కళాత్మకంగా..
గదులన్నింటిలో కళానైపుణ్యాన్ని నింపాలి. ఆ ప్రభావం గది అందాన్ని పెంచడమే కాదు, మనసుతో ముడిపడి సంభాషిస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి దరిచేరకుండా చేస్తుంది. ఏదైనా ఇతరప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిఫలించేలా ఉండే చిత్రలేఖనాలు, ఆర్ట్‌మ్యూరల్స్ వంటివాటిని ఎంచుకొని ఇంటికి తెచ్చుకోవాలి. వాటిని ఇంటి గోడలకు అలంకరించుకుంటే ఆ జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి.
ఇంటిని కళాత్మకంగా తీర్చిదిద్ది, గదిగదినీ సృజనాత్మకతతో నింపితే చాలు. ఇల్లంతా కొత్త అందాన్ని సంతరించుకుంటుంది అంటున్నారు ఇంటీరియర్ నిపుణులు.
గదులన్నింటిలో కళానైపుణ్యాన్ని నింపాలి. ఆ ప్రభావం గది అందాన్ని పెంచడమే కాదు, మనసుతో ముడిపడి సంభాషిస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి దరిచేరకుండా చేస్తుంది. ఏదైనా ఇతరప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిఫలించేలా ఉండే చిత్రలేఖనాలు, ఆర్ట్‌మ్యూరల్స్ వంటివాటిని ఎంచుకొని ఇంటికి తెచ్చుకోవాలి. వాటిని ఇంటి గోడలకు అలంకరించుకుంటే ఆ జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి. గదికి ప్రత్యేకతను అందిస్తాయి. చిత్రలేఖనాలు ఇంటికి క్లాసిక్ లుక్ తెచ్చిపెడతాయి. మీ వ్యక్తిత్వం, అభిరుచికి ప్రతిరూపాలుగా మారతాయి.
మ్యూరల్స్..
గతంలో గది గోడలకు చిత్రలేఖనాలు లేదా ఫొటోలను వేలాడేసే సంప్రదాయం ఉండేది. ప్రస్తుతం ఆ స్థానంలో మ్యూరల్స్ ఇంటికి ఆధునికతను అందిస్తున్నాయి. మనసుకు నచ్చిన ప్రతిరూపాలు, మనోభావాలను ప్రతిఫలించే తైలవర్ణాలతో తీర్చిదిద్దిన మ్యూరల్స్ గదిగదికీ కొత్తర్థాన్ని చెబుతున్నాయి. అలాగే గలగలపారే సెలయేరు లేదా పచ్చదనం నిండిన కారడివి వంటివి గోడపై నింపితే చాలు. గదిలోనే ఉన్నా మనసు ప్రకృతిలో విహరిస్తున్నట్లు అనిపించేలా చేస్తాయివి.
శిల్పం..
గదిలో ఏ మూల ఉంచినా.. శిల్పం మనతో సంభాషించినట్లు అనిపిస్తుంది. లోహం, చెక్క, సెరామిక్, ఫైబర్‌గ్లాస్ వంటివాటితో చేసే శిల్పాలకు పలువర్ణాలద్ది గదికి తగినట్లుగా సర్దితే చాలు. హాల్, పడకగది.. ఏ గదిలోనైనా దానికి తగిన శిల్పాన్ని సర్ది, పక్కగా ఓ ఇండోర్‌మొక్క లేదా పెద్ద ఫ్లవర్‌వాజ్ ఉంచితే చాలు. దానిపై కాంతిపడేలా చిన్న ల్యాంప్ ఆ ప్రాంతాన్నంతా ఆకర్షణీయంగా మార్చేయగలదు. బుద్ధుడు లేదా కృష్ణుడి శిల్పం పక్కగా మినీ వాటర్‌ఫాల్ ఏర్పాటు కూడా సహజత్వాన్ని తెచ్చిపెడుతుంది.
ఆర్ట్ ప్రింట్స్..
డిజిటల్ ఆర్ట్ ప్రింట్స్‌ను గది గోడలకు ఏర్పాటు చేసుకోవచ్చు. నచ్చిన వ్యక్తులు లేదా సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినవాటిలో నాణ్యమైన ప్రింట్స్‌ను ఎంచుకోవాలి. మూడునాలుగు నెలల తర్వాత వీటి స్థానంలో మరొక డిజైన్‌ను మార్చుకొంటే, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తెచ్చుకోవచ్చు. సందర్భాన్నిబట్టి గోడలపై మెరుస్తూ, ఇంటికి ఇవి కళాత్మకతను అందిస్తాయి. వీటిలో 3డీ ప్రింట్స్‌ను ఎంచుకుంటే మరింత సహజత్వాన్ని తెచ్చిపెడతాయి. గోడలపై విరిసినట్లు అనిపించే పూల డిజైన్లు, నట్టింట కారడవి ప్రత్యక్షమైనట్లుగా ప్రకృతిదృశ్యాలను ఎంచుకుంటే ఇంటికి అందమే కాదు, ఆ అనుభూతి మనసుకు ప్రశాంతతనూ అందిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.