పదిహేను లక్షల మందికి...సౌరశక్తి!

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ‘జీఈఎస్‌’లో... ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్స్‌ త్రూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ విభాగంలో సుమారు డెబ్భైఐదు మంది వ్యాపారవేత్తలు పోటీపడితే... వారిలో గ్రాండ్‌ ఛాంపియన్‌షిప్‌ను అందుకుంది అజైతా షా. ఆ గుర్తింపు వెనకున్న ఆమె గెలుపు కథేంటో చూద్దామా... మార్పుని కోరుకోవడం చిన్న విషయమే. కానీ దానికోసం ప్రయత్నించడమే పెద్ద సవాలు. కష్టం. అది నాకు అనుభవ పూర్వకంగానే అర్థమయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన జీవనవిధానానికి ఇంధనం ఎంత అవసరమో తెలుసుకున్నప్పుడు ఆ దారిలోనే నడవాలనుకున్నా.

Updated : 09 Dec 2022 13:56 IST

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ‘జీఈఎస్‌’లో... ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్స్‌ త్రూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ విభాగంలో సుమారు డెబ్భైఐదు మంది వ్యాపారవేత్తలు పోటీపడితే... వారిలో గ్రాండ్‌ ఛాంపియన్‌షిప్‌ను అందుకుంది అజైతా షా. ఆ గుర్తింపు వెనకున్న ఆమె గెలుపు కథేంటో చూద్దామా...

మార్పుని కోరుకోవడం చిన్న విషయమే. కానీ దానికోసం ప్రయత్నించడమే పెద్ద సవాలు. కష్టం. అది నాకు అనుభవ పూర్వకంగానే అర్థమయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన జీవనవిధానానికి ఇంధనం ఎంత అవసరమో తెలుసుకున్నప్పుడు ఆ దారిలోనే నడవాలనుకున్నా. ఆ మార్గంలో ముళ్లూ, రాళ్లను లెక్కచేయలేదు. అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి సవాళ్లను సులువుగా స్వీకరించా. 2017 నాటికి సుమారు మూడున్నర లక్షల సోలార్‌ ఉత్పత్తులను లక్షలాది దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలకు అందించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం. అలా ఇప్పటిదాకా పదిహేను లక్షలమంది జీవితాలని ప్రభావితం చేశాం. అసలు నేను ఇటువైపు అనుకోకుండానే వచ్చా. మాది జైపూర్‌. నగల వర్తక కుటుంబ నేపథ్యం. నేను పుట్టకముందే అమెరికాలో స్థిరపడ్డాం. అక్కడే నా చదువూ సాగింది. అమెరికా వెళ్లినా సంప్రదాయాలు, భారతదేశంపై ప్రేమ అణవణువూ అలానే ఉన్నాయి. మా ఇంట్లో ఆడపిల్ల తన కాళ్లపై తాను నిలబడాలని తరచూ చెప్పేవారు. దాంతో కాలేజీలో ఉన్నప్పటి నుంచే నా ఆలోచనలకు పదును పెట్టడం మొదలుపెట్టా.
భారత్‌కి వచ్చా... ఓ పక్క చదువుకుంటూనే ‘‘అమెరికాతో - యూరప్‌ సంబంధాలు’’ అనే అంశంపై పరిశోధన చేశా. ఆపై స్పెయిన్‌లోనూ ఆరునెలలపాటు ఉడ్రో విల్సన్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్కాలర్స్‌లో ‘‘మిలటరైజేషన్‌ ఆఫ్‌ పాకిస్థానీ ఎకానమీ’’ అనే అంశంపై కూడా పరిశోధన చేశా. ఆ తర్వాత భారత్‌కి వచ్చి ఐదు సంవత్సరాల పాటు సూక్ష్మరుణ సంస్థలతో కలిసి పని చేయడం మొదలు పెట్టా. అప్పుడే ఓ కరెంటు లేని గ్రామంలో పనిచేయాల్సి వచ్చింది. అక్కడ కిరోసిన్‌ వల్ల ఓ తల్లీబిడ్డ ఒళ్లంతా కాలిపోయింది. అది చూశాక ఇలాంటివారికి ఏదో ఒకటి చేయాలని అనిపించింది. ఆ తర్వాత అప్పటి భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అమెరికా వెళ్లి పౌర అణు ఒప్పందంపై సంతకం చేయడం తెలిసింది. ఒక్కసారిగా అనేక సందేహాలూ, వివాదాంశాలు తెరపైకి వచ్చాయి. అసలు ఇదంతా ఎందుకో నాకు తెలుసుకోవాలని అనిపించింది. 2006 నుంచి నాలుగేళ్లపాటు దఫాల వారీగా సుమారు ఐదువేల గ్రామాల్లో తిరిగాను. వారి కష్టాలు అర్థం చేసుకోవడం చెప్పినంత సులువేం కాదని కొద్దికాలానికే అర్థమయ్యింది. లక్షలాదిమంది కిరోసిన్‌ దీపాల వెలుగులో జీవితాల్ని గడిపేస్తున్నారు. వాళ్లకు తాగునీరూ, విద్యుత్తు అందని ద్రాక్షే. ఏటా వంటింట్లో వంటచెరకును ఉపయోగించడం వల్ల వచ్చే పొగ లక్షలాది మంది మహిళల ప్రాణాలనే తీసుకుంటోంది. వీటన్నింటికీ పరిష్కారం చూపాలనుకున్నా. కానీ ఎలా అనేదే తెలియలేదు.
ప్రత్యామ్నాయం ఎలాగంటే.... బాగా ఆలోచించాక జలవిద్యుత్తు, థర్మల్‌, న్యూక్లియర్‌ శక్తికి ప్రత్యామ్నాయంగా, వాటికన్నా సులువైన, పర్యావరణహితమైన ఇంధన శక్తిని ఆ గ్రామీణులకు ఇవ్వాలనుకున్నా. వాళ్ల జీవితాలతో మమేకం కావడం, వారితో కలిసిపోయి అవసరాలను తీర్చడం చెప్పినంత సులువు కాదు. అందుకే ఎస్‌కేఎస్‌, ఉజ్జీవన్‌ సూక్ష్మ రుణ సంస్థలతో కలిసి పనిచేశా. చాలామంది ఉత్పత్తిదారులు అప్పటికే సౌర పరికరాలను ఆ గ్రామీణులకు అమ్ముతున్నారని తెలిసింది. కానీ వాటివల్ల ఉపయోగం అంతంతమాత్రం. ఏదయినా సమస్య వస్తే.. వాటిని బాగు చేయడానికో, నిర్వహించడానికో ఎవరూ అందుబాటులో లేకపోవడమే దానికి కారణం అని అర్థమైంది. అలాంటివాళ్ల చేత ఆ ఉత్పత్తులు వాడేలా చేయాలని అనుకున్నా. కానీ కొనిపించడం కష్టం. పోనీ ఉచితంగా ఇస్తే.. వాటి విలువ వారికి అర్థం కాదు. అందుకే వాటిని తయారీ దారుల నుంచే తక్కువ ఖరీదుకి ఇప్పించాలనుకున్నాం.
ఎలా అందిస్తామంటే... కరెంటు అందుబాటులో లేని ఇళ్లల్లో అవసరాలను గుర్తించి వాటిని ఓ డేటాబేస్‌లా రూపొందించాం. ఆ తర్వాతే ఫ్రంటియర్‌ మార్కెట్స్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేశా. స్థానిక సోలార్‌ ఉత్పత్తుల తయారీదారులతో కలిసి పనిచేయడం మొదలుపెట్టా. వారికి మా డేటాబేస్‌ ఆధారంగా అవసరాలు తెలియజేశాం. వారి సాయంతో వీధిదీపాలూ, ఇళ్లల్లో వాడుకునేవీ, రక్షక్‌ టార్చ్‌లు, పొగలేని పొయ్యిలూ, నీళ్ల మోటార్లూ, ఫ్యాన్లూ, కుట్టుమిషన్లూ, ఫ్రిజ్‌లూ, మిల్క్‌బ్లెండర్ల వంటివాటి తయారీ మొదలుపెట్టాం. వాటి నిర్వహణే అసలు సమస్య అని ఆలోచించే స్థానిక మహిళలూ, యువతల్ని చేరదీసి సోలార్‌ పాయింట్ల పేరుతో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాం. ఇందుకోసం ‘‘సోలార్‌ సహేలీ’’ పేరుతో మహిళా బృందాలను ఏర్పాటుచేశా. ఫ్రంటియర్‌ మార్కెట్స్‌ (జీవన్‌ సహయోగిస్‌) పేరుతో ప్రత్యేక సిబ్బందిని నియమించాం. సాంకేతితక శిక్షణనూ అందించాం. అంగన్‌వాడీ కార్యకర్తలూ, నాబార్డ్‌, మహిళా గ్రూపుల సాయమూ తీసుకున్నా. దీంతో రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌లో ‘‘సరళ్‌ జీవన్‌’’ పేరుతో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వివిధ ప్రయత్నాలు చేశాం. వీటిని కొనలేనివారికి 45 రోజుల్లో స్థానిక బ్యాంకులూ, సూక్ష్మరుణ సంస్థల ద్వారా రుణం ఇప్పిస్తాం. ఇవన్నీ ఫలితాన్నిచ్చాయి. రాజస్థాన్‌లోని పన్నెండు జిల్లాల్లో సేవలు అందిస్తున్నాం. 800 రిటైల్‌ పాయింట్ల ద్వారా ఇప్పటివరకూ పదిహేను లక్షలమంది మా సంస్థ ద్వారా ప్రయోజనం పొందారు. మా ఉత్పత్తులు ఆరు డాలర్ల నుంచి నూటయాభై డాలర్ల వరకూ ఉన్నాయి. 2019 నాటికి మూడు రాష్ట్రాలకు మా సేవలు విస్తరించనున్నాం. ఈ ప్రయత్నమే మాకు తాజాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. జీఈఎస్‌లో హెల్త్‌కేర్‌ అండ్‌ లైఫ్‌సైన్స్‌, డిజిటల్‌ ఎకానమీ-ఫైనాన్షియల్‌ టెక్నాలజీ, ఎనర్జీ అండ్‌ ఇన్‌ఫ్రా, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగాల్లో నలుగురు ఉంటే.. మొదటి అవార్డు నాకే వచ్చింది. నిజంగా మా అందరి శ్రమకు దొరికిన గుర్తింపే ఇది!

- స్వాతి కొరపాటి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్