్థ ఇన్‌ఫ్లుయెన్సర్లకు యాడ్‌ ఇస్తే వారంలో దాన్ని ఎంతమంది లైక్‌ చేశారు.. వీడియోకి ఎంత సమయం కేటాయించారన్న వివరాలను స్క్రీన్‌షాట్ల రూపంలో అడుగుతుంటాయి. ఒక్కోసారి అవతలివాళ్లు ఇవ్వకపోవచ్చు కూడా. అలాంటప్పుడు ఖర్చు పెట్టిన దానికి ప్రతిఫలం ఉందా అన్నది సంస్థలకు తెలియదు. మా సాఫ్ట్‌వేర్‌లో ప్రతి గంటకి ఎంతమంది, ఏ వయసు వారెక్కువ చూశారు, కామెంట్లు వగైరా సమాచారమూ తెలుస్తుంది. ఫేక్‌ ఫాలోయర్లు.. ఏ వయసుల వారు అనుసరిస్తున్నారన్న విషయాన్నీ అందిస్తాం. సమయం ఆదాతోపాటు కచ్చితత్వం అన్నమాట. యూట్యూబర్లకీ ఆదాయం పెరుగుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, లింక్‌డిన్‌.. అన్ని ప్లాట్‌ఫామ్‌లకీ జోడించాం. దేనిలో ఏ రంగానికి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్‌ కావాలన్నా ఎంచుకోవచ్చు. ఇందుకోసం మెటా అనుమతీ తీసుకున్నాం.

ఊహించలేదు..

ఆలోచన 8 నెలల్లో కార్యరూపం దాల్చింది కానీ.. మార్కెటింగ్‌కే చాలా ఇబ్బంది పడ్డాం. సంస్థలకు వెళ్లి అవగాహన తరగతులు నిర్వహించడం, ఫ్రీ ట్రయల్స్‌ వంటివెన్నో చేశాక కస్టమర్లు మొదలయ్యారు. ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటూ ఫీచర్లు యాడ్‌ చేసుకుంటూ వెళ్లాం. సబ్‌స్క్రిప్షన్‌ సేవలను అందిస్తున్నాం. బజాబ్‌, యమహా, అలెన్‌ సోలీ, సోనీ, వేగాతోపాటు 450 సంస్థలతో కలిసి పనిచేశాం. అంతర్జాతీయ అవకాశాలూ వస్తున్నాయి. తొలిరోజుల్లో ఇద్దరమే. ఇప్పుడు 12 మంది ఉద్యోగులున్నారు. దాదాపు రూ.15 లక్షలతో మొదలుపెడితే.. రెండుసార్లు రూ.40 లక్షలు, రూ.4 కోట్ల చొప్పున పెట్టుబడులొచ్చాయి. అసలు చిన్న ఆలోచన ఇంతవరకూ వస్తుందనే ఊహించలేదు. అలాగని ఇబ్బందులు లేవనేం కాదు.. నాకు 26ఏళ్లు. ఆంత్రప్రెన్యూర్‌ అంటే నమ్మడం సంగతి అటుంచితే.. చిన్నపిల్ల అంటూ విషయమూ వినేవారు కాదు. కొందరు ‘అమ్మాయివి నీకేం తెలుస’నేవారు. ఏడ్చిన రోజులున్నాయి. నా గొంతు వినపడే స్థాయికి వెళ్లాలన్న దృఢనిశ్చయమే నన్ను నడిపిస్తోంది. స్టార్‌బజ్‌ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి, ఫోర్బ్స్‌ జాబితాకెక్కాలని కల. అమ్మాయిలం.. ప్రయత్నానికి ముందే సందేహిస్తూ ఆగిపోతాం. అలాకాకుండా ఏదైనా చేయాలనిపిస్తే అడుగేయాలి. ఒకసారి ప్రయత్నం మొదలైతే.. పడినా మనమే నేర్చుకుంటూ వెళతాం. కాబట్టి.. ధైర్యం చేయాలి. నాతోటివారికి నేనిచ్చే సలహా ఇది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్